ఎందుకు ఆపారు?

Why did you stop?– బిల్లుల నిలుపుదలకు కారణాలు చెప్పండి
– తమిళనాడు, కేరళ గవర్నర్లకు సుప్రీంకోర్టు ఆదేశం
– శాసనసభలో మీరూ భాగస్వాములేనని న్యాయస్థానం వ్యాఖ్య
రాష్ట్ర అసెంబ్లీ తీర్మానించిన బిల్లులకు ఆమోదం తెలపకుండా మూడేండ్లుగా ఏం చేస్తున్నారని తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అలాగే అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై జరుగుతున్న జాప్యానికి కారణాలు వివరించాలని కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ను ఆదేశించింది. శాసనసభ ఆమోదం తెలిపిన బిల్లులను ఉద్దేశపూర్వకంగానే గవర్నర్లు ఆమోదించకుండా జాప్యం చేస్తున్నారని తమిళనాడు, కేరళ, పంజాబ్‌ ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. వీటిలో తమిళనాడు, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది.
నవతెలంగాణ- న్యూఢిల్లీ బ్యూరో
తమిళనాడుకు సంబంధించి ”మిస్టర్‌ అటార్నీ.. నవంబర్‌ 13న ఈ బిల్లులను గవర్నర్‌ డిస్పోజ్‌ చేశారు. నవంబర్‌ 10న ఇచ్చిన ఆర్డర్‌ వల్లే ఆమోదించారనే మా ఆందోళన. 2020 జనవరి నుంచి ఈ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మూడేండ్లుగా గవర్నర్‌ ఏం చేస్తున్నారు? ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించే వరకు గవర్నర్‌ ఎందుకు వేచి ఉండాలి?” అని అటార్నీ జనరల్‌ (ఏజీ) ఆర్‌. వెంకటరమణిని సీజేఐ డీవై చంద్రచూడ్‌ ప్రశ్నించారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో వైస్‌ ఛాన్సలర్ల నియామకానికి సంబంధించి గవర్నర్‌ అధికారాలను ఉపసంహరించుకునే బిల్లులకు సంబంధించినవి మాత్రమే వివాదం అని, ఇది ఒక ముఖ్యమైన అంశం కాబట్టి, కొంత పునరాలోచన అవసరమని ఏజీ ఆర్‌. వెంకటరమణి తెలిపారు. అయితే, పెండింగ్‌లో ఉన్న బిల్లులు మూడేండ్లు కిందటవని, జనవరి 2020లో గవర్నర్‌కు పంపించారని ధర్మాసనం పేర్కొంది. ఈ క్రమంలో, ధర్మాసనం పది బిల్లులను గవర్నర్‌ కార్యాలయానికి పంపిన తేదీలను రికార్డ్‌ చేసింది. అవి 2020 నుంచి 2023 వరకు ఉన్నాయనీ, ప్రస్తుత గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి నవంబర్‌ 2021లో మాత్రమే పదవీ బాధ్యతలు స్వీకరించారని ఏజీ అన్నారు. ఇది ఏ గవర్నర్‌ ప్రవర్తనకు సంబంధించినది కాదని, సాధారణంగా గవర్నర్‌ కార్యాలయానికి సంబంధించినదని ధర్మాసనం పేర్కొంది. ‘గవర్నర్‌ ఆలస్యం చేశారా లేదా అనేది సమస్య కాదు. సాధారణంగా రాజ్యాంగ విధులను అమలు చేయడంలో ఆలస్యం జరిగిందా? అనేది’ అని ధర్మాసనం పేర్కొంది.
గవర్నర్‌ ఆమోదాన్ని నిలుపుదల చేస్తున్నట్టు చెప్పగలరా?
