వైఫల్యం ఎవరిది?

Whose failure?– అల్లు అర్జున్‌ అరెస్టు తీరుపై కేటీఆర్‌ ఖండన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద ఈ నెల 4న జరిగిన తొక్కిసలాట ఘటనలో బాధ్యులెవరని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. సినీ నటుడు అల్లు అర్జున్‌ ను అరెస్టు చేసిన తీరును ఆయన ఖండించారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్‌ వేదికగా ఆయన స్పందించారు. ”జాతీయ అవార్డు పొందిన ఒక నటుడిని అరెస్టు చేసిన తీరు పాలకుల అభద్రతా భావానికి నిదర్శనం. తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబానికి నా సానుభూతి ఎప్పుడూ ఉంటుంది. కానీ, ఈ ఘటనలో విఫలమైంది ఎవరు? అల్లు అర్జున్‌ను సాధారణ నేరస్థుడిలా చూడటం సరికాదు. తొక్కిసలాట ఘటనకు ఆయన నేరుగా బాధ్యుడు కాదు. బన్ని అరెస్టు తీరును ఖండిస్తున్నా. తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్‌ బాధ్యుడని అరెస్టు చేశారు. ఇదే లాజిక్‌తో రేవంత్‌రెడ్డి కూడా అరెస్టు చేయాలి. హైడ్రా వల్ల ఇద్దరి మరణానికి రేవంత్‌ కారణమయ్యారు” అని ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. ”అభద్రతాభావం కలిగిన నాయకుడు తన చుట్టూ ఉన్న ప్రజలకు ఎల్లప్పుడూ వెన్నుపోటు పొడుస్తూనే ఉంటాడు” అని ఓ కొటేషన్‌ను కేటీఆర్‌ ఈ పోస్ట్‌తో పంచుకున్నారు.
సమయం ఇవ్వకుండా అరెస్ట్‌ చేసిన తీరు సరికాదు : కేంద్ర మంత్రి బండి సంజయ్
అల్లు అర్జున్‌ అరెస్ట్‌ తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ”జాతీయ అవార్డు గ్రహీత నటుడు అల్లు అర్జున్‌కు సమయం ఇవ్వకుండా నేరుగా తన బెడ్‌రూమ్‌ నుంచి తీసుకెళ్లడం అవమానకరం. భారతీయ సినిమాకు ప్రపంచ గుర్తింపు తెచ్చిన వ్యక్తిని అరెస్ట్‌ చేసిన తీరు సరికాదు. ఇది భారీ జనసందోహాన్ని నిర్వహించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాన్ని మాత్రమే నొక్కి చెబుతుంది. సరైన ఏర్పాట్లను నిర్వహించలేకపోవడమే నిజమైన వైఫల్యం” అని పేర్కొన్నారు. గోషామహల్‌ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్‌ తొక్కిసలాటకు పోలీస్‌ శాఖ వైఫల్యమే కారణమని విమర్శించారు. అల్లు అర్జున్‌కు గౌరవమివ్వాలే తప్ప నేరస్థునిగా పరిగణించవద్దని ఎక్స్‌ వేదికగా సూచించారు.