బీహార్‌లో గెలిచేదెవరు?

బీహార్‌లో గెలిచేదెవరు?– ఇండియ ఫోరం, ఎన్డీఏ మధ్య ద్విముఖ పోటీ
– నిరుద్యోగం, ధరల పెరుగుదలే ఎన్నికల ఎజెండా
జె.జగదీష్‌, నవతెలంగాణ
జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే బీహార్‌లో ఇండియా ఫోరం, ఎన్డీఏ మధ్య ద్విముఖ పోటీ నెలకొంది. 40 స్థానాలున్న బీహార్‌లో ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో నాలుగు, తరువాత నాలుగు విడతల్లో ఐదేసి స్థానాలు, చివరి రెండు విడతల్లో ఎనిమిదేసి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి తమ స్థానాలను నిలబెట్టుకోవాలని ఎన్డీఏ కూటమి ప్రయత్నించగా, బీహార్‌లో విజయంతో ఎన్డీఏ కూటమిని మట్టి కరిపించేందుకు ఇండియా ఫోరం వ్యూహాన్ని రచిస్తుంది.
పొత్తులు, కూటములు
చైతన్యవంతమైన బీహార్‌లో దాదాపుగా పాత కూటమి పొత్తులే కొనసాగుతున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ, లోక్‌ జనశక్తి పార్టీలతో కూడిన ఎన్డీఏ కూటమి ఏకంగా 39 సీట్లను గెలుచుకుంది. బీజేపీ 17 సీట్లలో పోటీ చేసి అన్నీ గెలుచుకుంది. జేడీయూ 17 సీట్లకు 16 చోట్ల, ఎల్జేపీ ఆరింటికి ఆరూ కైవసం చేసుకున్నాయి. కాంగ్రెస్‌, ఆర్జేడి తదితర పార్టీల మహాకూటమి ఓటమి చెందింది. కాంగ్రెస్‌ తొమ్మిది చోట్ల పోటీ చేసి ఒక సీటు గెల్చుకోగా, ఆర్జెడి 19 స్థానాల్లో పోటీ చేసి ఒక్క స్థానాన్ని గెలుచుకోలేకపోయింది. ఈసారి ఎన్డీఏ కూటమిలో బీజేపీ 17, జేడీయూ 16, చిరాగ్‌ పాశ్వాన్‌ సారథ్యంలోని ఎల్జేపీి 5, జితన్‌ రామ్‌ మాంఝికి చెందిన హిందుస్తాన్‌ ఆవామ్‌ మోర్చా, రాష్ట్రీయ లోక్‌ సమతా ఒక్కో స్థానంలో పోటీ చేయనున్నాయి. ఇండియా ఫోరంలో ఆర్జేడీ 26, కాంగ్రెస్‌ 9, సీపీఐ(ఎంఎల్‌) 3, సీపీఐ(ఎం)1, సీపీఐ 1 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. అయితే ఆర్జేడీ తమ 26 సీట్లలో మూడింటిని మాజీ మంత్రి ముకేశ్‌ సాహ్ని సారథ్యంలోని వికాసిల్‌ ఇన్సాన్‌ పార్టీ (వీఐపీ)కి కేటాయించింది.
కప్పగెంతుల నితీష్‌
బీహార్‌ రాజకీయాల్లో ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ కప్పగెంతులకు మారుపేరుగా నిలిచారు. ఏదో ఒక పార్టీ పొత్తుతో 15 ఏండ్లుగా సీఎం పీఠాన్ని అంటిపెట్టుకున్నారు. ఒకసారి బీజేపీతో, అనతి కాలంలోనే ఆర్జెడీతో ఇలా కూటములు మారుస్తూ పబ్బం గడుపుకుంటూ జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పుతున్నట్లు కలరింగ్‌ ఇస్తున్నారు. 2015 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమికి గుడ్‌ బై చెప్పి బయటకు వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, సమాజ్‌ వాదీ, జేడీఎస్‌, కాంగ్రెస్‌ మహా కూటమిగా పోటీ చేశాయి. ఆర్జేడీ అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించినా నితీష్‌ సీఎం పదవి దక్కించుకున్నారు. రెండేండ్లు తిరిగేసరికి మహాకూటమికి రాంరాం చెప్పి మళ్లీ బీజేపీతో జట్టుకట్టారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమితో సీట్ల సర్దుబాటు చేసుకున్నారు. ఆ తరువాత 2020 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎన్డీఏ భాగస్వామిగా పోటీ చేసి సీఎం పీఠమెక్కారు. బీజేపీ 74, జేడీయూ 43 స్థానాలు వచ్చాయి. బీజేపీకి ఎక్కువ సీట్లు దక్కినా నితీష్‌ మళ్లీ సీఎం పదవి దక్కించుకున్నారు. మళ్లీ రెండేండ్లలోనే ఆయన మళ్లీ ప్లేటు ఫిరాయించారు. ప్రతిపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రతిపక్షాల ఇండియా ఫోరంలో చేరారు. ఆయనను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారని ఆశించారు. కాని అది జరగకపోవడంతో ఇండియా ఫోరం నుంచి బయటకెళ్లి, ఎన్డీఏ కూటమిలో చేరారు. ఇలా కప్పగెంతులేస్తూ ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఉన్నారని నితీష్‌ కుమార్‌ పై ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ సీట్లకు గండి
దీర్ఘకాలంగా అధికారంలో ఉన్న నితీష్‌ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఎన్డీఏ సీట్లకు గండి పడనుంది. రాష్ట్రంలో కులగణన చేపట్టడాన్ని నితీష్‌ సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారు. అది తమ ఘనతేనని కాంగ్రెస్‌, ఆర్జెడీ ప్రచారం చేసుకుంటోంది. దేశవ్యాప్తంగా ఆ హామీ ఇస్తున్న విషయాన్ని, మ్యానిఫెస్టోలో పేర్కొన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. బీజేపీ రామ మందిరాన్నే నమ్ముకుంది. ఎన్నికల వేళ వెన్నుపోటు పొడిచిన నితీష్‌కు గుణపాఠం నేర్పాలని ఇండియా ఫోరం పట్టుదలగా ఉంది. ఆయనది పచ్చి అవకాశవాదమంటూ కాంగ్రెస్‌, ఆర్జేడీ దుమ్మెత్తిపోస్తున్నాయి. రాష్ట్రంలో కులగణన తమ సంకీర్ణ సర్కారు ఘనతేనని ప్రచారం చేస్తున్నాయి.