విచారణ సందర్భంగా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 200 ప్రకారం బిల్లులకు సంబంధించి గవర్నర్‌కు ఉన్న అధికారాలను కూడా ధర్మాసనం పరిశీలించింది. ‘ఆర్టికల్‌ 200 ప్రకారం గవర్నర్‌కు మూడే ఆప్షన్స్‌ ఉంటాయని, ఆయన వద్దకు పంపిన బిల్లులకు ఆమోదం తెలపడం, సమ్మతి తెలపకపోవడం, రాష్ట్రపతికి పంపడం అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. నిబంధన ప్రకారం గవర్నర్‌ పున్ణపరిశీలన కోసం బిల్లుల్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపవచ్చు అని కోర్టు చెప్పింది. అయితే, గవర్నర్‌ ఆమోదాన్ని నిలుపుదల చేస్తున్నట్టు చెప్పగలరా? అనేది తమ ప్రశ్న అని సీజేఐ అన్నారు. వీలైనంత త్వరగా బిల్లును గవర్నర్‌ వాపసు చేయాల్సి ఉంటుందని, లేకుంటే అది రాజ్యాంగ నిబంధనలను అపహాస్యం చేయడమేనని సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ అన్నారు. గవర్నర్‌కు ‘పాకెట్‌ వీటో’ను ఊహించాలా? అతనికి పాకెట్‌ వీటో ఉందా?” అని ప్రశ్నించారు. తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌ రవి అసెంబ్లీ ఆమోదం పొంది మూడేండ్లుగా గవర్నర్‌ ఆమోద ముద్ర కోసం పంపించిన బిల్లుల్ని వెనక్కి పంపారు. ప్రభుత్వం అసెంబ్లీని మళ్లీ శనివారం సమావేశపరిచి పది బిల్లుల్ని ఆమోదించింది. వాటిని ఆమోదం కోసం గవర్నర్‌కి పంపింది. కోర్టు ఈ పరిణామాలన్నీ గమనిస్తోంది. అసెంబ్లీ మళ్లీ బిల్లులను ఆమోదించి గవర్నర్‌కు పంపింది. గవర్నర్‌ ఏం చేస్తారో చూద్దాం అంటూ తదుపరి విచారణను డిసెంబరు 1కి వాయిదా వేసింది.

కేరళ గవర్నర్‌కు, కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్‌
అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై జరుగుతున్న జాప్యానికి కారణాలు వివరించాలని అత్యున్నత న్యాయస్థానం కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ను ఆదేశించింది. గవర్నర్‌ ఉద్దేశపూర్వకంగానే నిలుపుదల చేస్తున్నారనీ, త్వరితగతిన బిల్లులను ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ సందర్భంగా కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌, ఆయన కార్యాలయంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కేరళ ప్రభుత్వం తరపున మాజీ అటార్నీ జనరల్‌, సీనియర్‌ న్యాయవాది కేకే వేణుగోపాల్‌ వాదనలు వినిపిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 168 ప్రకారం గవర్నర్లు శాసనసభలో భాగమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, కానీ శాసనసభలో భాగమని గవర్నర్‌ అర్థం చేసుకోలేకపోతున్నారని అన్నారు. అందుకు సంబంధించిన వివరాలను సుప్రీం ధర్మాసనానికి సమర్పించారు. అసెంబ్లీ ఆమోదం తెలిపిన ఎనిమిది బిల్లులను గత 21 నెలలుగా గవర్నర్‌ ఆమోదించలేదని తెలిపారు. అంతేకాకుండా ఆ బిల్లుల్లో మూడు ఆర్డినెన్స్‌లు గవర్నర్‌ ప్రకటించినవని, అవి ఆ తరువాత శాసనసభ ఆమోదించిన బిల్లులుగా మార్చబడ్డాయని అన్నారు. దీనికి స్పందించిన ధర్మాసనం విచారణకు రావాలని అటార్నీ జనరల్‌ (ఏజీ) ఆర్‌. వెంకటరమణికి నోటీసులు జారీ చేసింది. లేదంటే సొలిసిటర్‌ జనరల్‌ (ఎస్జీ) తుషార్‌ మెహతానైనా రావాలంటూ విచారణను ఈనెల 24 నాటికి (శుక్రవారం) వాయిదా వేసింది.