మణిపూర్‌ లోయల్లో చిందుతున్న నెత్తుటికి కారకులెవరు?

ప్రభుత్వాల అసమర్ధత వల్ల దేశంలో రాష్ట్రాల్లో కొత్త ఉద్యోగాల కల్పన లేదు. దాదాపు ఎనభై శాతం అక్షరాస్యత కలిగిన మణిపూర్‌లో ఉద్యోగాల ఊసే
లేదు. ఇదీ కూడా అసమ్మతికి అంతర్లీన ఆజ్యమే. వీటిని దారి మళ్లింపు కుట్రలో భాగమే రిజర్వేషన్లకై ఎగదోసే దొంగ తెలివి. ఇందులో బీజేపీ ఆరితేరినదే కదా!
     ఈ ట్రాప్‌లో మేయితీ లు పడ్డారు. ఇవన్నీ అంతర్భాగంగా ఉండగా ”మూలిగే నక్కపై తాటి కాయ పడ్డట్టు” ఎస్‌టీ హోదా ఇవ్వమని, నాలుగు
వారాల్లో కేంద్రానికి నివేదిక ఇయ్యమని, హైకోర్టు చెప్పడంతో నిప్పు రాజుకుంది. నిప్పుని రాజేసింది, ఎగదోసింది కాషాయులేనన్నది తెలియని సత్యం.
     ఆరోజు మే 3వ తేదీ. అది మణిపూర్‌లోని ఇంఫాల్‌ పట్టణంలోని న్యూ లాంబులేన్‌ వద్ద సాయంత్రం కావస్తుంది. చెట్లు మెల్లగా గాలికి కదులుతున్నాయి. పెద్ద ర్యాలీ అటువైపు వస్తుంది. గాలిలో ఒక్కసారే వేగంగా కదిలిన ఛాయ, తెల్లని బొలెరోలో నుంచి సడెన్‌గా బుల్లెట్‌ దూసుకొచ్చి ర్యాలీలో ఉన్న ఓ మనిషి తొడలోకి చొచ్చుకు పోయింది. ఓ పెద్ద జర్క్‌. బుల్లెట్‌ దెబ్బతో వాతావరణం వేడెక్కింది. అక్కడి శరీరాల్లో రక్తం వేగంగా ప్రవహించడం మొదలెట్టింది. కళ్లు ఎర్రబడ్డాయి. చేతులు బిగుసుకున్నాయి. నినాదాలు ఊపందుకున్నాయి. వెనక బడిన తమ కొండల్లోకి మేయితీలకు గిరిజనులుగా గుర్తించమని నాలుగు వారాల్లో కేంద్రానికి రిపోర్ట్‌ పంపమని ఆర్డర్‌ పాస్‌ చేసిన దాన్ని నిరసిస్తూ ఆల్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆఫ్‌ మణిపూర్‌ (ATSUM) పిలుపునిచ్చిన ‘గిరిజన సంఘీభావ యాత్ర’ సందర్భంగా అనేక కొండ జిల్లాల్లో నిరసన ర్యాలీ శాంతియుతంగా ముగియగా, చురచంద్‌ పూర్‌, మోయిరాంగ్‌, మోట్‌బంగ్‌ మరియు మోరేలో కాల్పులు, విధ్వంసం, ఘర్షణలు జరిగాయి. ఆ తర్వాత ఘర్షణలు చెలరేగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో మెయితీ కమ్యూనిటీ ఎక్కువగా నివసించే ఇంఫాల్‌, బిష్ణుపూర్‌ లోయ, కుకీ, నాగ తెగలు ఎక్కువగా నివసించే చుర్‌ చాంద్‌పూర్‌, కుంగ్పొక్పి జిల్లాలతో సహా అనేక ప్రాంతాల్లో అనేక గృహాలు ధ్వంస మయ్యాయి. 70మంది పైగా ప్రాణాలు పోగా, 9వేల ఇండ్లు ధ్వంసమయ్యాయి, 20వేల మంది నిరాశ్రయు లయ్యారు. ఇతర ప్రాంతాల్లో క్యాంప్‌లలోకి పంపబడ్డారు. మణిపూర్‌ చల్లని లోయల్లో, కొండల్లో రేగిన చిచ్చుకు కారకులెవ్వరు?
