భారత్‌తో ఫైనల్లో తలపడేదెవరో..?

Who will face India in the final?– పాకిస్తాన్‌, శ్రీలంక జట్లకు కీలకం
– గెలిచిన జట్టుకు ఫైనల్‌ బెర్త్‌
కొలంబో: ఆసియాకప్‌ క్రికెట్‌ పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. మరో రెండు సూపర్‌-4 మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉండగా.. పాకిస్తాన్‌-శ్రీలంక జట్ల మధ్య గురువారం జరిగే మ్యాచ్‌పై అందరి దృష్టి నెలకొంది. ఫైనల్లో భారత్‌తో తలపడే జట్టేదో పాకిస్తాన్‌, శ్రీలంక జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో తేలిపోనుంది. ఈ రెండు జట్లు సూపర్‌-4లో బంగ్లాదేశ్‌పై నెగ్గి, భారత్‌ చేతిలో ఓటమిపాలయ్యాయి. పాకిస్తాన్‌ జట్టు ఏకంగా 228పరుగుల తేడాతో ఓటమిపాలైతే.. శ్రీలంక జట్టు 41పరుగుల తేడాతో ఓడింది. ఇక బంగ్లాదేశ్‌పై శ్రీలంక జట్టు 21పరుగుల తేడాతో నెగ్గితే.. పాకిస్తాన్‌ జట్టు బంగ్లా నిర్దేశించిన 192పరుగుల లక్ష్యాన్ని 3వికెట్లు కోల్పోయి ఛేదించింది.
సూపర్‌-4 దశలో ఒక్కో జట్టు.. మిగతా వాటితో మూడేసి మ్యాచ్‌లు ఆడతాయి. ఇందులో టాప్‌-2లో నిలిచిన జట్లు ఫైనల్‌ చేరుకుంటాయి. సూపర్‌-4లో రెండేసి మ్యాచ్‌లు ముగిసిన తర్వాత భారతజట్టు 4పాయింట్ల(+2.69 నెట్‌రన్‌రేట్‌)తో అగ్రస్థానంలో నిలిచి మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే ఫైనల్‌కు చేరుకుంది. ఇక శ్రీలంక, పాకిస్తాన్‌ జట్లు రెండేసి మ్యాచ్‌లు ఆడగా.. ఒక్కో మ్యాచ్‌లో ఓడి.. పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. పాకిస్తాన్‌.. భారత్‌పై 228పరుగుల భారీ తేడాతో ఓడిపోవడంతో నెట్‌రన్‌రెట్‌పై ప్రభావం పడి.. మూడో స్థానంలో ఉంది. పాకిస్తాన్‌-శ్రీలంక జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ విజేత సమీకరణాలతో నిమిత్తం లేకుండా నేరుగా భారత్‌తో ఫైనల్‌లో తలపడనుంది. ఇక బంగ్లాదేశ్‌ ఇప్పటికే రెండింటిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. సెప్టెంబర్‌ 15న భారత్‌, బంగ్లా మధ్య జరిగే మ్యాచ్‌ నామమాత్రమే.
వర్షంతో మ్యాచ్‌ రద్దయితే..
పాక్‌-శ్రీలంక జట్ల మధ్య కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగే మ్యాచ్‌ వర్షంతో రద్దయితే ఇరుజట్లకు ఒక్కో పాయింట్‌ దక్కనున్నాయి. దీంతో పాకిస్తాన్‌ కంటే మెరుగైన రన్‌రేట్‌ కలిగి ఉన్న శ్రీలంక జట్టు ఫైనల్‌కు చేరనుంది. ఎందుకంటే మ్యాచ్‌ రద్దయితే ఇరుజట్లకు చెరో పాయింట్‌ లభిస్తే.. 3 పాయింట్లతో ఇరుజట్లు సమానంగా ఉన్నా శ్రీలంక(-0.20), పాకిస్తాన్‌(-1.89) నెట్‌ రన్‌రేట్‌తో 2, 3 స్థానాల్లో ఉన్నాయి. అప్పుడు మెరుగైన రన్‌రేట్‌ కలిగిన శ్రీలంక రెండో స్థానంలో నిలిచి ఫైనల్‌ చేరుకుంటుంది. మ్యాచ్‌ జరిగి తప్పక విజయం సాధిస్తేనే పాకిస్తాన్‌ ఫైనల్‌కు చేరుతుంది. వర్షంతో మ్యాచ్‌ నిలిస్తే మాత్రం పాక్‌ ఫైనల్‌ ఆశలకు ఎదురు దెబ్బ తగిలినట్లే. ఈ క్రమంలో భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌కు రిజర్వ్‌డేను ప్రకటించిన ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌(ఎసిసి).. ఈ మ్యాచ్‌కు కూడా రిజర్వు డేను ప్రకటించాలని మాజీ క్రికెటర్ల వాదిస్తున్నారు.