– రేపు విజయ్ హజారే సెమీఫైనల్స్
వడోదర (గుజరాత్) : ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ ఆఖరు ఘట్టానికి చేరుకుంది. గ్రూప్ దశలో నిలకడగా రాణించి, నాకౌట్‌లో మెరుపు విజయాలు సాధించిన నాలుగు జట్లు ఇప్పుడు ఫైనల్లో బెర్త్ కోసం పోటీపడుతున్నాయి. హర్యానా, కర్ణాటక సహా విదర్భ, మహారాష్ట్రలు బుధవారం జరిగే సెమీఫైనల్లో తాడోపేడో తేల్చుకోనున్నాయి. వడోదరలో మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి. విదర్భ, మహారాష్ట్ర సెమీస్ సమవుజ్జీల సమరం. కరుణ్ నాయర్, శుభమ్ దూబె, యశ్ రాథోడ్, జితేశ్ శర్మ సహా ధ్రువ్ శోరెలతో విదర్బ బ్యాటింగ్ బలంగా ఉంది. బౌలింగ్‌లో సైతం విదర్భ మెరుగ్గానే కనిపిస్తోంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, నిఖిల్ నాయక్, రాహుల్ త్రిపాఠి, అంకిత్ బవ్నెలు మహారాష్ట్రకు కీలకం. సూపర్ ఫామ్‌లో ఈ జట్లలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. ఇక హర్యానాతో సెమీస్‌లో కర్ణాటక ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. మయాంక్ అగర్వాల్, శ్రేయాస్ గోపాల్, అభినవ్ మనోహర్, విజరుకుమార్ వైశాక్‌లు మంచి ఫామ్‌లో ఉన్నారు. హర్యానా సమిష్టి ప్రదర్శనపై ఆధారపడింది. అకింత్, దినేశ్, కపిల్ సహా అమిత్ రానా, హర్షల్ పటేల్‌లు హర్యానాకు కీలకం కానున్నారు. విజరు హజారే ట్రోఫీ ఫైనల్ శనివారం జరుగుతుంది.