కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎవరు.?

– ఉత్కంఠలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు
– ఎంపీ అభ్యర్థిని తేల్చని అధిష్టానం
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
కరీంనగర్ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికీ అభ్యర్థిని ఖరారు చేయకపోవడం తోని హుస్నాబాద్ నియోజకవర్గంతో పాటు పలు అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉత్కంఠకు గురవుతున్నారు. కరీంనగర్ పార్లమెంటు స్థానానికి మిగతా పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసుకుని ప్రచారం కూడా ప్రారంభించారు. కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించకపోవడం పై కాంగ్రెస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సరైన అభ్యర్థి దొరకకపోవడమే ఇందుకు కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఏడు అసెంబ్లీ స్థానాల నుంచి ఒక్క అభ్యర్థి కూడా ఎంపీ అభ్యర్థిగా అర్హుడు లేకపోవడం విశేషం.  గతంలో హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డితో పాటు కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే అయినా వెలిచాల  రాజేందర్రావు కు టికెట్ వస్తుందని ప్రచారం జరిగింది. అయినప్పటికీ అధిష్టానం వీరిద్దరి పేర్లను ఖరారు చేయకపోవడం గమనార్హం. బీజేపీ నుండి బండి సంజయ్, బిఆర్ఎస్ పార్టీ నుండి వినోద్ కుమార్ ను ఆ పార్టీల నాయకత్వం ఖరారు చేసింది. కాంగ్రెస్ నుండి ఇప్పటికీ ఎంపీ అభ్యర్థిని ప్రకటించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ నాయకులు అసహనానికి గురవుతున్నారు. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి ఎంపీ టికెట్ వస్తుందని హుస్నాబాద్ కాంగ్రెస్ నాయకులు ఎదురుచూస్తున్నారు. కానీ అది సాధ్యం అయ్యే పరిస్థితి కనబడలేదని భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రవీణ్ రెడ్డి పోటీకి వెనుకడుగు వేస్తున్నాడా లేదా జంకు తున్నాడా పార్టీ అధిష్టానం ఒప్పుకోవడం లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా అధిష్టానం ఆలోచించి వెంటనే అభ్యర్థిని ప్రకటిస్తే తప్ప ఇక్కడ గెలుపు అంచనాలు తెలని పరిస్థితి నెలకొంది.