పంచ్‌ కొట్టేదెవరు?

Who punches?– నేటి నుంచి భారత్‌, ఆసీస్‌ బాక్సింగ్‌ డే టెస్టు
– సిరీస్‌లో ఆధిపత్యంపై ఇరు జట్లు ఫోకస్‌
– ఉదయం 5 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ కీలక దశకు చేరుకుంది. 1-1తో సమవుజ్జీలుగా కొనసాగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో పైచేయి సాధించేందుకు బాక్సింగ్‌ డే సమరానికి రంగం సిద్ధం చేసింది. చివరి రెండు టెస్టుల్లో ఎదురులేని ప్రదర్శన చేసిన ఉత్సాహంలో ఆతిథ్య ఆస్ట్రేలియా కనిపిస్తోంది. పెర్త్‌ టెస్టు తర్వాత ఆ జోష్‌తో పంచ్‌ ఇవ్వాలనే పట్టుదలతో టీమ్‌ ఇండియా ఉంది. భారత్‌, ఆస్ట్రేలియా ఆధిపత్యం కోసం నాల్గో టెస్టుకు సై అంటున్నాయి. మెల్‌బోర్న్‌లో బాక్సిండ్‌ డే టెస్టు సమరం నేటి నుంచి ఆరంభం.
నవతెలంగాణ-మెల్‌బోర్న్‌
సుమారు దశాబ్దం తర్వాత భారత్‌పై బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ సాధించే అవకాశం ఆస్ట్రేలియాను ఊరిస్తోంది. మెల్‌బోర్న్‌, సిడ్నీ టెస్టుల్లో విజయాలు సాధిస్తే సిరీస్‌ ఆసీస్‌ సొంతమవనుంది. మెల్‌బోర్న్‌ లేదా సిడ్నీ టెస్టుల్లో ఓ విజయం భారత్‌ను విజేతగా నిలుపగలదు. కానీ, ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో చోటు కోసం ఇతరులపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇటు సిరీస్‌, అటు డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్త్‌పై కన్నేసి నేడు టీమ్‌ ఇండియా మెల్‌బోర్న్‌ టెస్టులో బరిలోకి దిగుతోంది. మెరుగైన వాతావరణం నేపథ్యంలో బాక్సింగ్‌ డే టెస్టులో ఫలితం ఖాయం. దీంతో ఇరు జట్లు ఆధిపత్యం కోసమే నాల్గో టెస్టుకు సిద్ధం అవుతున్నాయి. భారత్‌, ఆస్ట్రేలియా కీలక బాక్సింగ్‌ డే టెస్టు నేటి నుంచి ఆరంభం కానుంది. భారత కాలమానం ప్రకారం ఆట ఉదయం 5 గంటలకు మొదలవనుంది.
ఆ రెండు కీలకం!
పెర్త్‌ టెస్టులో సూపర్‌ విక్టరీ సాధించిన భారత్‌.. ఆడిలైడ్‌, బ్రిస్బేన్‌లో తేలిపోయింది. గబ్బాలో ఆఖర్లో మెరుగైనా.. వరుణుడు సైతం రోహిత్‌సేనకు సాయం చేశాడు. భారత్‌ రెండు సమస్యలను అధిగమించాలి, అప్పుడే ఆసీస్‌పై పైచేయి సాధ్యపడుతుంది. టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లు బాధ్యతగా పరుగులు చేయాలి. బౌలర్లు ఓ ఎండ్‌లో బుమ్రాకు మంచి సహకారం అందించాలి. ఈ రెండు అంశల్లో మెరుగైతే.. మెల్‌బోర్న్‌లో భారత్‌ను ఎవరూ ఆపలేరు. విరాట్‌ కోహ్లి పెర్త్‌లో సెంచరీ బాదినా.. ఆ తర్వాత మూడు ఇన్నింగ్స్‌ల్లో తేలిపోయాడు. రోహిత్‌ శర్మ సైతం రెండు టెస్టుల్లోనూ నిరాశపరిచాడు. యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌ గత రెండు టెస్టుల్లో అంచనాలను అందుకోలేదు. టాప్‌ ఆర్డర్‌లో కెఎల్‌ రాహుల్‌, లోయర్‌ ఆర్డర్‌లో నితీశ్‌ కుమార్‌ నిలకడగా పరుగులు రాబడుతున్నారు. కోహ్లి, రోహిత్‌, యశస్వి, గిల్‌లు ఇప్పుడైతే మెరిస్తే భారత్‌ కష్టాల నుంచి గట్టెక్కగలదు. బంతితో బుమ్రా అసమాన ప్రదర్శన చేస్తున్నాడు. ప్రత్యర్థి శిబిరంలోని 20 వికెట్లలో సింహభాగం పడగొడుతున్నాడు. ఉడతా సాయానికి సైతం సిరాజ్‌, ఆకాశ్‌, నితీశ్‌ తడబడుతున్నారు. నిలకడగా లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బ్యాటర్లపై ఒత్తిడి పెంచటంలో విఫలం అవుతున్నారు. పిచ్‌ నుంచి స్పిన్‌కు అనుకూలత లేకపోయినా.. విపరీత ఎండలతో రవీంద్ర జడేజా మెల్‌బోర్న్‌లో మాయ చేయాలనే ఉత్సుకతతో ఉన్నాడు.
జట్టు సమతూకం ఎలా?
