ఆమె నా దేహాన్ని తన భాషలోకి తర్జుమా చేస్తున్నది
ఆమె అనువాదానికి నాలోని ఎడారులు పచ్చని అడవులుగా మారుతున్నపుడు
మనసు మాటలతో వ్యక్తీకరించలేని నిస్సహాయతలో
నా అస్తిత్వంపై ఆమెదే అధికారమైనపుడు
అవ్యక్తమవుతున్న అనుభూతిలోని వెచ్చదనం ఎవరిదని అన్వేషిస్తే
నా నీడలా వెన్నంటి వుండే ఆమెదే కదా!
ఇక నుండి, ఈ భౌతిక ప్రపంచం నన్ను ఆమె నీడగానే చూస్తుందేమో?
నా ఊరు, పేరు, వంశం ఆమె తర్జుమాలో కరిగి జీవం పోసుకుంటున్నప్పుడు
క్షేత్రం ఆమెదే, పంట ఆమెదే !
ఐనా విచిత్రం ఏమిటంటే – ప్రపంచం విత్తనాన్నే గుర్తిస్తున్నది ఎందుకో?!
– డా|| రూప్ కుమార్ డబ్బీకార్, 91778 57389