పైకి ఎదగడానికి ఏ మాత్రం వీలులేని కుటుంబంలో పుట్టి, ఏ అవకాశమూ లేని సామాజిక పరిస్థితుల్లో పెరిగి, అస్పృశ్యుడిగా అవమానాల పాలవుతూ కూడా నిబ్బరంగా ఉంటూ, ఆత్మవిశ్వాసంతో, మొక్కవోని దీక్షతో ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూ విశ్వమానవుడిగా ఎదిగినవారు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆ కాలంలో అన్ని పుస్తకాలు చదివి, అన్ని డిగ్రీలు సంపాదించి అత్యున్నత స్థాయికి చేరిన మేధావి ఆయన! మరి, మనుస్మృతి లాంటి గ్రంధాన్ని బహిరంగంగా, బాహాటంగా, ధైర్యంగా ఎందుకు తగులబెట్టారూ? అలా తగులబెట్టాల్సిన ప్రమాదకరమైన విషయాలు, సమాజానికి హాని కలి గించే విషయాలు అందులో ఏమున్నాయి? – అని పరిశీలిస్తే… ఉన్నాయి! ఈ అత్యాధునిక వైజ్ఞానిక సమాజాన్ని వెనక్కి నడిపించే చెత్తంతా అందులో ఉంది. అంబేద్కర్ ఆ గ్రంథాన్ని తిరస్కరించడంలో న్యాయముంది. మనువాద భావజాలాన్ని వదులుకోవాల్సి ఉందన్న సందేశం ఈ దేశ ప్రజలకు ఇవ్వడం కోసం ఆయన అలా ఆ గ్రంథాన్ని తగలబెట్టి చూపించారు. అయినా, సమా జంలో రావల్సినంత మార్పు రాలేదు. అణగారిన వర్గాలకు చెందిన వారే మూర్ఖంగా మనువాద భావజాలంలో కొట్టుకు పోతున్నారు. వైదిక ధర్మ ప్రభోదాలకు ప్రభావితులై, వాటిని పాటిస్తూ తాము అగ్రవర్ణాల వారి స్థాయికి చేరుకున్నామని సంతృప్తి పడుతున్నారు. కానీ అది అర్థం లేనిది. ఏ వర్గం వారైనా, ఏ వర్ణం వారైనా తమ తమ స్థాయి భేదాల్ని వదులు కుని, అందరం మనుషులమేనని గుర్తించుకున్న నాడే మాన వత్వం పరిమళిస్తుంది. ఆధునిక జన్యుశాస్త్ర సారాంశం గ్రహించిననాడే మానవవాదం బలపడుతుంది. మనుస్మృతిని అంతా ఇక్కడ పరిచయం చేయబోవడం లేదుగానీ, మాన వీయ విలువలకు విఘాతం కలిగించే అంశాలు ఏమేము న్నాయో కొన్నిటిని విశ్లేషించుకుందాం! మతిలేని సూక్తులు ఆ గ్రంథంలో ఇంతగా ఉన్నాయా? అని ఆశ్చర్యపోవాల్సి వచ్చినా.. ఏ మాత్రం ఆశ్చర్యపోవద్దు. డా. బి.ఆర్. అంబేద్కర్‌ను అనుసరిస్తే చాలు!!
