
– గత ప్రభుత్వం లో ఏర్పాటు చేసినదశాబ్ద ఉత్సవాల్లో భాగంగా లక్ష జల హారతి కార్యక్రమంలో భారీ అవినీతి చేసినట్లు ఆరోపణలు….
– స్టోర్ రూం లో దాచి పెట్టిన గుడ్లు మాయం…..
– బియ్యం, వంట సామాన్లు సైతం మాయ చేసిన వైనం…
– అంతా ఎంపీడీవో కార్యాలయ ఉద్యోగి కనుసన్నలో మాయమైనట్లు గుసగుసలు…
– ప్రజా పాలన కార్యక్రమం ఏర్పాటు కోసం పంపించిన నిధులలో కొన్ని మింగిన ఘనుడు???
– గుడ్లు మాయం అవడం లో జిల్లా కలెక్టర్ కార్యాలయం సిబ్బంది సహకారం తీసుకున్నట్లు ఆరోపణలు…
– అధికారుల చేతివాటం పై జిల్లా కలెక్టర్ విచారణ జరిపించాలి…
– అవినీతి అధికారులపై ఉక్కు పాదం మోపాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్…
నవతెలంగాణ- చివ్వెంల
ప్రభుత్వ కార్యాలయాల బయట అవినీతి రహిత సేవలు అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో ప్రకటనలు రాస్తారు. కానీ చివ్వెంల మండల ఎంపీడీవో కార్యాలయంలోకి అడుగు పెడితే చాలు అవినీతి వాసనలు గప్పుమంటున్నాయి. గతంలో ప్రశాంతంగా పనిచేసిన అధికారులకు కొంత కాలం క్రితం మండలానికి బదిలీపై ఓ అధికారి వచ్చినప్పటినుండి ఆ కార్యాలయంలో రాజకీయాలు, అక్రమంగా నిధుల మళ్లింపు, అవినీతి, అక్రమాలకు ఆ కార్యాలయాన్ని కేరాఫ్ అడ్రస్ గా మార్చాడు. కొందరు అధికారులు అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నప్పటికీ ఇందులో దొరికిన వారే దొంగలు.. కానీ దొరకని వారు చాలా మందే దర్జాగా దండుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి . ఇలాంటి తిమింగళాలు ఎందరో ఉన్నారని ప్రజలు గుసగుసలు ఆడుతున్నారు. కానీ ఇతని స్టైల్ వేరు స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులను ఏదో వరుసలతో పరిచయం చేసుకుని వారికి మందు, విందులు ఇచ్చి కార్యాలయంలో తనదే హవా నడిచేలా చూసుకుంటాడు… పై అధికారులకు మాయమాటలు చెప్పి నిధులను కాజేయడం ఇతనికి పరిపాటే.
నిధుల గోల్ మాల్ ఇలా..
కాంగ్రెస్ ప్రభుత్వం నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని గ్రామాలలో ప్రజాపాలన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకోసం జిల్లా కలెక్టర్ ప్రతి గ్రామ పంచాయతీకి కార్యక్రమం నిర్వహణ కోసం కొంత నిధులను కేటాయించడం జరిగింది.. మండలంలోని 31 గ్రామపంచాయతీలకు కానూ, గ్రామపంచాయతీకి 5 వేల రూపాయల చొప్పున పంచాయతీ కార్యదర్శులకు ఖర్చుల నిమిత్తం ఇచ్చినట్లు సమాచారం. ప్రజాపాలన కార్యక్రమం ఆయా గ్రామాలలో ఏర్పాటు చేసినప్పుడు కొన్ని గ్రామపంచాయతీలలో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మండల అధికారులు ఇచ్చిన 5 వేల రూపాయిలు సరిపోలేదని తమ చేతినుంచి కొంత ఖర్చు పెట్టుకున్నట్లు కార్యదర్శులు కొందరు తెలిపారు.. వచ్చిన దరఖాస్తుల ఆన్లైన్ కోసం జిల్లా కలెక్టర్ 1,55,000 వేల రూపాయలు కేటాయిస్తే మండలంలో సుమారు 12,479 దరఖాస్తులు రాగా ఆన్లైన్ చేసినందుకు సుమారు 63 వేల రూపాయలు ఆన్లైన్ చేసిన వారికి చెల్లిస్తే, ఆన్లైన్ చేసిన వారికి టి, సమోస, బిస్కెట్, బిర్యానీ, భోజనాలు కోసం 79 వేల రూపాయలు ఖర్చు చేసినట్లు అధికారులు లెక్కలు చూపించడం విశేషం… దరఖాస్తులను ఆన్లైన్ చేసే సమయంలో అధిక మంది అధికారులు లాగిన్ తీసుకోని తమ ఇంటివద్ద నుండే ఆన్లైన్ చేసినట్లు సమాచారం… ఆన్లైన్ చేసినవారికి జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం దరఖాస్తు ఆన్లైన్ చేస్తే 5 రూపాయలు ఇవ్వాలని చెప్పడం జరిగింది..