– సెలక్షన్ కమిటీకి సరికొత్త సవాల్
– పొట్టి ఫార్మాట్‌కు హార్దిక్, సూర్య పోటీ
– వన్డే జట్టు పగ్గాల రేసులో రాహుల్
– నెలాఖరులో భారత జట్టు శ్రీలంక పర్యటన
ఆధునిక క్రికెట్‌లో టీమ్ ఇండియా తీయని తలనొప్పులు ఎదుర్కొంటుంది. భారత జట్టు నూతన నాయకత్వం ఎంపిక అందులో ఒకటి. టీ20 ప్రపంచకప్ విజయంతో పొట్టి ఫార్మాట్‌కు రోహిత్ శర్మ వీడ్కోలు పలికాడు. దీంతో ఈ ఫార్మాట్‌లో నాయకత్వ బాధ్యతలు అందుకునేందుకు వారసులు ఉవ్విళ్లూరుతున్నారు. 2025 చాంపియన్స్ ట్రోఫీ రేసులో సీనియర్ క్రికెటర్లు విశ్రాంతి లభించే ద్వైపాక్షిక సిరీస్‌ల్లో వన్డే జట్టు పగ్గాలు సైతం మరొకరికి అప్పగించాల్సి ఉంది. ఈ నెల 27 నుంచి శ్రీలంకతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ఆడనున్న టీమ్ ఇండియాకు కొత్త కెప్టెన్ల ఎంపిక ఇప్పుడు సెలక్షన్ కమిటీ ముందున్న కఠిన సవాల్!.
నవతెలంగాణ క్రీడావిభాగం
పొట్టి ఫార్మాట్ వారుసుడు ఎవరో?
ఐసీసీ 2024 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య. దీంతో సహజంగానే రోహిత్ శర్మ తర్వాత ఈ ఫార్మాట్‌లో హార్దిక్ పాండ్య సహజ వారసుడు. కానీ హార్దిక్ పాండ్య ఆల్‌రౌండర్. అతడి కెరీర్‌లో గాయాల బెడద ఎక్కువ. 2018 నుంచి భారత్ ఆడిన 122 వన్డేల్లో హార్దిక్ పాండ్య కేవలం 54 మ్యాచుల్లోనే ఆడాడు. వచ్చే ఏడాది కీలక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో బీసీసీఐ పని ఒత్తిడి మేనేజ్‌మెంట్ ప్రణాళికలు చేయనుంది. ఈ ఫార్మాట్‌లో హార్దిక్ పాండ్యకు ఎక్కువగా విశ్రాంతి అందించే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడే సూర్యకుమార్ యాదవ్ పేరు తెరపైకి వస్తుంది. గత ఏడాది నవంబర్‌లో ఆస్ట్రేలియాపై 4-1తో టీ20 సిరీస్ విజయం సాధించిన భారత జట్టుకు సూర్య సారథ్యం వహించాడు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో నాయకత్వ పగ్గాలు చేపట్టి 1-1తో సిరీస్‌ను సమం చేసుకున్నాడు. వన్డే జట్టులోనూ సూర్యకుమార్ యాదవ్ క్రియాశీల సభ్యుడు కొనసాగే అవకాశం ఉంది. అయినప్పటికీ.. స్పెషలిస్ట్ బ్యాటర్‌గా సూర్యకుమార్ యాదవ్‌పై పెద్దగా పని ఒత్తిడి ఉండే అవకాశం లేదు. ఇది సూర్యకుమార్ యాదవ్‌కు టీ20 ఫార్మాట్ కెప్టెన్సీ అందించేందుకు దోహదం చేసే అవకాశం లేకపోలేదు. హార్దిక్, సూర్యతో పాటు బుమ్రా సైతం పోటీపడుతున్నా.. బుమ్రా వర్క్‌లోడ్‌తో అతడిని సెలక్షన్ కమిటీ పరిగణనలోకి తీసుకునే అవకాశం కనిపించటం లేదు.
ఆ ఇద్దరు శ్రీలంక వెళ్తారా?
