తప్పెవరిది…శిక్షెవరికి?

వాతావరణ మార్పుల కారణంగా సంభవించే ‘మేఘ విస్ఫోటనం’ (క్లౌడ్‌ బరస్ట్‌) వలన తక్కువ సమయంలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షపు ధాటికి కాలనీలను వరదలు ముంచెత్తుతు న్నాయి.ఇది విపత్తులకు దారితీస్తున్నది. వర్షపు నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారి, వరదలకు కారణమవుతున్న నిర్మాణాల తొలగింపు, కనుమరుగవుతున్న చెరువుల పరిరక్షణ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘హైడ్రా’ ఆలోచన సరైనదే. కానీ దాన్ని అమలు చేస్తున్న తీరు అసమంజసంగా ఉంది. ఎందుకంటే హైడ్రా చర్యలు సామాన్య ప్రజలపై పడుతున్నది. ఎందుకంటే ఇండ్లు, స్థలాలు కొనే సామాన్య ప్రజలకు ఎన్కంబరెన్స్‌ సర్టిఫికేట్‌(ఈసీ), డబుల్‌ రిజిస్ట్రేషన్‌, లింక్‌ డాక్యుమెంట్స్‌ మాత్రమే తెలుసు. ఎఫ్‌టిఎల్‌, బఫర్‌ జోన్‌ వంటి అంశాల గురించి తెలియవు. చెరువులను ఇండ్ల స్థలాలుగా మార్చిన వ్యాపారులకు, వీటిని ఆమోదించిన అధికారులకు ఎఫ్‌టిఎల్‌, బఫర్‌ జోన్ల గురించి అవగాహన ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్‌ సమయంలో సామాన్య ప్రజలకు ఈ విషయాలను తెలియజేయరు. ప్రభుత్వం తమ ఇంటిని లేదా స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేసిన తరువాత ప్రజలు తమ ఇంటికి ఇక ఎటువంటి ఢోకా లేదని భావిస్తారు.ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ చేసి, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ ఇచ్చిన నిర్మాణాలను సైతం ఇప్పుడు ప్రభుత్వమే అక్రమ కట్టడాలని కూల్చి వేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.చెరువులను ఆక్రమించి, అధికారుల సహకారంతో ఇండ్ల స్థలాలుగా మార్చి తప్పొకరు చేస్తే, ఆ ఫలితం మాత్రం అనుభవిస్తున్నది సామాన్యులు. ఎన్నో కష్టనష్టాలకోర్చి, కుటుంబాన్ని పోషించుకుంటూ, పిల్లల భవిష్యత్తు కోసం కష్టార్జితంతో సొంతింటి కలను నెరవేర్చుకున్నవారి జీవితాలను హైడ్రా చిదిమేస్తున్నది. అక్రమ నిర్మాణాలంటూ పేదల ఇండ్లను కూల్చేస్తున్నది. దీంతో నిరాశ్రయులు అయిన కుటుంబాల్లో నైరాశ్యం అలుముకుంటోంది. ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమవడంతో విద్యార్థుల చదువు, భవిష్యత్తు ఇంటి శిథిలాల కింద నలిగిపోతోంది. హైదరాబాద్‌కు ‘లేక్‌ సిటీ’ అని పేరు. నగరంలో చాలా వరకు చెరువులు కనుమరుగైపోయి, కాలనీలుగా ఏర్పడ్డాయి. ఉపాధి నిమిత్తం జిల్లాల నుండి హైదరాబాద్‌కు వచ్చి ఇండ్లు కొనుక్కున్న వారికి, వారి ఇంటి కింద ఒకప్పుడు ఏ చెరువు ఉన్నదో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో తమ ఇండ్లను ఏక్షణాన శిథిలావస్ధలో చూడాల్సి వస్తుందో అనే భయం సామాన్యుల్లో నేడు ఏర్పడింది. ఇప్పుడు ఎఫ్‌టిఎల్‌, బఫర్‌ జోన్ల పేరుతో ఇండ్లను కూల్చుతూ పోతే ప్రజలు కలలుకం టున్న ‘బంగారు తెలంగాణ’ కాస్త ‘శిధిల తెలంగాణ’గా మిగిలిపోతుంది. ఇండ్లను కూల్చటము కన్నా ఇండ్ల నిర్మాణము వలన కలిగే వరదలు వంటి విపత్తులను నివారించటానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. వాటి ఖర్చును ఇంటి యజమానులు లేదా కాలనీ వాసుల నుండి వసూలు చేసినట్లయితే కొంత ప్రయోజన కరంగా ఉంటుంది.చెరువుల దురాక్రమణ ఎంత ప్రమాద కరమో, మంచినీటి చెరువులలో వ్యర్ధాలను వదిలి కలుషితమైన దుర్గంధ చెరువులుగా మార్చడం కూడా అంతటి వినాశనం. హైదరాబాద్‌లో ఒక్కప్పటి మంచినీటి చెరువులు ప్రస్తుతము దుర్గంధ స్థావ రాలుగా మారిపోయాయి. వీటి వల్ల కూడా విపత్తులు సంభవిస్తాయి. ‘చెరువుల పరిరక్షణ’ పేరిట ఇండ్లను కూల్చడం మాత్రమే పరిష్కారం మార్గం కాదు, వాటిని కాలుష్య రహిత మంచినీటి చెరువులుగా కొనసాగించడానికి ఒక నిర్దిష్టమయిన కార్యక్రమాన్ని రూపొందిం చడం మంచిది. చెరువుల పరిరక్షణ కార్యక్రమము విజయవంతమ వుతంది గనుక ఈ సమస్య ను బహుముఖ కోణంలో ఆలోచించి సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా, సామాజిక సమస్యలు తలెత్తకుండా ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తే ప్రకృతి విపత్తుల నుండి నగరాన్ని కాపాడిన వారవుతారు, అలాగే ప్రజలూ బాగుపడ తారు. ఇండ్లు కోల్పోయి రోడ్లపై పడ్డ బాధితుల పట్ల సర్కార్‌ చిత్తశుద్ధిని ప్రదర్శించాలి. వారికి ప్రత్యామ్నా యంగా ఇండ్లు నిర్మించివ్వాలి. ఎందుకంటే, ఆక్రమణ అని తెలియక ఇండ్లు నిర్మించు కున్న సామాన్యులే ఎక్కువ నష్టపోతున్న విషయం గ్రహించాలి.
– శ్రీదరాల రాము, 9441184667