వారెవ్వా..వరుణ్‌…

Team India won– అభిషేక్‌ శర్మ అర్ధసెంచరీ
– తొలి టి20లో ఇంగ్లండ్‌పై ఏడువికెట్ల తేడాతో టీమిండియా గెలుపు
కోల్‌కతా: ఈడెన్‌ గార్డెన్స్‌లో తొలుత టీమిండియా బౌలర్‌ వరుణ్‌ చక్రవర్తి స్పిన్‌ మాయాజాలానికి తోడు.. బ్యాటర్‌ అభిషేక్‌ శర్మ ధనా ధన్‌ బ్యాటింగ్‌తో చెలరేగడంతో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టి20లో టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత వరుణ్‌ చక్రవర్తి(3/23)కి తోడు ఆర్ష్‌దీప్‌, హార్దిక్‌, అక్షర్‌ రెండేసి వికెట్లతో రాణించడంతో ఇంగ్లండ్‌ జట్టు 132పరుగులకే ఆలౌటౌటైంది. ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అభిషేక్‌ శర్మ(79; 34బంతుల్లో 5ఫోర్లు, 8సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగా ఆడి మ్యాచ్‌ను 12.5ఓవర్లలోనే ముగించారు.
ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టి20లో టాస్‌ గెలిచిన భారత్‌.. తొలుత బౌలింగ్‌కే మొగ్గు చూపింది. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ నమ్మకాన్ని ఏ ఒక్క బౌలర్‌ వమ్ము చేయలేదు. ఆర్ష్‌దీప్‌, హార్దిక్‌, వరుణ్‌ చక్రవర్తి, అక్షర్‌ వికెట్లు చేజిక్కించుకోవడంలో సఫలమయ్యారు. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బట్లర్‌(68) అర్ధసెంచరీ మినహా.. మిగతా ఏ ఒక్క బ్యాటర్‌నూ క్రీజ్‌లో నిలదొక్కుకునే అవకాశం భారత బౌలర్లు ఇవ్వలేదు. తొలి ఓవర్లోనే ఓపెనర్‌ ఫిలిప్‌ సాల్ట్‌ డౌకౌట్‌ అయ్యాడు. ఆర్ష్‌దీప్‌ సింగ్‌ బౌలింగ్‌లో కీపర్‌ సంజూ శాంసన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ మరో ఓపెనర్‌ బెన్‌ డకెట్‌కు జతగా క్రీజులోకి వచ్చాడు. కానీ మూడో ఓవర్‌ ఐదో బంతికి బెన్‌ డకెట్‌(4) కూడా పెవిలియన్‌కు చేరాడు. అర్షదీప్‌ బౌలింగ్‌లోనే రింకూ సింగ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం మరో బౌలర్‌ వరుణ్‌ చక్రవర్తి తన విశ్వరూపం చూపించాడు. ఎనిమిదో ఓవర్‌ మూడో బంతికి హ్యారీ బ్రూక్‌ను, ఐదో బంతికి లియామ్‌ లివింగ్‌స్టోన్‌ను ఔట్‌ చేసి పెవిలియన్‌కు పంపాడు. అప్పటికి ఇంగ్లడ్‌ స్కోర్‌ నాలుగు వికెట్ల నష్టానికి 65 పరుగులు. ఇంగ్లండ్‌ బ్యాటర్‌లలో కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు. 10 ఓవర్ల ఆట ముగిసే సమయానికి బట్లర్‌ 29 బంతులను ఎదుర్కొని 47 పరుగులు చేశాడు. అప్పటికి టీమ్‌ స్కోర్‌ నాలుగు వికెట్ల నష్టానికి 74 పరుగులుగా ఉంది. ఆ తర్వాత వరుసగా వికెట్లను పడగొడుతూనే ఉన్నారు. ఓవర్టర్‌(2), అట్కిన్సన్‌(2), వుడ్‌(1) ఇలా వచ్చిన వారిని వచ్చినట్లు ఔట్‌ చేశారు. భారత బౌలర్లలో ఆర్ష్‌్‌దీప్‌, హార్దిక్‌, అక్షర్‌కు రెండేసి, వరుణ్‌ చక్రవర్తికి మూడు వికెట్లు దక్కాయి.