     మణిపూర్‌ చుట్టూ కొండలతో తొంబై శాతం చుట్టబడి పదిశాతం లోయలతో ఉంటుంది. కుకీ, నాగ, జోమి లాంటి ప్రధాన తెగలలో పాటు 34రకాల తెగలు కొండ ప్రాంత జిల్లాల్లో నివసిస్తారు. లోయల్లో మెయిటీ తెగ వాళ్లు ఎక్కువగా ఉంటారు. మెయిటీ జాతి 53శాతం పది శాతం లోయ ప్రాంతంలో ఉంటుండగా, 40శాతం జనాభా ఉన్న కుకీ, నాగ, జోమి తెగలు తొంబై శాతం కొండ ప్రాంతాల్లో ఉంటున్నారు. ఈ డెమోగ్రఫీ సహజం గానే కొంత తేడాని చూపిస్తుంది. కానీ ఇన్నేండ్లుగా జియోగ్రఫీ, డెమోగ్రఫీలో అంతరాలు ఉన్న కలిసే ఉన్న మేయితి, కుకీ, నాగ తెగలు ఇప్పుడు భగ్గుమని బరస్ట్‌ అవడానికి కారణం పాలకులు అంటించిన అగ్గే. 41శాతం హిందువులు, 41శాతం క్రిస్టియన్లు, 8శాతం మంది ముస్లింలు. మెయితీలు హిందువులు, ముస్లింలుగా ఉన్నారు. సనాతన మేయితీలు 8.5శాతం మంది ఉంటారు. మేయితీలు, సనాతన మహస్‌, ముస్లింలు వీళ్ళందరినీ మేయితీలే అంటారు. అధికారంలో వాళ్ళే ఎక్కువ, ముఖ్యమంత్రులు వాళ్ళే, ఎమ్మెల్యేలంతా వారే. రాజకీయ ప్రాబల్యం వారిదే. సామాజికంగా, సాంస్కృతికంగా వాళ్ళదే ఆధిక్యం. అయినా నేడు వారు ఎస్‌టి హోదా కోరుతున్నారు. మెయితీల డిమాండ్‌కి అనుకూలంగా హైకోర్టు స్పందించి పైగా వెంటనే కేంద్రానికి సిఫార్సు చేయమని ఏప్రిల్‌ 19న చెప్పింది. దీనితో కుకీ ఇతర తెగలు భగ్గుమని లేచాయి. హైకోర్టు తప్పుడు పద్ధతుల్లో వ్యవహరించిందని సుప్రీం కోర్టు చెప్పింది. ఎస్‌టి హోదాకు కొన్ని పద్ధతులుంటాయి. షెడ్యూల్‌ ప్రాంతం, వెనకబాటు ఉండాలి. వారి ఆచార సంప్రదాయాలు ఇవన్నీ పరిగణలోకి తీసుకుని రాష్ట్రపతికి గవర్నర్‌ సిఫార్సు చేయాలి. 342ప్రకారం నోటిఫై చేసి ఎస్‌టి హోదాను ఇచ్చే అవకాశం ఉంటది. ఇవేవీ అక్కడ జరగలేదు.
