– రేసులో రాజాసింగ్, మహేశ్వర్‌రెడ్డి
– అనూహ్యంగా వెంకటరమణారెడ్డి పేరూ తెరపైకి
– నేడు ఎమ్మెల్యేలతో బీజేపీ అధ్యక్షులు కిషన్‌రెడ్డి భేటీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీఎల్పీ నేత ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఆ పదవి కోసం పార్టీలో ప్రధానంగా ఇద్దరు రేసులో ఉన్నారు. రాజాసింగ్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. కామారెడ్డిలో సీఎం కేసీఆర్(ప్రస్తుతం మాజీ)ను, టీపీసీసీ అధ్యక్షులు, ప్రస్తుత సీఎం ఎ.రేవంత్‌రెడ్డిని ఓడించి మరీ అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్న వెంకటరమణారెడ్డి పేరు కూడా అనూహ్యంగా తెరపైకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎనిమిది మంది (గోషామహల్- రాజాసింగ్, సిర్పూర్-డాక్టర్ పాల్వాయి హరీశ్‌బాబు, ఆదిలాబాద్-పాయల్ శంకర్, నిర్మల్-ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ముధోల్-రామారావు పవార్, ఆర్మూర్ పాడి రాకేశ్‌రెడ్డి, కామారెడ్డి-కె.వెంకటరమణారెడ్డి, నిజామాబాద్ అర్బన్-ధన్‌పాల్ సూర్యానారాయణ గుప్తా) ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వీరిలో సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కడే గెలిచారు. అయితే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డితో సఖ్యత లేకపోవడం, తెలుగులో అనర్గళంగా మాట్లాకపోవడం ఆయనకు ప్రతిబంధంగా మారింది. బీజేపీ అధిష్టానం కూడా ఇదే కోణంలో ఆలోచిస్తున్నది. ఒకవేళ రాజాసింగ్ కాకపోతే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పేరు వినిపిస్తున్నది. ఈయన గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షులుగా చేయడాన్ని విభేదిస్తూ ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
సీఎంగా రేవంత్‌రెడ్డి ఎన్నికైన నేపథ్యంలో మహేశ్వ్‌రెడ్డిని బీజేపీ ఎల్పీ నేతగా నియమిస్తే తన వాణిని మరింత బలంగా వినిపించే అవకాశముంటుందనే ఆలోచనలో బీజేపీ ఉంది. అయితే, కాంగ్రెస్ గూటికి ఆయన తిరిగి వెళ్తాడనే చర్చ మొదలైన క్రమంలో ఆయనకు ఆ పదవి ఇచ్చి పార్టీలో ఉండేలా చూడాలనే చర్చా నడుస్తున్నది. కామారెడ్డిలో అనూహ్యంగా కేసీఆర్, రేవంత్‌రెడ్డిని ఓడగొట్టి చర్చనీయాంశమైన కె.వెంకట రమణారెడ్డిని నియమిస్తే ఎలా ఉంటుందనే ఆలోచననూ బీజేపీ నాయకత్వం చేస్తున్నది.ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలుగా గెలిచిన ఎనిమిది మందితో శనివారం ఉదయం ఏడున్నర గంటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రత్యేకంగా భేటీ కానున్నారు.
ఆ సమావేశంలోనే బీజేపీ ఎల్పీ నేతను ఖరారు చేయనున్నట్టు తెలిసింది. ఆ సమావేశం అనంతరం ఎమ్మెల్యేలతో కలిసి కిషన్‌రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేయనున్నారు. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఓవైసీని నియమించిన నేపథ్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు రాజాసింగ్ ప్రకటించిన విషయం విదితమే.