ఒక్కో అక్షరానికి జరుగుతోంది
విస్ఫోటనం మెదడులే
పద పదానికి పేలుతున్నాయి శతఘ్నులు గుండెల్లో..
వాక్య వాక్యానికి బద్దలవుతున్నాయి
అగ్ని పర్వతాలు కళ్ళల్లో..
భావ భావానికీ ఆలోచనల్లో భూకంపం పుడుతోంది..
కాగితంపై సిరాకు బదులు రక్తం పారుతోంది..
కలం పట్టుకున్న చేయి చిగురుటాకులా వణుకుతోంది..
ఎటు పోతోంది సమాజం ఏమై పోతున్నాడు మనిషి
ఎక్కడ బ్రతుకుకున్నాం మనం..
ఎక్కడ తిరుగుతున్నారు జనం..
కొంగు చూడగానే చొంగలు కార్చే చిత్త కార్తె కుక్కా..
చేయి వేయగానే తల్లి కనపడ లేదా..
గుండెలు చూడగానే తాగిన పాలు గుర్తుకు రాలేదా..
పెదాలు కనగానే తల్లి పెట్టిన ముద్దులు జ్ఞప్తికి రాలేదా..
ఎక్కడో చూడగానే ఊగిన ఒడి ఊయల మతికి రాలేదా..
కళ్ళు చూడగానే డాక్టరై
సేవ చేద్దామనుకున్న ఆశలు కనపడలేదా..
చేతులు పట్టుకోగానే
రోగాలు తగ్గించే అమత హస్తమనిపించలేదా..
చూడగానే తోడబుట్టిన వారి
అమాయక ముఖం కన్పించలేదా..
కొంగు కనబడగానే చొంగలు కార్చే కుక్కలా…
కామంతో కన్నూ మిన్నూ కానని రాక్షసుడిలా….
తోటి ఆడపిల్లను కర్కశంగా మింగుతుంటే…
ఎవరిదీ తప్పు ఎక్కడిదీ ధూర్తాలోచన…
కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు…
ఆధునిక విజ్ఞానానిదా, సమాజానిదా, పెంపకానిదా….
అభం శుభం తెలియక చేసిన స్నేహానిదా….
కళ్ళు మూసుకుపోయిన మగమా మార్చుకో మనసుని…
కామంతో బలిసిన దేహాన్ని చేయి మనిషిని..
చేయకు మానవత్వాన్ని నీ చేతులతో నుసిని…
రెండు కొవ్వొత్తులు, నాలుగడుగులు
ఆరు మాటలు వద్దు సానుభూతికై….
చూపాలి నిరసన న్యాయవ్యవస్థ మార్పుకై….
ఎలుగెత్తి అరవాలి చట్టాల కచ్చితమైన అమలుకై…
మారాలి దుర్మార్గులకు కొమ్ముకాసే చట్టం…
మార్చాలి ఉన్నవాడికి అవకుండా చుట్టం…
మార్చాలి శిక్షాస్మతి న్యాయానికి కట్టేవిధంగా పట్టం…..
– జి. మధు మురళి, భీమారం