బ్రాహ్మణుడు మూడు రోజులు పాలు అమ్మితే గనక, అతను శూద్రుడయిపోతాడు (మనుస్మృతి 10/92) అంటే పాల వ్యాపారం చేసేవారు ఎవరైనా బ్రాహ్మణుల దృష్టిలో శూద్రులే- యజ్ఞంలో కొడుకును బలి ఇచ్చినా బ్రాహ్మణుడు బ్రాహ్మణుడి గానే ఉంటాడు (మనుస్మృతి 10/105) బ్రాహ్మ ణుడు కుక్క మాంసం భుజించినా బ్రాహ్మణుడిగానే ఉంటాడు (మనుస్మృతి 10/106-10/108) ఇతరులు గనక ఏ మాంస భక్షణ చేసినా పతితులైపోతారు. ఇదేం న్యాయం? ఇక మను స్మృతి 10వ అధ్యాయంలోని 95 నుండి 98 వరకు నాలుగు శ్లోకాల సారాంశమేమంటే- బ్రాహ్మణ వర్గానికి చెందని తక్కువస్థాయి వ్యక్తులెవరూ బ్రాహ్మణులు చేసే పనులు చేయ గూడదు. పైనున్న బ్రాహ్మణ వర్గం వారు మాత్రం అవసరమై నప్పుడు జీవిక కోసం తక్కువ స్థాయి వారి పనులు చేసుకో వచ్చు. ఆ విధంగా కొంచెం నిలదొక్కుకున్న తర్వాత మళ్ళీ వారు, వారి కులవృత్తిని స్వీకరించవచ్చు. ఇలాంటి అవకాశం కింది కులాల వారికి లేదు. అంటే బ్రాహ్మణులు బతకడానికి నిమ్న వర్గాల వారి వృత్తులు చేసుకోవచ్చు. నిన్ను వర్గాల వారి బతుకుదెరువు మీద దాడి చెయ్యొచ్చు. వారికి పుట్టగతులు లేకుండా చేసే అధికారం బ్రాహ్మణులకు ఉంది. కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ నిమ్న వర్గాలవారు పై వర్గం వారి కులవృత్తిని దెబ్బ తీయకూడదు. తమ వర్గం వారికి అనుగుణంగా మనుస్మృతి రాసుకుని, దాన్ని బలవంతంగా జనం మీద రుద్దారు అని అనడానికి ఇంత కన్నా ఏ సాక్ష్యాలు కావాలి? ఇందులో ఏ న్యాయముంది? ఏ మానవీయ విలువలున్నాయి.
లోకంలో ఉన్న వాస్తవానికీ మనుధర్మ శాస్త్రం లో వారు రాసుకున్నది పూర్తి వ్యతిరేకం. పూజలు, వ్రతాలు, యాగాలు, కర్మకాండలు వగైరా చేసి భూరి సంభావనలు స్వీకరించి, సంపాదించుకున్నది వారి స్వంత ఆస్థి అని భ్రమపడుతున్నారు పాపం! బ్రాహ్మణార్యులకు ఉన్న బ్రహ్మ జ్ఞానమేమిటో వివరంగా చెప్పుకుంటే బావుండేది.
ఉత్పత్తి రేప విప్రస్య మూర్తిర్ధర్మస్య శాశ్వతీ,
సహి ధర్మార్ధముత్పన్నో బ్రహ్మభూయాయ కల్పతే. 98
బ్రాహ్మణో జాయమానో హి పృథివ్యామధి జాయతే,
ఈశ్వరస్సర్వ భూతానాం ధర్మకోశస్య గుప్తయే. 99
సర్వం స్వం బ్రాహ్మణ స్యేదం యత్కించి జ్జగతీగతం!
శ్రేష్ఠ్యే నాభిజనేనేదం సర్వం వై బ్రాహ్మణోర్హతి. 100
ఈ సృష్టి యందు ప్రాణులు గొప్పవి. ప్రాణుల యందు బుద్ది వల్ల జీవించు జీవులు గొప్పవి. ఆ జీవుల యందు మాన వులు మిక్కిలి గొప్పవారు. వారిలో బ్రాహ్మణులు గొప్పవారు. ఆ బ్రాహ్మణులలో విద్వాంసులు శ్రేష్ఠులు. ఆ విద్వాంసుల యందు యుక్తాయుక్త విచక్షణ కలవారు శ్రేష్టులు. కాగా వారి కంటె బ్రహ్మ జ్ఞానము కలవారు మిక్కిలి గొప్పవారు. ఈ బ్రాహ్మణుడు ధర్మ రక్షణకై పుట్టినాడు. ధర్మాన్ని ఆచరిస్తు న్నందు వల్లనే అతడు బ్రహ్మత్వాన్ని పొందుతున్నాడు. అతడు సర్వశ్రేష్ఠుడు. అందరకు సమీపస్థుడు కావున, ఈ ప్రపంచ మంతయు అతని సొత్తుగానే పరిగణింపబడుచున్నది.