     మొదటి బీసీ కమిషన్‌లో ఎస్‌టిలుగా చేర్చుకోవడానికి అవకాశం ఉండగా తాము ఉన్నత జాతీయులమని మెయితీలు ఎస్‌టీ గుర్తింపును తిరస్కరించారు. గతంలో కాదన్నా గుర్తింపే ఇప్పుడు కావాలని కొన్ని వర్గాలు అడగటంలో ఏంటి అంతరార్థం? రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి సక్రమంగా డీల్‌ చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం, అధికార బీజేపీ పార్టీ సభ్యులే పక్షపాత ధోరణితో మెయితీలను ఎగేసే యత్నం చేశారు. ఇది ఒక కుకీలకు అగ్గిలో ఆయిల్‌ పోసినట్లయింది. మరో వైపు ఆదివాసీల దీర్ఘకాలిక డిమాండ్లు ఉండనే ఉన్నాయి. ప్రభుత్వాలు అటవీ చట్టాల పేరుతో వారిని సొంత భూముల నుండీ తరమాలని చూస్తునే ఉన్నాయి. 2006 చట్టం వారికీ సాంత్వన కలిగిస్తది అనుకుంటే అది అమలే సరిగా జరగలేదు. 2017నుండి అధికారంలో బీజేపీ ప్రభుత్వం కుకీ తెగలను తీవ్రవాదులుగా చూస్తున్నది. కుకీలు, నాగలు క్రిస్టియన్‌లు కూడా. పైగా మేయితీలలో హిందువులు కాబట్టి వీరు లోయలో అధికులు, 60అసెంబ్లీ స్థానాలలో వీరి రాజకీయ ప్రాబల్యం ఉంటుంది. అందుకే వీరి మెప్పుకోసం ఎస్‌టీ డిమాండ్‌కి బీజేపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి డైరెక్ట్‌ సపోర్ట్‌ చేయడం ప్రారంబించింది. అంతే కాదు మేయితీల్లో చొరబడి హిందూ క్రైస్తవుల భేదాన్ని వాడుకొని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇది కొండ ప్రాంత నాగ, కుకీలలో మరింత అపనమ్మకాన్ని పెంచింది. బీజేపీ తన రాజకీయ ప్రయోజనం కోసం ఏ రాష్ట్రంలో అయినా శత్రువులను ఎంపిక చేసుకుంటది. ముస్లింలు ప్రధాన శత్రువుగా చూపిస్తుంది. కానీ మణిపూర్‌లో మైనారిటీలు క్రిస్టియన్‌లు కాబట్టి కుకీ లను శత్రువులుగా చూపే ప్రయత్నం చేస్తుంది. అందుకే ప్రజల్లో విషభీజాలు నాటి పబ్బం గడుపుకునే ఈ వికృత బుద్ధి వల్లనే నేడు మణిపూర్‌ తగలబడుతోంది.
     కొన్నేండ్ల క్రితం వరకు కుకీ, నాగ తెగలు తమ అస్తిత్వం, ప్రత్యేక లాండ్‌ కోసం ఉద్యమించాయి. దేశానికి స్వాతంత్య్రం వరకు సొంత రాజ్యాలుగా కొనసాగిన మణిపూర్‌, 1949లో బలవంతంగా కలిపారనే అభిప్రాయం అక్కడి వాసుల్లో బలంగా ఉండేది. అంతకు ముందు 1865 అటవీ చట్టం రానంత వరకూ, 1872లో బ్రిటిష్‌ ఆక్రమణ కానంత వరకూ తమ కొండల్లో, లోయల్లో స్వేచ్ఛగా జీవించే వారు. వారి అటవీ చట్టాలు ముఖ్యంగా 1927 చట్టం వారిని సొంత భూమి నుండీ దూరం చేసే కుట్ర సాగింది. స్వాతంత్య్ర అనంతరం ఇదే తంతు ఈ దేశంలో కలిపినంక కూడా కొనసాగింది. బీజేపీ అధికారంలోకి వచ్చాక కొండ జిల్లాలోని అనేక ప్రాంతాలు రిజర్వ్‌డ్‌ ఫారెస్ట్‌లుగా, రక్షిత అడవులుగా ప్రకటించబడ్డాయి వందలాది మంది కుకీ గిరిజనులు వారి సాంప్రదాయ నివాస ప్రాంతం నుండి తొలగించబడ్డారు. బాధితులకు పునరావాసం కల్పించడంలో వైఫల్యం చెందారు. మార్చిలో, కాంగ్‌పోక్పి జిల్లాలోని థామస్‌ గ్రౌండ్‌లో హింసాత్మక ఘర్షణ జరిగింది. తర్వాత రాష్ట్ర మంత్రివర్గం రెండు కుకీ ఆధారిత తీవ్రవాద సంస్థలతో త్రైపాక్షిక సస్పెన్షన్‌ ఆఫ్‌ ఆపరేషన్స్‌  చర్చలను ఏకపక్షంగా ఉపసంహరించు కుంది. కొంత మంది వ్యాపారులు చేస్తున్న మాదక ద్రవ్యాలు, గసగసాల సాగుని గిరిజనుల మీదికి నెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాక ఇంఫాల్‌లోని గిరిజన కాలనీ ప్రాంతం లోని మూడు చర్చిలు ప్రభుత్వ భూమిలో ”అక్రమ నిర్మాణాలు” అని ఏప్రిల్‌ 11న కూల్చివేసింది. ఇది కూడా గిరిజనుల్లో కోపానికి దారితీసింది.