కులాలు చుట్టూ రాజకీయాలు
బీహార్‌లో దశాబ్దాలుగా కులాల చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి. నితీష్‌ చేపట్టిన కులగణన మరోసారి రిజర్వేషన్ల అంశాన్ని చర్చకు పెట్టింది. రాష్ట్రంలో 94 లక్షల కుటుంబాలు (34.13 శాతం) నెలకు రూ.6,000 సంపాదన కూడా లేక పేదరికంలో మగ్గుతున్నాయని కులగణనలో వెల్లడైంది. రాష్ట్రంలో రిజర్వేషన్లను 65 శాతానికి పెంచాల్సిందేనని నితీష్‌ పేర్కొన్నారు. రాష్ట్ర జనాభాలో 19.65 శాతం ఎస్సీలు, 1.68 శాతం ఎస్టీలున్నారు. వారిలో ఏకంగా 42.7 శాతం మంది నిరుపేదలని కులగణనలో తేలింది. 27.13 శాతం ఓబీసీలు ఉన్నారు. వీరిలో 14.26 శాతం యాదవులు, 4.3 శాతం కుష్వాహా, 2.9 కుర్మీలు ఉన్నారు. దాదాపు 17.7 శాతం మంది ముస్లింలు ఉన్నారు. 10.6 శాతం అగ్ర వర్ణాలు ఉన్నాయి. అందులో బ్రాహ్మణులు 3.7 శాతం, రాజ్‌ పుత్‌ (ఠాకూర్లు) 3.4 శాతం, భూమిహార్లు 2.9 శాతం, కాయస్థులు 0.6 శాతం ఉన్నారు.
పాశ్వాన్‌ కుటుంబంలో చిచ్చు పెట్టిన బీజేపీ
బీహార్‌లో పాశ్వాన్‌ కుటుంబానికి పేరుంది. నాలుగైదు దశాబ్దాల పాటు రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ జాతీయ రాజకీయాల్లో ఉన్నారు. ఎవరు అధికారంలో ఉన్నా, ఆయన కేంద్ర మంత్రిగా ఉండేవారు. అలాంటి కుటుంబంలో బీజేపీ చిచ్చు పెట్టింది. అబ్బారు-బాబారు మధ్య బీజేపీ గొడవ పెట్టింది. ఎల్జేపీ వ్యవస్థాపకుడు రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ మరణం తరువాత ఆయన వారసత్వం కోసం కుమారుడు చిరాగ్‌, సోదరుడు పశుపతి పరాస్‌ హౌరాహౌరీగా తలపడ్డారు. చివరికి పార్టీని పరాస్‌ చేజిక్కించుకున్నారు. చిరాగ్‌కు ఎల్జేపీ (రాం విలాస్‌), పశుపతికి రాష్ట్రీయ లోక్‌ జనశక్తి పార్టీ (ఆర్‌ఎపి) పేర్లను ఎన్నికల సంఘం కేటాయించింది. పశుపతి కేంద్ర మంత్రిగా ఉండేవారు. పశుపతి పార్టీకే బీజేపీ మద్దతునిచ్చింది. చిరాగ్‌ను రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ బంగ్లాను కూడా ఖాళీ చేయమని కేంద్రం నోటీసు ఇచ్చింది. మళ్లీ ఏమైందో ఏమోగాని పశుపతి పార్టీకి బీజేపీ ఒక్క సీటూ ఇవ్వకపోవడంతో ఆయన కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలిగారు. సొంతంగా పోటీ చేస్తామని ప్రకటించారు. చిరాగ్‌కు బీజేపీ ఐదు సీట్లు ఇచ్చింది.
నిరుద్యోగం, ధరల పెరుగుదలే ప్రధాన సమస్యలు
బీహార్‌లో నిరుద్యోగం, ధరలు పెరుగుదలే ప్రధాన ఎన్నికల అంశాలుగా ఉన్నాయి. మోడీ హయాంలో నిరుద్యోగం, నిత్యావసరాల ధరల పెరుగుదల, కార్పొరేట్‌ దోపిడీ తదితరాలను ప్రచారాస్త్రాలుగా ప్రతిపక్షాల ఇండియా ఫోరం మలచుకుంటున్నాయి. నిరుద్యోగం, ద్రవ్యోల్బణమే ఎన్నికల ఎజెండా అని ఆర్జేడీ నేత తేజశ్వీ యాదవ్‌ పేర్కొన్నారు.

మొత్తం ఓట్లు : 7,64,33,329
పురుషులు : 4,00,29,136
మహిళలు : 3,64,01,903
ట్రాన్స్‌ జండర్స్‌ : 2,290
మొత్తం లోక్‌సభ స్థానాలు : 40