ఉండేదెవరో..? పోయేదెవరో…?

Who was there? Who will go...?– అంతుచిక్కని బీఆర్‌ఎస్‌ నేతల అంతరంగం
– అసెంబ్లీ ఫలితాల తర్వాత ముఖం చాటేసిన సీనియర్లు
– పార్టీ వైపే చూడని కార్పొరేషన్‌ మాజీ చైర్మెన్లు
– గోడ దూకేందుకు రెడీగా ఉన్న గ్రేటర్‌ ఎమ్మెల్యేలు
– వారిలో నలుగురు కాంగ్రెస్‌కు, ఒకరు బీజేపీకి?
– తాజాగా చర్చనీయాంశమైన భద్రాచలం ఎమ్మెల్యే వ్యవహారం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
‘ఒకరిని బుజ్జగించే సరికి…నలుగురు జారుకుంటున్న దుస్థితి…’ ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ను వెంటాడుతున్న సమస్య ఇది. ఉద్యమ సమయంలోనూ, అటు తర్వాత పదేండ్ల ఏలుబడిలో గులాబీ బాస్‌ కేసీఆర్‌ వేసిన ఎత్తుగడలు, పన్నిన వ్యూహాలు ఇప్పుడు పని చేయటం లేదనే వాదనలు వినబడుతున్నాయి. ఆ జిల్లా, ఈ జిల్లా అనే తేడా లేకుండా నేతలందరూ బీఆర్‌ఎస్‌కు బై..బై…చెబుతుండటంతో పార్టీలో ఎవరుంటారో..? ఎవరు పోతారో…? తెలియని అయోమయం నెలకొందని మొదటి నుంచి ఉద్యమ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయకులు వాపోతున్నారు. గతంలో టిక్కెట్‌ ఇవ్వకపోతేనో లేక తనకు నచ్చిన వారికి, పార్టీలోని ప్రత్యర్థులకు టిక్కెట్‌ ఇస్తేనో అలగటం, కార్యక్రమాలకు రాకుండా ఉండటం లేదంటే రాజీనామా చేయటం లాంటి నిరసన కార్యక్రమాలు లీడర్ల నుంచి ఎదురయ్యేవి. ప్రతీ పార్టీలోనూ ఇవి సహజం. కానీ ఇందుకు భిన్నంగా ఇప్పుడు కారు పార్టీలో ప్రజా ప్రతినిధిగా గెలిచినా, టిక్కెట్‌ ఇచ్చినా ఉండని పరిస్థితి. చేవెళ్ల సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌ రెడ్డి, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఉదంతాలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు. మరోవైపు మొన్నటిదాకా ప్రగతి భవన్‌ చుట్టూ ప్రదక్షిణలు చేసిన సీనియర్లలో చాలా మంది ఇప్పుడు పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్‌ వైపు కన్నెత్తి కూడా చూడకపోవటం గమనార్హం. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు కార్పొరేషన్‌ చైర్మెన్లుగా ఉన్న వారిలో అత్యధిక మంది ఇప్పుడు పార్టీకి ముఖం చాటేస్తున్న పరిస్థితి నెలకొంది. వీరిలో పలువురు ఇప్పటికే అధికార కాంగ్రెస్‌తో అంటకాగుతున్నారని వినికిడి.
రంజిత్‌రెడ్డి, కడియం ఉదంతాలతో అప్రమత్తమైన కేసీఆర్‌… క్యాడర్‌లో నెలకొన్న నైరాశ్యాన్ని పోగొట్టి, వారిలో ఉత్సాహాన్ని నింపేందుకు ‘ఎండిపోయిన పొలాల’ బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా జనంలోకి వెళ్లేందుకు, పనిలో పనిగా లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని కూడా షురూ చేసేందుకు ఆయన నిర్ణయించుకుని, దాన్ని అమలు చేస్తున్నారు. అయినా నాయకులు, ప్రజా ప్రతినిధుల గోడ దూకుడుకు ఆయన అడ్డుకట్ట వేయలేకపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీకి అత్యధిక స్థానాలు కట్టబెట్టింది గ్రేటర్‌ హైదరాబాదే. కానీ ఇప్పుడదే గ్రేటర్‌ నేతలు బీఆర్‌ఎస్‌కు తీవ్ర నష్టం చేకూర్చబోతున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఇప్పటికే హస్తం గూటికి చేరి, సికింద్రాబాద్‌ నుంచి ఎంపీగా పోటీ చేస్తుండగా, అదే దారిలో మరికొందరు ఎమ్మెల్యేలు గోడ దూకేందుకు రెడీ అయినట్టు తెలిసింది.
అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం…మాజీ మంత్రి, సీనియర్‌ నేత అయిన తలసాని శ్రీనివాస యాదవ్‌ బీజేపీ అధిష్టానంతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. అంతా ఓకే అయితే ఆయన త్వరలోనే కాషాయ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఇక అంబర్‌పేట, ఎల్‌బీ నగర్‌, ఉప్పల్‌, మల్కాజిగిరి ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్‌, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి… అధికార కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నట్టు సమాచారం. వీరు ఎప్పుడైనా పార్టీ మారే అవకాశం లేకపోలేదని బీఆర్‌ఎస్‌ నేతలే చెబుతుండటం గమనార్హం.
మరోవైపు మంత్రి పొంగుటేటి శ్రీనివాసరెడ్డికి ముఖ్య అనుచరుడైన భద్రాచలం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తాజాగా మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానంపై కాంగ్రెస్‌ నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొనటం తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రధాన ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యే…అధికార పార్టీకి చెందిన సమావేశంలో పాల్గొనటం, దాంతో ఆగకుండా బీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పించటంతో ఆయన కూడా అతి తొందరలోనే ‘కారు దిగనున్నార’నే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అధినేత కార్యకర్తలు, నాయకుల గోడ దూకుళ్లను ఆపేందుకు ఎలాంటి వ్యూహాలు రచిస్తారో వేచి చూడాలి.