– ఆసక్తికరంగా సార్వత్రికం
– మూడు పార్టీల మధ్య ‘జంగ్’
– సర్వే సంస్థల హడావిడి
– ఇంటెలిజెన్స్ ఆరాటం
– ఎర్రటి ఎండల్లో ప్రచారం
– అప్రమత్తతలో రాజకీయ పార్టీలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు ఆసక్తిని రేపుతున్నాయి. మరో మూడు వారాల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల్లో హడావిడి పెరిగింది. రెండు రోజులుగా నామినేషన్ల స్వీకరణ సైతం జరుగుతోన్నది. 17 లోక్‌సభ స్థానాలకు మే 13న పోలింగ్ నిర్వహించనున్నారు. దేశవ్యాప్త ఎన్నికల ప్రక్రియలో భాగంగా నాలుగో దశలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, సీపీఐ(ఎం), ఏఐఎంఐఎం తదితర పార్టీలు ఎన్నికల బరిలో ఉన్నాయి. తమ సత్తా చాటేందుకు శ్రమిస్తున్నాయి. ఎర్రటి ఎండల్లో ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నాయి. దాదాపు 3.31 కోట్లకుపైగా ఓటర్లు తమ తమ ఎంపీలను ఎన్నుకోనున్నారు. ఇదిలావుండగా మధ్యలో ప్రముఖ టీవీలు, సర్వే సంస్థలు, ప్రభుత్వ ఇంటెలిజెన్స్ సైతం హడావిడి చేస్తున్నాయి. ఆరాటపడుతున్నాయి. వచ్చే ఐదేండ్ల దేశ భవిత్యాన్ని ప్రజలు ఎవరి చేతుల్లో పెట్టబోతున్నారనే సంగతిని ముందుగానే పసిగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆసక్తి, అప్రమత్తతను ప్రదర్శిస్తున్నాయి. మధ్యలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ సైతం డేగ కన్నేసింది. రాష్ట్రంలో అణువణువూ గాలిస్తోంది. కాగా ఈ ఎన్నికల్లో అన్నీ పార్టీలు తమ గెలుపు పట్ల ధీమాతో ఉన్నాయి.
ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ తమ పట్టును నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎక్కడిక్కడ సభలు, సమావేశాల ద్వారా ప్రజలను కూడగట్టి ఓట్లరూపంలో సొమ్ముచేసుకునేందుకు కృషిచేస్తున్నాయి. మ్యానిఫెస్టోల ద్వారా తమ విధానాలను ప్రజల ముందుంచే ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ ఏకంగా తమ జాతీయ పార్టీ మ్యానిఫెస్టోను హైదరాబాద్ సమీపంలోని తుక్కుగూడలో విడుదల చేసింది. బీజేపీ సైతం తెలుగు కాపీని ప్రజలకు పంపింది. బీఆర్‌ఎస్ తమ విధానాలను ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంది. మొత్తం 17 లోక్‌సభ స్థానాలకుగాను మూడు ఎస్సీ, రెండు ఎస్టీ సీట్లు. ఎలాంటి పరిస్థితుల్లోనూ 14 నుంచి 15 స్థానాల్లో గెలుపొందాలని కాంగ్రెస్ చెమటోడుస్తోంది. తమ బలాన్ని మరింత పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది. టికెట్లు తీసుకుని పోటీ చేయడానికి నిరాకరించిన పరిస్థితుల్లో పరువు కాపాడుకునే యత్నాల్లో బీఆర్‌ఎస్ ఉంది. ఎక్కువ సర్వే సంస్థలు కాంగ్రెస్‌కే డప్పుకొడుతున్నాయి. కొన్ని సీట్లు ఇతర పార్టీలకూ వస్తాయని చెబుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు మాత్రం గ్రామాలు, మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో జల్లెడపడుతున్నాయి. మున్సిపాల్టీలు, కార్పొరేషన్లల్లోనూ ప్రజల అంతరంగాన్ని తెలుసుకుంటున్నాయి. నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్,వరంగల్,నిజామాబాద్ ,మల్కాజ్‌గిరి ,సికింద్రాబాద్, మహబూబ్ నగర్,భువనగిరి, మహబూబాబాద్, పెద్దపల్లి సీట్లపై ఆసక్తి నెలకొంది. వేగులు సైతం ఈ సీట్లపై పదే పదే ఆరా తీస్తున్నారు. రాష్ట్రంలో గత మూడు వారాల్లో రెండేసీసార్లు జనం నాడిని పట్టుకునేందుకు ప్రయ త్నాలు జరిగినట్టు సమాచారం. ఎస్సీ, ఎస్టీ సీట్లపైనా ప్రత్యేక దృష్టి ఉంది.భారీ బహిరంగసభలు పెడు తూనే సామాజిక తరగతులవారీగా గంపగుత్తగా ఓట్లను మూటకటు ్టకునేందుకు ప్రధాన పార్టీలన్నీ వ్యూహరచన చేస్తున్నాయి. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే పాల్గొన్నారు. అలాగే విచ్చలవిడిగా డబ్బులను ఖర్చుపెడుతున్నాయనే సంగతి బహిరంగ సత్యం.