ఎందుకీ వక్రీకరణలు?

ఎందుకీ వక్రీకరణలు?31 మార్చి 2024న తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (తానా) ‘ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో ”మన ప్రాచీన భారతీయ సాహిత్యం- ఆధునిక విశ్వవిజ్ఞాన శాస్త్ర వికాసానికి మూలం” అనే అంశంపై అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం జరిగింది. అందులో ఆ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్‌ ప్రసాద్‌ తోటకూర మాట్లాడుతూ కొన్ని వాస్తవాలను వక్రీకరించారు. అవి భారతదేశ ప్రతిష్టను ప్రపంచ దేశాల దృష్టిలో భంగపరిచేవిగా ఉన్నాయి కాబట్టి వాటిని ప్రస్తావించి వాస్తవాలను పాఠకుల ముందుంచే ప్రయత్నమే ఈ వ్యాసం ఉద్దేశం.
డాక్టర్‌ ప్రసాద్‌ వియత్నాం విప్లవీరుడూ, ఆ తరువాత దేశాధినేతా అయినా హోచిమిన్‌ గురించి మాట్లాడారు. అమెరికాను కూడా ఎదిరించి విజయాన్ని సాధించడానికి గల కారణాన్ని ఒక విలేకరి హోచిమిన్‌ను అడిగారట. దాని కాయన జవాబిస్తూ భారతదేశానికి చెందిన రాణా ప్రతాప్‌ అనే యోధుడే తమకు ఆదర్శమనీ, ఆయన స్ఫూర్తితోనే తాము యుద్ధం చేసి గెలిచామనీ అన్నారట. అంతేకాదు.. హోచిమిన్‌ సమాధిపై ”ఈయన మహారాణా ప్రతాప్‌ అభిమాని” అనే అర్థం వచ్చే వాక్యం రాయబడిందని కూడా డాక్టర్‌ ప్రసాద్‌ చెప్పారు. దాని వివరాలు పరిశీలిద్దాం.
హోచిమిన్‌, ”భారతదేశానికి చెందిన ఒక రాజు తమకు స్ఫూర్తి” అని ప్రకటిస్తే ఆనాటి భారత బూర్జువా మీడియా తాటికాయంత అక్షరాలతో ఆ విషయాన్ని ప్రకటించకుండా ఉంటుందా? హోచిమిన్‌ ఒక కమ్యూనిస్టు నాయకుడు. ఆయనకు ఆదర్శంగా జార్‌ చక్రవర్తి వంటి ఒక సామ్రాజ్యాధినేతను ఎదిరించి గెలిచిన లెనిన్‌ ఉండగా, చైనా నియంత చాంగ్‌- కై-షేక్‌ను ఎదిరించి గెలిచిన మావో సేటుంగ్‌ ఉండగా, ఒక రాజు తనకు ఆదర్శమని చెప్పాడనడం అసంబద్ధంగా లేదా?
ఇక హోచిమిన్‌ సమాధి ఫొటోను ఇంటర్‌నెట్‌లో పరిశీలిం చాను. దానిపై” ప్రెసిడెంట్‌ హోచిమిన్‌ ” అని మాత్రమే ఉంది. సమాధి పక్కనున్న బ్యానర్‌లో ”లాంగ్‌ లీవ్‌ ది సోషలిస్ట్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ వియత్నాం” అని ఉంది. ఈ విషయాన్ని నెట్‌లో కనుగొనడానికి అత్యున్నత విద్యాధికులైన ప్రసాద్‌ గారికి ఎక్కువ సమయం పట్టి ఉండేది కాదు. ఎవరో సృష్టించిన కట్టు కథను వారు వల్లించే వారు కాదు.
ఇక వేదాలల్లో సూర్యుడు ఒక గోళమని రాయబడిందనీ, భూమికీ, సూర్యుడికీ మధ్య దూరం కచ్చితంగా చెప్పబడిందనీ, వేదాల వ్యాఖ్యాత సాయణాచార్యులు కాంతి వేగాన్ని కచ్చితంగా ఆనాడే చెప్పాడనీ ప్రసాద్‌ గారు చెప్పారు. వేదాలు గ్రహాలను గూర్చీ, నక్షత్రాలను గూర్చీ మన పూర్వీకుల అజ్ఞానాన్ని తెలియజేస్తు న్నాయే కానీ మన వేద రుషుల విజ్ఞానాన్ని తెలియజేయడం లేదు. భూమిని గూర్చి వారేం చెప్పారో తెలుసుకుందాం.
1)”సకల భూతములకు సుఖములు కలిగించు ద్యావా పృధ్వులను (ఆకాశమును, భూమిని) భగవానుడు సృష్టించినాడు. ఆ రెంటినీ కదలకుండా మేకులతో బిగించిన భగవానుడు సర్వదేవతలందు శ్రేష్టుడు.(రుగ్వేదం, ఒకటవ మండలం, 160వ సూక్తం, నాల్గవ మంత్రం. అనువాదం: రంగాచార్య).
2)”ధ్రువాసి భూమీ!” అంటే” భూమీ! నీవు స్థిరత్వము కలదానవు”.(కృష్ణ యజుర్వేదము1-1-13-6).
3)” స్థిరము, విస్తారము అగు భూమికి నమః”( అధర్వవేదము,12-3-1-11).