పై శ్లోకాలకు తాత్పర్యం అలా ఉంటే, అందులో మను షులందరిలో బ్రాహ్మణుడు ఎందుకు శ్రేష్ఠుడయ్యాడో వివరణ లేదు. ఇక్కడ ధర్మ రక్షణ అంటే- తమ పూట తాము గడుపు కోవడమేనని అర్థం చేసుకోవాలి! వారు కష్టపడిందీ లేదు. ఇతరులకు సహాయపడింది లేదు. సామాజిక కార్యాచరణ లోగడ ఏమీ లేదు. ఇప్పుడూ లేదు. భవిష్యత్తులోనూ ఉండదు. పూజలు చేయకపోతే అరిష్టం అని బ్లాక్‌మెయిల్ చేసి, భయ పెట్టి సొమ్ము లాగేసుకోవడం తప్ప మరొకటి లేదు కదా? అది అక్రమార్జన అవుతుంది తప్ప సక్రమార్జన కాదు. ఈ దేశం మూఢనమ్మకాల్లో కూరుకుపోవడానికి వీళ్ళే ముఖ్య కారణం! వీరితో పాటు అన్ని మతాల మత బోధకులు కూడా కారణం!!
స్వమేవ బ్రాహ్మణో భుజ్త్కే స్వం వస్తే స్వం దదాతి చ,
ఆనృశంస్యాద్బ్రాహణస్య భుంజతే హీతరే జనా: 101
బ్రాహ్మణుడు తన సొత్తును తానే అనుభవించుచున్నాడు. తన వస్త్రమును తానే ధరించుచున్నాడు. తన వస్తువులనే దానము చేయుచున్నాడు పైగా అతని దయాదాక్షిణ్యముల వలన ఇతరులు బ్రాహ్మణుని సొత్తుననుభవించుచున్నారు.
ఈ శ్లోకాన్ని, దాని తాత్పర్యాన్ని అర్థం చేసుకుని, కొంచెం ఇంగిత జ్ఞానంతో ఆలోచిస్తే విషయం బోధపడుతుంది. సరే- ఇంగిత జ్ఞానమంటే ఏమిటీ? అని అడిగే వారే ప్రస్తుతం అధి కారంలో ఉన్నారు. అందుకే కదా జనాన్ని ఆలోచింప జేయడా నికి ఈ ప్రయత్నం?
శ్రమజీవుల్ని అదిరించి, బెదిరించి సంపాదించిన సొత్తు శతాబ్దాలుగా అన్యాయంగా అనుభవిస్తున్నారన్నది వాస్తవం. వారు తినే తిండి వారు పండించుకున్నది కాదు. వారు కట్టు కునే గుడ్డ వారు నేసుకున్నది లేదు. కాళ్ళకు వేసుకునే చెప్పులు వారు కుట్టుకున్నవి కావు. మాసిన గుడ్డలు వారు ఉతుక్కున్నది లేదు. వారు వాడుకునే ఏ వస్తువూ వారు తయారు చేసుకు న్నది కాదు. ఒళ్లు వంచింది లేదు. చమట కార్చిందీ లేదు. అప్పనంగా వచ్చింది కూర్చుని ఆరగించడం తప్ప, శ్రమ శక్తి విలువ ఏమిటో వారికేమి తెలుసూ? యదార్థం ఆలోచిస్తే, దానాలు వీరు స్వీకరించడమే గానీ, మరొకరికి వీరిచ్చిం దెపుడూ? ఒకసారి గతాన్ని నెమరు వేసుకుని చూడండి.
తోటి మనుషుల పట్ల మనువాదుల అభిప్రాయాలు, ఆలోచనలు ఎంత నీచంగా ఉంటాయో గమనించండి-
పంది వాసన చూచుట చేతను, కోడి రెక్కల గాలి చేతను, కుక్క చూపు పడుట వలనను, శూద్రుడు తాకుట చేతను పదార్థములు అపరిశుద్ధమగును (మనుస్మృతి 3-24) ఇది ఒప్పుకోదగ్గదేనా?