స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సంజు(26), అభిషేక్‌(79) ధనా ధన్‌ బ్యాటింగ్‌తో మెరిసారు. అభిషేక్‌ శర్మ కేవలం 20 బంతుల్లోనే అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. కెప్టెన్‌ సూర్యకుమార్‌(0) నిరాశపరిచినా.. తిలక్‌వర్మ(19), హార్దిక్‌(3) మరో వికెట్‌ కోల్పోకుండా మ్యాచ్‌ను ముగించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఆర్చర్‌కు రెండు, రషీద్‌కు ఒక వికెట్‌ దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ వరుణ్‌ చక్రవర్తికి లభించగా.. ఐదు టి20ల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యతలో నిలిచింది. రెండో టి20 చెన్నై వేదికగా శనివారం జరగనుంది.
స్కోర్‌బోర్డు
ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (సి)సంజు (బి)ఆర్ష్‌దీప్‌ 0, డకెట్‌ (సి)రింకు సింగ్‌ (బి)ఆర్ష్‌దీప్‌ 4, బట్లర్‌ (సి)నితీశ్‌రెడ్డి (బి)వరుణ్‌ చక్రవర్తి 68, బ్రూక్‌ (బి)వరుణ్‌ చక్రవర్తి 17, లివింగ్‌స్టోన్‌ (బి)వరుణ్‌ చక్రవర్తి 0, బేథెల్‌ (సి)అభిషేక్‌ శర్మ (బి)హార్దిక్‌ పాండ్యా 7, ఓవర్టన్‌ (సి)నితీశ్‌రెడ్డి (బి)అక్షర్‌ పటేల్‌ 2, అట్కిన్సన్‌ (స్టంప్‌)సంజు (బి)అక్షర్‌ 2, ఆర్చర్‌ (సి)సూర్యకుమార్‌ (బి)హార్దిక్‌ 12, రషీద్‌ (నాటౌట్‌) 0, వుడ్‌ (రనౌట్‌)సంజు 1, అదనం 11. (20 ఓవర్లలో ఆలౌట్‌) 132పరుగులు.
వికెట్ల పతనం: 1/0, 2/17, 3/65, 4/65, 5/83, 6/95, 7/103, 8/109, 10/132
బౌలింగ్‌: ఆర్ష్‌దీప్‌ 4-0-17-2, హార్దిక్‌ పాండ్యా 4-0-42-2, వరుణ్‌ చక్రవర్తి 4-0-23-3, అక్షర్‌ పటేల్‌ 4-1-22-2, బిష్ణోరు 4-0-22-0
ఇండియా ఇన్నింగ్స్‌: సంజు (సి)అట్కిన్సన్‌ (బి) ఆర్చర్‌ 26, అభిషేక్‌ శర్మ (సి)బ్రూక్‌ (బి)రషీద్‌ 79, సూర్యకుమార్‌ (సి)సాల్ట్‌ (బి)ఆర్చర్‌ 0, తిలక్‌ వర్మ (నాటౌట్‌) 19, హార్దిక్‌ (నాటౌట్‌) 3, అదనం 6. (12.5ఓవర్లలో 3వికెట్ల నష్టానికి) 133పరుగులు.
వికెట్ల పతనం: 1/41, 2/41, 3/125
బౌలింగ్‌: ఆర్చర్‌ 4-0-21-2, అట్కిన్సన్‌ 2-0-38-0, వుడ్‌ 2.5-0-25-0, రషీద్‌ 2-0-27-1, ఓవర్టన్‌ 1-0-10-0, లివింగ్‌స్టోన్‌ 1-0-7-0.