అంటే వేదాలన్నింటిలోనూ భూమి స్థిరంగా, కదలకుండా ఉంటుందని చెప్పబడింది. అంతేకాని, భూమి గుండ్రంగా ఉంటుందని గానీ, దానికి భ్రమణం, పరిభ్రమణం ఉంటాయని గానీ చెప్పబడలేదు. భూమిని గూర్చే కనీస పరిజ్ఞానం లేని వేద రుషులకు సూర్యుని గూర్చీ, దానికీ, భూమికీ గల దూరాన్ని గూర్చీ, కాంతి వేగాన్ని గూర్చీ తెలుసునని చెప్పడం హాస్యాస్పదం కాదా?
ప్రసాద్‌ గారు మహాభారత కథలో కౌరవుల జననం టెస్టు ట్యూబ్‌ బేబీలను సృష్టించే సైన్స్‌ విజ్ఞానం మన పూర్వీకులకు వేల ఏండ్ల నాడే తెలుసునని రుజువు చేస్తున్నదన్నారు. అలాగే శివకుమార్‌ బాపూజీ తల్పడే అనే ఆయన 1895 లోనే బొంబాయి బీచ్‌లో విమానాన్ని మొట్ట మొదటిగా నడిపేడనీ, ఆ విమానాన్నీ, తల్పడే అభివృద్ధి చేసిన వైమానిక విజ్ఞానాన్నీ, ఆంగ్లేయులు స్వాధీనం చేసుకుని నాశనం చేశారనీ ఆ తరువాత ఎనిమిది ఏళ్లకు రైటు సోదరులు విమానాన్ని నడిపారనీ, కానీ వారే విమానాన్ని మొట్టమొదటిగా నడిపినట్లు తెల్లవారు ప్రచారం చేశారనీ ప్రసాద్‌ గారన్నారు.
డా.ప్రసాద్‌ గారికి తెలిసిన విషయం ఏమిటంటే, ఒక వైజ్ఞానిక విషయం కనుగొన బడాలంటే అంతకు ముందు దానికి సంబంధించిన అనేక వైజ్ఞానికాంశాలు శాస్త్రవేత్తలచే కనుగొన బడాలి. టెస్ట్‌ ట్యూబ్‌ బేబీని సృష్టించాలంటే మానవ శరీర శాస్త్రం, గైనకాలజీ లాంటి అనేక శాస్త్రాల విజ్ఞానం ఉండాలి. అలాగే విమానాన్ని నడపడానికి భౌతిక శాస్త్రం, ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ వంటి అనేక శాస్త్రాల విజ్ఞానం ఉండాలి. ఈ విజ్ఞానం మన పూర్వీకుల వద్ద ఉన్నట్లు గ్రంథాల ఆధారాలు, శాస్త్రీయ ఆధారాలు ఏమీ లేవు. కేవలం కథలు మాత్రమే ఉన్నాయి. మహాభారత కథను టెస్ట్‌ ట్యూబ్‌ బేబీల సష్టికి ఆధారంగా అంగీకరిస్తే, 1980లలో వచ్చిన ఆదిత్య 369 ఆధారంగా మన వారు 1980 లలోనే టైం మిషన్‌ను కనుగొన్నట్లు అంగీకరించాల్సి ఉంటుంది.
వాస్తవాలు ఇలా ఉండగా అత్యున్నత విద్యాధికులు కూడా కనీసం అంతర్జాలంలో పరిశీలించకుండా, అవాస్తవాలు ప్రచారం చేయడం వలన భారతదేశ ప్రతిష్ట ప్రపంచ మేధావుల దృష్టిలో నవ్వుల పాలవుతుంది. సుశ్రుతుడు, ఆర్యభట్ట, భాస్కర వంటి మన శాస్త్రజ్ఞుల గొప్ప దనాన్ని ప్రపంచానికి చాటుదాం.అంతేకానీ కొందరు స్వార్థపరులు పక్షపాత బుద్ధితో చేసే వాస్తవాల వక్రీకరణలను నిగ్గు తేల్చకుండా, వారి ప్రచారహోరులో కొట్టుకు పోకుండా ఉందాం. అదే నేటి అత్యున్నత విద్యావంతుల బాధ్యత. అంతేకాదు. మరో ముఖ్య విషయం.మహా శాస్త్రవేత్త ఆర్యభట్ట రాసిన ఖగోళ శాస్త్రం ”ఆర్యభటీయ” పూర్తి ప్రతి 1847 వరకు శాస్త్రవేత్తలకి ఎవరికీ దొరకలేదు. అప్పటి వరకు ఇతరులు ఆయనను సమర్థిస్తూ, వ్యతిరేకిస్తూ రాసిన అంశాలు మాత్రమే ఖగోళ శాస్త్రజ్ఞులకు అందుబాటులో ఉన్నాయి. పురాణ గ్రంథాల నకళ్లు తీసి కాపాడుకున్న పండితులు ఆర్యభటియ గ్రంథాన్ని ఎందుకు 1600 ఏండ్ల పాటు మరు గున ఉంచారో, ఆ కారణాన్ని వెలికితీయటం విద్యాధికులూ, పరిశోధకులూ చేయవలసిన మరో ఆవశ్యక విషయం. నిజాల నిగ్గుతేల్చి, వక్రీకరణ లను బట్టబయలు చేసి, భారతదేశ ప్రతిష్టను పెంచడమే దేశభక్తుల కర్తవ్యం.
కె.ఎల్‌. కాంతారావు
9490300449