     అలాగే ఎప్పటినుంచో మయన్మార్‌ నుండి అక్రమ వలసలు జరుగుతున్నాయని అందుకే విద్యార్థి సంఘాలు రాష్ట్రంలో నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటి జన్స్‌ (ఎన్‌ఆర్‌సీ) అమలు కోసం నిరసనలు చేస్తున్నాయి. అది పక్కకు పెట్టి కేంద్ర ప్రభుత్వం రెండు బిల్లులు 1.పౌరసత్వ సవరణ బిల్లు-2016, 2.ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ బిల్లు-2019. పౌర సత్వం చట్టం ద్వారా 2014కి ముందు పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్థాన్‌ నుండి ఇండియాలోకి ప్రవేశించిన ముస్లిం కాని మతాల వారికి పౌరసత్వం ఇవ్వడం. అంటే మరో మాటలో చెప్పాలంటే పక్కన పక్కన బంగ్లాదేశ్‌ నుండి, (బర్మానుండి బంగ్లా దేశ్‌ గుండా కూడా) వచ్చిన అన్ని వలసలని లీగలైజ్‌ చేయడం, తద్వారా అక్కడ ఒత్తిడి పెరిగి గొడవలు పెరగడం. ఇక రెండవ కారణం బలహీన వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించడం ద్వారా తేనేతుట్టెను కదిపినట్లే అయ్యింది. రిజర్వేషన్‌ ద్వారా ఉద్యోగాలూ వస్తాయనే ఆశ కలుగుతుంది. వాస్తవంగా అన్నీ మూసేస్తుంటే అమ్ముతుంటే కొత్త ఉద్యోగాలు ఎలా వస్తాయి? ప్రభుత్వాల అసమర్ధత వల్ల దేశంలో రాష్ట్రాల్లో కొత్త ఉద్యోగాల కల్పన లేదు. దాదాపు ఎనభై శాతం అక్షరాస్యత కలిగిన మణిపూర్‌లో ఉద్యోగాల ఊసే లేదు. ఇదీ కూడా అసమ్మతికి అంతర్లీన ఆజ్యమే. వీటిని దారి మళ్లింపు కుట్రలో భాగమే రిజర్వేషన్లకై ఎగదోసే దొంగ తెలివి. ఇది బీజేపీ ఆరితేరినదే కదా! ఈ ట్రాప్‌లో మేయితీ లు పడ్డారు. ఇవన్నీ అంతర్భాగంగా ఉండగా ”మూలిగే నక్కపై తాటి కాయ పడ్డట్టు” ఎస్‌టీ హోదా ఇవ్వమని నాలుగు వారాల్లో కేంద్రానికి నివేదిక ఇయ్యమని హైకోర్టు చెప్పడంతో నిప్పు రాజుకుంది. నిప్పుని రాజేసింది, ఎగదోసింది కాషాయులేనన్నది తెలియని సత్యం. కొండలు తవ్వేందుకు, అక్రమ మైనింగ్‌ చేసేందుకు డైరెక్ట్‌గా రాలేక ఇండైరెక్ట్‌గా మెయితీ రిజర్వేషన్‌ సాకుతో కులం, మతం ఆయుధంతో కాషాయం ముందుకు వస్తుంది. పావులు గా మేయితీలని వాడుకుంటుంది. ఆ ఆయుధాలకు బలయ్యేది అంతిమంగా మణిపూరి వాసులే.
ఎస్‌. విజరు కుమార్‌
9573715656