అసలైన పరిణామవాదం మనుధర్మ శాస్త్రంలో ఉంది చూస్కోండి ! ఒకటవ అధ్యాయం 9-12 శ్లోకాలలోనే అంతా ఉంది.
బ్రహ్మ అండం నుండి పుట్టాడు. పుట్టి ఆ అండాన్ని తనే స్వయంగా రెండుగా విడగొట్టాడు. ఆ రెండు భాగాల నుండి ఇంకా ఏమేమి సృష్టించాడో 13వ శ్లోకంలో ఉంది. ఆ పద మూడవ శ్లోకం ప్రకారం ఆకాశం, పృథ్వి, ఆ రెండింటి మధ్య స్వర్గం ఏర్పరిచాడు. ఇంకా వాటి వెంట ఎనిమిది దిక్కులు, ఎనిమిది సముద్ర జలాలు సృష్టించాడు. ఇంత అత్యద్భుతమైన పరిణామ సిద్ధాంతం మనకు మనువాదులు ఇస్తే, దాన్ని గుర్తించకుండా అనవసరంగా డార్విన్ జీవపరిణామ సిద్ధాం తం వెనక పడ్డారెందుకూ? పాపం! ఈ ప్రస్థుత ప్రభుత్వాన్ని మనం అనవసరంగా ఆడిపోసుకుంటున్నామా? ప్రపంచం ఆమోదించిన డార్విన్ సిద్ధాంతం పాఠ్య గ్రంథాల్లోంచి తీసేసి భావిభారత పౌరుల జీవితాల్లో చీకటి నింపకండని అనవ సరంగా గగ్గోలు పెడుతున్నామా? ఒక్కసారి ఇంగిత జ్ఞానంతో ఆలోచిస్తే ఎవరి జవాబు వారికే లభిస్తుంది. మనమేమంటు న్నామనీ? ప్రభుత్వం వారు అతిగా స్పందిస్తున్నారూ? ఉన్నది ఉన్నట్టుగా చెప్పి, ఆలోచించుకునే స్వేచ్ఛ జనానికి ఇవ్వండని అంటున్నాం! అంతే- కల్లబొల్లి కబుర్లు చెప్పి జనాన్ని మభ్య పెట్టకండని అంటున్నాం. అయినా జనం గతంలో లాగా అమాయకత్వంలో ఏమీ కూరుకుపోలేదు. వారు తెలుసుకుం టున్నారు. ఆలోచిస్తున్నారు. విశ్లేషించుకుంటున్నారు. వాస్త వాల వైపు, నిజాల వైపు ఆకర్షితులవుతున్నారు. అలాంటి ఆరోగ్యకరమైన పరిణామాన్ని మనం ఆహ్వానించాలి!
ఈ ఆధునిక వైజ్ఞానిక యుగానికి సరిపడే విధంగా మను షుల ఆలోచనా ధోరణిలో మార్పు రావాలన్న తపన తప్ప, మనుస్మృతి పేరుతో ఒక వర్గం వారిని ఉద్దేశించి, వారిని ఎద్దే వా చేయడానికి రాస్తున్నది కాదు. ఇందులోని అమానవీయ మైన విషయాలని మన రాజ్యాంగం, కోర్టులు ఒప్పు కుంటాయా అన్న ఆవేదన ఆందోళన తప్ప ఎవరినో తక్కువ చేసి చూపడానికి కాదు! గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దే బాధ్యత ఈ దేశ పౌరులందరిది- అని గుర్తు చేయడం కోసమే ఈ విషయాల్ని ఇక్కడ సమీక్షించడం జరిగింది. శతాబ్దాలుగా ద్వేషం పెంచి పోషించి, మనుషుల్ని విభజిం చింది చాలదా? ఇకనైనా దృక్పధాలు మార్చుకోవాల్సిన అవసరం లేదా ?
”నువ్వు ఆనందకరమైన జీవితం గడపాలనుకుంటే, దాన్ని వ్యక్తులతోనో లేక వస్తువులతోనో గాక, ఒక లక్ష్యంతో ముడి పెట్టుకో” – ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్త, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్.
– కేంద్ర సాహిత్ర అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త.
డాక్టర్ దేవరాజు మహారాజు