టీమ్‌ ఇండియా తుది జట్టులో సమతూకం లోపిస్తుంది. ప్రధానంగా పేస్‌ విభాగంలో ఈ లోటు సుస్పష్టం. ఫాస్ట్‌ బౌలర్లకు అనుకూలించే పరిస్థితుల్లో జశ్‌ప్రీత్‌ బుమ్రాకు మరో ఎండ్‌లో కనీసం సహకారం కొరవడింది. ఆకాశ్‌ దీప్‌, మహ్మద్‌ సిరాజ్‌ అంచనాలను అందుకోవటం లేదు. పేస్‌ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి బ్యాట్‌తో అద్భుతం చేస్తున్నాడు. కానీ బంతితో నితీశ్‌ ఇంకా మెరుగు పడాల్సి ఉంది. నితీశ్‌ స్థానంలో స్పెషలిస్ట్‌ పేసర్‌ను ఎంచుకోవాలా? లేదా పగుళ్లు ఏర్పడే అవకాశం ఉన్న పిచ్‌పై రెండో స్పిన్నర్‌ను తీసుకోవాలా? అనే మీమాంస టీమ్‌ మేనేజ్‌మెంట్‌లో కనిపిస్తుంది. వాషింగ్టన్‌ సుందర్‌ను స్పిన్‌ ఆల్‌రౌండర్‌గా ఆడించే ఆలోచన సైతం ఉంది. కానీ తొలి మూడు టెస్టుల్లో నిలకడగా రాణించిన ఆటగాళ్లలో నితీశ్‌ ఒకడు. అటువంటి ఆటగాడిని తుది జట్టు నుంచి తప్పించటం సముచిత నిర్ణయం కాబోదు. రోహిత్‌, గంభీర్‌ ద్వయం ఈ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని జట్టుకు ఏ విధంగా సమతూకం సాధిస్తారనేది ఆసక్తికరం.
కంగారూ హుషారు
తొలి టెస్టు ఓటమి నుంచి పుంజుకున్న ఆస్ట్రేలియా.. ఆడిలైడ్‌, బ్రిస్బేన్‌లో మెప్పించింది. బౌలింగ్‌ విభాగంలో పేసర్లు సమిష్టిగా రాణించటం ఆసీస్‌కు అదనపు బలం. ఏ ఒక్క పేసర్‌పై కంగారూలు ఆధారపడటం లేదు. పాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌లు నిలకడగా వికెట్లు పడగొడుతున్నారు. జోశ్‌ హాజిల్‌వుడ్‌ గాయపడినా.. స్కాట్‌ బొలాండ్‌ వికెట్ల వేటలో రాణిస్తున్నాడు. బ్యాటింగ్‌ విభాగంలో ఆసీస్‌ కాస్త బలహీనంగా కనిపిస్తోంది. ట్రావిశ్‌ హెడ్‌ అసమాన ఇన్నింగ్స్‌లతో ఆసీస్‌ శిబిరం పైచేయి సాధిస్తోంది. మెల్‌బోర్న్‌లోనూ భారత బౌలర్లకు ట్రావిశ్‌ హెడ్‌ తలనొప్పి కొనసాగితే.. ఆతిథ్య జట్టుకు పండుగే!. స్టీవ్‌ స్మిత్‌, మార్నస్‌ లబుషేన్‌ ఫామ్‌లోకి రావటం రోహిత్‌సేనకు మరిన్ని చిక్కులు తీసుకురానుండగా.. యువ ఓపెనర్‌ శామ్‌ కొంటాస్‌ దూకుడుపై ఆసీస్‌ దీమాగా కనిపిస్తోంది. ఉస్మాన్‌ ఖవాజా, మిచెల్‌ మార్ష్‌ సైతం మెరిస్తే ఆసీస్‌కు ఎదురుండదు. లోయర్‌ ఆర్డర్‌లో అలెక్స్‌ కేరీ, టెయిలెండర్లు విలువైన పరుగులు భారత్‌కు సవాల్‌గా మారింది. మెల్‌బోర్న్‌లో ఏం జరుగుతుందో చూడాలి.
పిచ్‌, వాతావరణం
మెల్‌బోర్న్‌ ఇటీవల కాలంలో పేస్‌ బౌలర్లకు బంగారు గనిగా తయారైంది. పిచ్‌పై 6మిమి పచ్చిక ఉంచుతున్నట్టు క్యూరేటర్‌ వెల్లడించాడు. కానీ, బాక్సింగ్‌ డే రోజున మెల్‌బోర్న్‌లో సూర్యుడు భగభగ మండనున్నాడు. ఇక్కడ ఉష్ణోగ్రతలు గరిష్టంగా 40 డిగ్రీల వరకు ఉండవచ్చు. దీంతో పిచ్‌పై పగుళ్లు కాస్త ముందుగానే ఏర్పడనున్నాయి. పేసర్ల స్వర్గధామం అయినప్పటికీ.. టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకునేందుకు మొగ్గు చూపనుంది. రెండో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించే ప్రమాదం ఉండగా.. మూడో రోజు ఆహ్లాదకర వాతావరణ పరిస్థితులు ఉండనున్నాయి!.
తుది జట్లు (అంచనా) :
భారత్‌: యశస్వి జైస్వాల్‌, కెఎల్‌ రాహుల్‌, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, రిషబ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), రవీంద్ర జడేజా, నితీశ్‌ కుమార్‌ రెడ్డి/వాషింగ్టన్‌ సుందర్‌, ఆకాశ్‌ దీప్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌.
ఆస్ట్రేలియా: ఉస్మాన్‌ ఖవాజా, శామ్‌ కొంటాస్‌, మార్నస్‌ లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్‌, ట్రావిశ్‌ హెడ్‌, మిచెల్‌ మార్ష్‌, అలెక్స్‌ కేరీ (వికెట్‌ కీపర్‌), పాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), మిచెల్‌ స్టార్క్‌, నాథన్‌ లయాన్‌, స్కాట్‌ బొలాండ్‌.