ఆన్లైన్ చేసిన తరువాత మిగిలిన డబ్బులు గ్రామపంచాయతీ కార్యదర్శులకు ఇవ్వాలని చూసించినట్లు సమాచారం… కాని ఎంపీడీఓ కార్యాలంలోని ఓ అధికారి చెప్పినట్లు ఖర్చులు ఎక్కువ రాసి డబ్బులు సరిపోలేదని మళ్ళీ బిల్లులు పెట్టడం వెన్నతో పెట్టిన విద్య అని కొంతమంది కింది స్థాయి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వం లో ఏర్పాటు చేసిన దశాబ్ద ఉత్సవాల్లో భాగంగా లక్ష జల హారతి కార్యక్రమంలో భారీ అవినీతి జరిగినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది…ఆనాటి ప్రభుత్వం 6 లక్షల రూపాయలు యిచ్చి నట్లు అధికారులు తెలిపారు. ఖర్చు మాత్రం సుమారు 7,97,63 రూపాయలు పెట్టినట్లు రికార్డ్ తయారుచేశారు… ఈ కార్యక్రమం కోసం 18 వేల కోడిగుడ్లు యివ్వగా 12000 గుడ్లు వండడం జరిగింది. వెయ్యి గుడ్లు మోతె మండలానికి పంపించినట్లు ఓ అధికారి తెలిపారు. స్టోర్ రూం లో దాచి పెట్టిన గుడ్లు, బియ్యం వంట సామాను ఓ ఉద్యోగి కనుసన్నల్లో మాయం చేసినట్లు బహిరంగంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుడ్లు స్టోర్ రూం లో గుడ్లు పెట్టిన కోళ్లు మింగాయా! లేక గుడ్లు పిల్లలుగా మారి పారిపోయయా అని ప్రజలు గుసగుసలు ఆడుతున్నారు. గుడ్లు మాయం అవడం లో జిల్లా కలెక్టర్ కార్యాలయం సిబ్బంది ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి . లక్ష జలహారతి కార్యక్రమంలో లక్షల రూపాయలు అవినీతి చేశారని ఈ కార్యక్రమం కోసం వచ్చిన ప్రజలకు కనీసం మంచినీటి వసతి కూడా కొన్ని గ్రామాల్లో కల్పించలేదని, కొన్ని గ్రామాల్లో ప్రజలు అన్నం తినకుండానే వెళ్లిపోయారని గతంలో ప్రజా ప్రతినిధులు బాహాటంగానే ఏర్పాట్లు సరిగా చేయలేదని అధికారులను మందలించినట్లు ఆ గ్రామాల ప్రజలు తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన ఆరు లక్షల రూపాయలను ఎంపీడీవో కార్యాలయంలోని కొంతమంది ఉద్యోగులు తమ చేతివాటం ప్రదర్శించి ప్రభుత్వానికి తప్పుడు రికార్డు తయారు చేసి ఇచ్చారనేది పలువురు ఆరోపిస్తున్నారు.
కార్యాలయం అంత ఆ ఉద్యోగి కనుసన్న లోనే…
ఆ ఉద్యోగి గతంలో పనిచేసిన చోట్ల కూడా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఉన్నతాధికారు లు, స్థానిక రాజకీయ నాయకుల అండతో ఇష్టారాజ్యంగా వ్యవహరించేవారని వెల్లడైంది. మండలంలో ఆ ఉద్యోగి ఆయా శాఖలలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులతో టీం ఏర్పాటు చేసుకుని తను పని చేసే కార్యాలయం నే అడ్డాగా చేసుకుని దందా కొనసాగించేవారని తెలుస్తోంది. కార్యాలయానికి వచ్చిన నిధులను అందినకాడికి దండుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.. జిల్లా కలెక్టర్ ఉన్నత స్థాయి అధికారులు గత ప్రభుత్వంలో లక్ష హారతి కార్యక్రమం కోసం, ప్రజాపాలన కార్యక్రమంకు కేటాయించిన నిధులు పైన సమగ్ర విచారణ జరిపి నిజా నిజాలను నిగ్గు తేల్చాలని, అధికారులు అవినీతికి పాల్పడి ఉంటే వెంటనే వారిని విధుల నుంచి డిస్మిస్ చేసి ప్రభుత్వం పైన ప్రజలకు నమ్మకం కలిగే విధంగా జిల్లా అధికారులు రాష్ట్రస్థాయి అధికారులు, వెంటనే విచారణ చేపట్టాలని పలువురు ప్రజా సంఘాల నాయకులు ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.
విచారణ చేస్తాం.. జడ్పీ సీఈవో సురేష్.
నిధులు దుర్వినియోగం అయిన విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం.. క్షేత్రస్థాయిలో పూర్తి విచారణ చేస్తాం… ఎవరైనా అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో తెలితే చర్యలు తప్పవు..