భారత క్రికెట్ జట్టు చీఫ్ కోచ్‌గా గౌతం గంభీర్ నియమితులయ్యాడు. శ్రీలంకతో సిరీస్ నుంచి గంభీర్ బాధ్యతలు అందుకోనున్నాడు. ద్వైపాక్షిక సిరీస్‌లకు కీలక క్రికెటర్లు విశ్రాంతి తీసుకోవటంపై గతంలో గంభీర్ విమర్శలు చేశాడు. ఇప్పుడు చీఫ్ కోచ్‌గా గంభీర్ క్రికెటర్ల రొటేషన్, విశ్రాంతి అంశంలో ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియదు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి జనవరి వరకు భారత్ పది టెస్టు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ రేసులో టీమ్ ఇండియా ముందుంది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జశ్‌ప్రీత్ బుమ్రా పది టెస్టులకు అందుబాటులో ఉంటారు. దీంతో రానున్న శ్రీలంకతో వన్డే సిరీస్ సహా పలు 50 ఓవర్ల ఫార్మాట్ సిరీస్‌లకు ఈ ముగ్గురు క్రికెటర్లు దూరంగా ఉండే అవకాశం లేకపోలేదు. చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్సీ వహిస్తాడని బీసీసీఐ కార్యదర్శి ఇదివరకే ప్రకటించాడు. రోహిత్ శర్మ అందుబాటులో ఉండని వన్డే సిరీస్‌లకు టీమ్ ఇండియాకు నాయకుడు అవసరం. సెలక్షన్ కమిటీ రానున్న శ్రీలంక సిరీస్‌కే కొత్త వన్డే కెప్టెన్‌ను ఎంపిక చేయాల్సి ఉంటుంది.
కెఎల్ రాహుల్‌కు ఛాన్స్ ఉందా?
భారత జట్టు చివరగా డిసెంబర్‌లో వన్డే ఫార్మాట్‌లో ఆడింది. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో భారత్‌కు కెఎల్ రాహుల్ సారథ్యం వహించాడు. పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తే, రానున్న శ్రీలంక సిరీస్‌కు మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా కెఎల్ రాహుల్ జట్టులో చోటు సాధించే అవకాశం ఉంది. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో వికెట్ కీపర్ బాధ్యతలు చేపట్టిన రాహుల్.. ఇక ఆ బాధ్యతలను రిషబ్ పంత్‌కు అప్పగించాల్సి ఉంటుంది. గతంలో రాహుల్, గంభీర్‌లు ఐపీఎల్ ప్రాంఛైజీ లక్నో సూపర్‌జెయింట్స్‌కు పని చేశారు. ఇది రాహుల్‌కు ఉపయోగపడే అవకాశం ఉంది. యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ సైతం రేసులో నిలిచాడు. ఇటీవల యువ జట్టుతో జింబాబ్వే పర్యటనలో 4-1తో టీ20 సిరీస్ విజయం సాధించాడు. వన్డే జట్టులోనూ శుభ్‌మన్ గిల్ కీలక ఆటగాడు. దీంతో ఈ ఫార్మాట్‌లో రోహిత్ శర్మ వారసుడిగా శుభ్‌మన్ గిల్‌ను సైతం పరిగణించే పరిస్థితులు ఉన్నాయి.
అయ్యర్ వస్తాడా?
బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ ముందు మరో కఠిన సవాల్ ఉంది. వన్డే వరల్డ్‌కప్‌లో రెండు సెంచరీలు, మూడు అర్థ సెంచరీలతో 500 పైచిలుకు పరుగులు సాధించిన శ్రేయస్ అయ్యర్.. ఆ తర్వాత బీసీసీఐ ప్రకటించిన వార్షిక కాంట్రాక్టు జాబితాలో చోటు గల్లంతు చేసుకున్నాడు. వెన్నునొప్పి బాధను జట్టు మేనేజ్‌మెంట్ అర్థం చేసుకోకుండా.. దేశవాళీ క్రికెట్‌లో ఆడాలని ఒత్తిడి చేసిందని గతంలో అయ్యర్ ఆవేదన వ్యక్తం చేశాడు. కోల్‌కత నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ తన కెరీర్‌ను భిన్న స్థాయికి తీసుకెళ్లాడు. కోల్‌కత నైట్‌రైడర్స్ మెంటార్ గంభీర్ ఇప్పుడు భారత చీఫ్ కోచ్ కావటంతో శ్రేయస్ అయ్యర్ కోసం అతడు పట్టుబట్టే అవకాశం లేకపోలేదు. వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ వన్డే జట్టులోకి వస్తాడా? లేదా సంజు శాంసన్‌కు అవకాశం ఇస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇటీవల ముగిసిన జింబాబ్వే పర్యటనలో యువ క్రికెటర్లు రాణించారు. శ్రీలంకతో సిరీస్‌లో సైతం కుర్రాళ్లకు అవకాశం ఇస్తారా? లేదంటే సీనియర్ క్రికెటర్లను ఎంపిక చేస్తారా? అనేది ఆసక్తికరం. భారత్, శ్రీలంక తొలి టీ20 మ్యాచ్ జులై 27న ఆరంభం కానుండగా.. తొలి వన్డే ఆగస్టు 2న షురూ కానుంది. ఈ నెల మూడో వారంలో సమావేశం కానున్న సీనియర్ సెలక్షన్ కమిటీ శ్రీలంక పర్యటనకు భారత వన్డే, టీ20 జట్లను ఎంపిక చేయనుంది.