జీఎస్‌డీపీ పెరిగితే 80 లక్షల రేషన్‌ కార్డులు ఎందుకున్నట్టు?

– ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గత పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో జీఎస్డీపీ పెరిగితే రాష్ట్రంలో 80 లక్షల మందికి రేషన్‌ కార్డులు ఎందుకున్నట్టు? అని పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న ప్రశ్నించారు. శనివారం శాసనమండలిలో రాష్ట్ర బడ్జెట్‌ పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ సర్కారు పదేండ్లుగా నిర్లక్ష్యం కారణంగానే విద్యా ప్రమాణాల్లో 36 రాష్ట్రాలకుగానూ తెలంగాణ 35వ స్థానానికి దిగజారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీచైతన్య, నారాయణ లాంటి కార్పొరేట్‌ విద్యా సంస్థలతో అంటకాగిన బీఆర్‌ఎస్‌ పేదవర్గాలను విద్యకు దూరం చేసిందని ఆక్షేపించారు. వ్యవ సాయాన్ని పట్టించుకోనందుకే పదేండ్లలో ఎన్‌సీఆర్‌బీ ప్రకారం రాష్ట్రంలో 7,800 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. 60 ఏండ్లలో జరగనంత విధ్వంసం బీఆర్‌ఎస్‌ పదేండ్ల పాలనలో జరిగిందని చెప్పారు.
బీసీలు అంటరానివారా?
కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో బీసీలకు కేవలం రూ.9,200 కోట్లు కేటాయించడంపై తీన్మార్‌ మల్లన్న అసంతృప్తి వ్యక్తం చేశారు. జనాభాలో సగ భాగమున్న బీసీలకు ఇంత తక్కువ కేటాయింపులు చేయడంపై ఆ వర్గాల్లో తాము అంటరానివారమా? అనే బాధ వ్యక్తమవుతున్నదని చెప్పారు. ఆ వర్గాలకు కేటాయింపులను పెంచాలని డిమాండ్‌ చేశారు.
ఆర్‌టీఈని అమలు చేయాలి
రాష్ట్రంలో రైట్‌ టు ఎడ్యుకేషన్‌ యాక్ట్‌ (ఆర్‌టీఈ)ని అమలు చేయాలని కోరారు. పదేండ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దీని అమలును విస్మరించిందని తెలి పారు. ఈ చట్టం అమలుకు కేంద్రం 60 శాతం నిధులు, రాష్ట్రం 40 శాతం నిధులు కేటాయించాల్సి ఉందని చెప్పారు. ఈ చట్టం అమలైతే కార్పొరేట్‌, ప్రయివేటు విద్యాసంస్థల్లో పేద వర్గాలకు 25 శాతం సీట్లు లభిస్తాయని చెప్పారు.