బుగ్గ కారెక్కేదెవరో..!

Who cares about the cheek..!– క్యాబినెట్‌ విస్తరణపై పలువురి ఆశలు
– ప్రాతినిధ్యం లేని ఉమ్మడి జిల్లాలకు ఈసారి ప్రాధాన్యత
– సామాజిక తరగతులకు పెద్దపీట
– ఢిల్లీ పెద్దలతో ముఖ్యమంత్రి మంతనాలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ తిరిగి చర్చనీయాంశంగా మారింది. ఈ విస్తరణపై కాంగ్రెస్‌లోని ఆశావహులు గంపెడాశలు పెట్టుకున్నారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారోనని ఎదురు చూస్తున్నారు. సీఎం కూడా త్వరలో క్యాబినెట్‌ విస్తరణపై మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలను తీసుకునే అవకాశం ఉన్నది. మంత్రివర్గ విస్తరణను స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిన తర్వాత చేపడదామా? లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అనంతరం భర్తీ చేద్దామా? అనే అంశంపై ఆయన సమాలోచన చేస్తున్నారు. పార్లమెంట్‌ ఎన్నికలు ముగిసి పాలనపై ప్రభుత్వం ఫోకస్‌ పెట్టిన నేపథ్యంలో విస్తరణ ప్రక్రియ వేగవంతం చేయనుందని సమాచారం.
ముఖ్యంగా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని ఉమ్మడి జిల్లాల నుంచి క్యాబినెట్‌ విస్తరణ కోసం ఒత్తిడి పెరుగుతున్నది. ఖాళీగా ఉన్న ఆరు బెర్తులను ఎప్పుడు భర్తీ చేస్తారోనని చాలా మంది ఆశావహులు ఎదురు చూస్తున్నారు. పార్లమెంటు ఎన్నికలు పూర్తి కాగానే మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ పార్టీ ఇప్పటికే గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. దీంతో మంత్రి పదవి కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఈ సన్నాహాల్లో ఉన్నారు. కొత్త మంత్రివర్గ విస్తరణలో ప్రధానంగా బీసీ, అందులో ముఖ్యంగా ముదిరాజ్‌, మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యత కల్పించనున్నట్టు పార్టీలో జోరుగా చర్చ మొదలైంది.
ఆ ఆరుగురెవరు?
క్యాబినెట్‌ కూర్పులో ఉమ్మడి జిల్లాలు, సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని భర్తీ చేస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి పలుమార్లు చెప్పారు. ప్రస్తుతం సీఎంతో కలిపి 12 మంది మంత్రులున్నారు. నల్లగొండ, కరీంనగర్‌, వరంగల్‌ ఒక్కో జిల్లాలో ఇద్దరు చొప్పున మంత్రులుండగా, ఖమ్మం నుంచి ఏకంగా ముగ్గురికి ప్రాతినిధ్యం ఉన్నది. మెదక్‌లో ఒక్కరే ఉన్నారు. మహబూబ్‌నగర్‌కు సీఎంతోపాటు మరొక మంత్రి పదవి దక్కింది. ఇంకా మంత్రివర్గంలో ఆరుగురికి అవకాశం ఉన్నది. హైదరాబాద్‌, రంగారెడ్డి, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు క్యాబినెట్‌లో ప్రాతినిధ్యం లేదు. ఈసారి ఆయా జిల్లాలకు అవకాశం కల్పిస్తూనే, సామాజిక వర్గాల వారీగా భర్తీ చేయనున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా నుంచి ప్రేమ్‌సాగర్‌రావు, పెద్దపల్లి నుంచి గడ్డం వివేక్‌ వెంకటస్వామి, నిజామాబాద్‌ నుంచి సుదర్శన్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి వాకాటి శ్రీహరిరావు (ముదిరాజ్‌), రంగారెడ్డి నుంచి వీరపల్లి శంకర్‌ (రజక), హైదరాబాద్‌ నుంచి అజరుద్దీన్‌ లేదా ఫిరోజ్‌ఖాన్‌కు బెర్తు దక్కే అవకాశం ఉందనే చర్చ కొనసాగుతున్నది. జిల్లాలో ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం లేకపోవడంతో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలో అవకాశం కల్పించాలనే ఉద్దేశంలో సీఎం ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా మంత్రిపదవి ఆశిస్తున్నట్టు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంటును గెలిపిస్తే ఆయనకు మంత్రిపదవి ఇస్తామంటూ హామీ ఇచ్చినట్టు గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి. ఆ స్థానానికి ఆయనే ఇన్‌చార్జీగా వ్యవహరించారు. అభ్యర్థి గెలుపు కోసం కోమటిరెడ్డి బ్రదర్స్‌ అహర్నిశలు కష్టపడి పని చేశారనే టాక్‌ వచ్చింది. ఈ క్రమంలో రాజగోపాల్‌రెడ్డి కూడా బెర్తు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం రేవంత్‌ … ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది.