బ్రిడ్జి ఎందుకు కుంగింది..?

నవతెలంగాణ-మహదేవ్‌పూర్‌
– మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన కేంద్ర జలవనరుల బృందం
– పోలీసులతో భారీ బందోబస్తు
– బ్యారేజీ వద్ద 144 సెక్షన్‌

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిన నేపథ్యంలో మంగళవారం నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ బృందం అనీల్‌ జైన్‌ ఆధ్వర్యంలో బ్యారేజీని పరిశీలించింది. ఆరో బ్లాక్‌ నుంచి ఏడవ బ్లాక్‌ వరకు నిషితంగా పరిశీలించి బ్యారేజి పరిస్థితిని అంచనా వేసి కేంద్రజల జలవనరుల శాఖకు నివేదిక అందించనుంది. ఆరుగురు సభ్యుల బృందం డామేజ్‌ అయిన ప్రాంతానికి పరిశీలించి ఎక్కడెక్కడ పిల్లర్లు కుంగాయి, అనే దానిపై క్షుణ్ణంగా పరిశీలించారు. ఉదయం 11 గంటలకు బ్యారేజీ వద్దకు చేరుకున్న కేంద్ర బృందం దాదాపు రెండు గంటల పాటు వంతెన కుంగిన ప్రాంతాన్ని, బ్యారేజి పగుళ్లు ఏర్పడిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది. 20వ పిల్లర్‌ వద్ద నిచ్చెన సాయంతో కిందకు దిగి దెబ్బతిన్న ప్రాంతాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి కొలతలు తీసుకున్నారు. శనివారం రాత్రి ఏం జరిగిందన్నది ప్రాజెక్టు అధికారు లను అడిగి తెలుసుకున్నారు. పరిశీలన పూర్తయిన అనంతరం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వెనుదిరిగారు. దీనికి సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో కేంద్ర జలశక్తి శాఖకు నివేదికను అందించనున్నట్టు సమాచారం. కాగా మేడిగడ్డ వద్ద 144 సెక్షన్‌ అమలు చేయడంతో కేవలం అధికారులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. కేంద్ర బృందం వెంట కాళేశ్వరం ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు, ఎల్‌అండ్‌టీ ప్రతినిధులు ఉన్నారు.