మల్కాజిగిరిపై పాచిక పారేది ఎవరిదో!

– మూడు ఎన్నికల్లో విభిన్న తీర్పిచ్చిన ఓటర్లు
– ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ప్రధాన పార్టీలు
– ఇప్పటి నుంచే అస్త్ర శాస్త్రాలు సిద్ధం
దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానంలో గెలిచేందుకు అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే అస్త్ర శాస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో గతేడాది జరిగిన సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ ఏకపక్ష విజయం సాధించినా మల్కాజిగిరి పార్లమెంట్‌ పరిధిలో మాత్రం బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారోనని, ఏ పార్టీ అభ్యర్థి విజయం సాదిస్తారో..మరి కొన్నినెలల్లో తెలవబోనుంది. కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌లో పార్టీల్లో ఆశావహులు భారీగానే ఉన్నారు.
నవతెలంగాణ-బోడుప్పల్‌
విభిన్నమైన తీర్పు మల్కాజిగిరి ఓటర్ల సొంతం 2009లో నియోజకవర్గాల పునర్‌:వ్యవస్థికరణలో భాగంగా మల్కాజిగిరి పార్లమెంటు ఏర్పాటైంది. మల్కాజిగిరి నియోజకవర్గం జనరల్‌ స్థానం అయినా నాటి ఎన్నికల్లో దళిత సామజిక వర్గానికి చెందిన సర్వే సత్యనారాయణను కాంగ్రెస్‌ పార్టీ రంగంలోకి దింపింది. అప్పటి మహాకూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థిగా ప్రముఖ న్యాయవాది తూం భీంసేన్‌, సినీనటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా మాజీ హౌం మంత్రి తూళ్ల దేవేందర్‌గౌడ్‌, కాంగ్రెస్‌ అభ్యర్థిగా సర్వే సత్యనారాయణ పోటీ పడ్డారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా సర్వే సత్యనారాయణ 93 వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచారు. అనంతరం మన్మోహన్‌ సింగ్‌ నేతత్వంలోని యూపీఏ-2 సర్కారులో కేంద్ర మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2014లో జరిగిన ఎన్నికలలో రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ గాలి బలంగా వీచినా మల్కాజిగిరి పార్లమెంట్‌ పరిధిలో మాత్రం బీజేపీ-టీడీపీ కూటమి అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో విజయం సాధించారు. మల్కాజిగిరి పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ బలపరిచిన టీడీపీ అభ్యర్థిగా చామకూర మల్లారెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావుపై 30వేల పై చిలుకు ఓట్లతో గెలుపొందారు. అనంతరం రాజకీయ పరిణామాలు మారిపోవడంతో టీడీపీ నుంచి గెలుపొందిన మల్లారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో మళ్లీ ఓటర్లు విలక్షణమైన తీర్పు ఇచ్చారు. పార్లమెంటు ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు జరిగిన శాసనసభ ఎన్నికలలో పార్లమెంటు పరిధిలోని లాల్‌ బహదూర్‌ నగర్‌ (ఎల్బీనగర్‌) మినహా మిగిలిన ఆరు స్థానాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు బంపర్‌ మెజార్టీతో గెలుపొందారు. అనంతరం జరిగిన పరిణామల నేపథ్యంలో ఎల్బీనగర్‌ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి కూడా అధికార టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో టీఆర్‌ఎస్‌ పార్టీ మెజార్టీ మూడు లక్షలకు పైగా ఉండడంతో ఈ స్థానం నుంచి ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాతో మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు ప్రస్తుత మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డిని టీఆర్‌ఎస్‌ తరఫున బరిలో దింపింది. శాసనసభ ఎన్నికలలో చతికిల పడిన కాంగ్రెస్‌ పార్టీ తరఫున అప్పటి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డిని రంగంలోకి దింపింది. అప్పటికే కొడంగల్‌లో ఓటమి పాలైన రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసేందుకు ముందుకు వచ్చారు. ప్రశ్నించే గొంతు కావాలని ప్రజలు మల్కాజిగిరి రేవంత్‌ రెడ్డిని బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖరరెడ్డిపై సుమారు పది వేల తొమ్మిది వందల ఓట్ల ఆధిక్యంతో గెలిపించారు. ఇలా మూడు సార్లు మూడు విభిన్న రకాలుగా మల్కాజిగిరి ఓటర్లు తీర్పు ఇవ్వడంతో ఈ సారి ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో అన్ని పార్టీలు కథనరంగంలోకి అన్ని రకాల అస్త్రాలను సిద్ధం చేసుకుని ముందుకు సాగుతున్నాయి.
బీఆర్‌ఎస్‌కు పూర్తి స్థాయిలో మెజార్టీ ఉన్నా..
ప్రస్తుతం మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో అన్ని ఎమ్మెల్యే సెగ్మెంట్లు బీఆర్‌ఎస్‌ పార్టీకే ఉన్నాయి. 3.50 లక్షల మెజార్టీ ఓట్ల ఆధిక్యం కూడా ఉంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో పరిస్థితులు మారాయి. ఇక్కడ నుంచి రేవంత్‌రెడ్డి ఎంపీగా ఎన్నికైన తర్వాతనే టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన నేతృత్వంలోనే జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. మల్కాజిగిరి ఎంపీగా ఉన్న రేవంత్‌రెడ్డి కొడంగల్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై తెలంగాణకు రెండో ముఖ్యమంత్రి అయ్యారు. తనకు రాజకీయ పునర్‌ జన్మనిచ్చిన మల్కాజిగిరి మేడ్చల్‌పై ప్రత్యేకమైన అభిమానం ఉంటుందని ముఖ్యమంత్రి హౌదాలో రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో మల్కాజిగిరి ఎంపీ స్థానం పోటీ విషయంలో ప్రాధాన్యత ఏర్పడింది.
ఆశావహులు భారీగానే!
మల్కాజిగిరి ఎంపీ సెగ్మెంట్లో దాదాపు దేశంలోని అన్ని జాతులకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. అందుకే ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ప్రధాన పార్టీలకు చెందిన ఆశావహులు భారీగానే క్యూ కట్టారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ సిట్టింగ్‌ స్థానం కావడం, అందులోనూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావడంతో ఇక్కడ గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుక్నుట్టు సమాచారం. అందుకే ఇక్కడ నుంచి సీఎం సోదరుడు కొండల్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, తోటకూర వజ్రేష్‌ యాదవ్‌ (బీసీకోటా), పాటు మరికొందరు నేతలు సీటు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. బీఆర్‌ఎస్‌ నుంచి ప్రస్తుత మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి లేదా ఆయన తనయుడు భద్రారెడ్డి, ఆయన భార్య ప్రితి రెడ్డిలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మల్లారెడ్డి తన మనసులోని మాటను మీడియా ముందు వెల్లడించారు కూడా. ఇక బీజేపీ నుంచి ఆశావహులు భారీగానే ఉన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావు, మేడ్చల్‌ జిల్లా అర్బన్‌ అధ్యక్షుడు పన్నాల హరీష్‌ రెడ్డి, మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌, ప్రముఖ విద్యా సంస్థల అధినేత మల్కం కొమరయ్య, మాజీ హౌం మంత్రి తనయుడు తూళ్ల వీరేందర్‌గౌడ్‌, తదితరులు ప్రయత్నిస్తున్నారు.