వైకల్యం ఎవరిది?

బాధ్యాతాయుతమైన పదవుల్లో ఉండే బ్యూరోకాట్లు, ప్రజా ప్రతినిధులు, సెలబ్రెటీలు పబ్లిక్‌ డొమైన్‌లో తమ భావాలను వ్యక్తీకరించేటప్పుడు రాజ్యాంగానికి లోబడి మానవీయ కోణాన్ని ఆవిష్కరించాలి. వ్యక్తిగతంగా ఎలాంటి అభిప్రాయాలున్నా అది ప్రజా బాహుళ్యంలోకి వేళ్లే సందర్భంలో చట్టాలను, బాధ్యతలను పరిగణనలోకి తీసుకోవాలి. అలా కాకుండా ఇష్టారీతిన మాట్లాడుతా మంటే చట్టం ఒప్పుకోదు… సమాజం అస్సలొప్పుకోదు. ”స్మితా సబర్వాల్‌” ఏడాది క్రితం వరకు తెలంగాణ గడ్డమీద ఒక వెలుగు వెలిగిన ఐఏఎస్‌. ఆధునిక భావాలు గల మహిళా అధికారిణి. స్త్రీలు, వారి హక్కుల విషయంలో నిక్కచ్చిగా మాట్లాడుతారు. ప్రపంచంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా వెంటనే స్పందిస్తారు. ‘ఎక్స్‌’లో ఆమెను చాలా మంది ఫాలో అవుతారు. ప్రభుత్వం మారిన తర్వాత ఆమె ప్రభ తగ్గిందనుకోండి! అది వేరే విషయం. అయితే ఇటీవల ఆమె వికలాంగులపై చేసిన వ్యాఖ్యలు పెను దూమారం లేపాయి. వికలాంగుల కోటాలో సివిల్‌ సర్వెంట్‌గా ఉద్యోగం పొందిన ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేద్కర్‌ వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకుని చేసిన వ్యాఖ్యలు దేశవ్యా ప్తంగా చర్చకు దారితీశాయి. స్మితా సబర్వాల్‌పై చర్య తీసుకోవాలనే డిమాండ్‌ రాష్ట్రంలోనూ బలంగా వినిపిం చింది. వైకల్యం ఎవరిదంటూ? చాలామంది ఆమెను నెట్టింట్లో నిలదీశారు. ఏకంగా తెలంగాణ శాసన మండలిని కూడా ఈ ప్రకంపనలు తాకాయి. ”ప్రివెన్షన్‌ ఆఫ్‌ డిసెబుల్‌ యాక్ట్‌” ప్రకారం ఆమెపై చర్యలు తీసుకోవాలని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి ఇటీవల జరిగిన శాసనమండలి సమా వేశాల్లో డిమాండ్‌ చేశారు. అత్యున్నత హోదాలో ఉన్న వ్యక్తులు సమాజానికి ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే సమాజం వారిని అనుసరిస్తుంది. వారి అడుగుల్లో అడుగులేస్తుంది. వారు తప్పటడుగేస్తే సమాజంపై తీవ్ర మైన ప్రభావం చూపుతుంది. వ్యక్తిగత జీవితంలో ఎలాం టి అభిప్రాయాలున్నా, వృత్తి జీవితంలో రాజ్యాం గానికి లోబడి, నిబద్దతగా పని చేయాల్సిన అవసరముంది.
– ఊరగొండ మల్లేశం