ఆ డెడ్‌ బాడీ ఎవరిది?

ఆ డెడ్‌ బాడీ ఎవరిది?నిఖిల్‌ సిద్ధార్థ్‌ నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. సుధీర్‌ వర్మ దర్శకుడు. ‘స్వామి రారా, కేశవ’ వంటి సూపర్‌ సక్సెస్‌ల తర్వాత నిఖిల్‌, సుధీర్‌ వర్మ కాంబోలో రూపొందుతున్న మూడవ చిత్రమిది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్‌, రెండు సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఇందులో రిషి అనే రేసర్‌ పాత్రలో హీరో నిఖిల్‌ కనిపించనున్నారు. తనకు లవ్‌ స్టోరీస్‌ ఉంటాయి. రుక్మిణి వసంతన్‌ని డబ్బు కోసం ప్రేమించి, పెళ్లి చేసుకుంటాడు. అలాగే దివ్యాంశ కౌశిక్‌తోనూ మరో ప్రేమ కథ ఉంటుంది. రిషికి అనుకోకుండా డబ్బు అవసరమవ్వడంతో మరో పని చేయడానికి ఒప్పుకుంటాడు. దీంతో అసలు గందరగోళం ప్రారంభమవుతుంది. ఓ చనిపోయిన వ్యక్తిని తరలించటానికి రిషి సిద్ధమైనప్పుడు ఏం జరుగుతుంది?, ఓ వైపు పోలీసులు, మరో వైపు గూండాలు అతన్ని వెంబడిస్తారు. చాలా సమస్యలు చుట్టుముడతాయి. అప్పుడు తన రేసింగ్‌ నైపుణ్యంతో వారి నుంచి రిషి ఎలా బయటపడ్డాడు?, ఇంతకీ రిషి ఎవరి డెడ్‌ బాడీని తరలించాలని అనుకున్నాడు?; అజరు, జాన్‌ విజరు.. రిషిని వెంబడించటానికి ఏ పరికరాన్ని వాడుతుంటారు? అనే విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే అన్నట్టుగా ట్రైలర్‌ ఉందని చిత్ర యూనిట్‌ తెలిపింది. యాక్షన్‌, రొమాన్స్‌, ఫన్‌ వంటి అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 8న రిలీజ్‌ అవుతుంది. బాపినీడు.బి సమర్పణలో శ్రీ వెకంటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి సంస్థపై నిర్మాత బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ దీన్ని నిర్మించారు.