– నాకే ఏడెనిమిది వందల ఎకరాల భూముంది
– కేసీఆర్ అంటే విశ్వాసం…బీఆర్‌ఎస్ అంటే భరోసా
– అధికారంలోకి మళ్లీ మా ప్రభుత్వమే
– కాళేశ్వరంపై కమిటీ రిపోర్టు..ఎలక్షన్స్ స్టంట్ : ప్రెస్‌క్లబ్ మీట్ ది ప్రెస్‌లో మంత్రి మల్లారెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘నేనెందుకు కబ్జాలు చేస్తా? నాకే ఏడెనిమిది వందల ఎకరాల భూముంది. కష్టపడి సంపాదించున్న. తెలంగాణలో జరిగిన అభివృద్ధితో నా ఆస్తుల విలువ అమాంతం పెరిగింది. కబ్జా చేసినట్టు నిరూపించండి. అది నిజమైతే నేనే దగ్గరుండి రిజిస్ట్రేషన్ చేయిస్తా. ఎవరిష్టమొచ్చినట్టు వారు మాట్లాతారు. దారిన పోయే దానయ్య చేసే ఆరోపణలు పట్టించుకోను’ అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ‘కిషన్‌రెడ్డి లేఖ రాశారంట..డ్యామ్ స్టేఫీ వాళ్లు వచ్చి కాళేశ్వరం అడుగుకుపోయిరంట…డ్యామ్ పనికిరాదని నివేదిక ఇచ్చిరంట..ఒక్కరోజులో ఇదంతా సాధ్యమా? బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కాళేశ్వరంపై కమిటీ రిపోర్టు ఇచ్చింది. ఇదంతా ఎన్నికల స్టంట్’ అని విమర్శించారు. కేసీఆర్ అంటే విశ్వాసమనీ, బీఆర్‌ఎస్ అంటే భరోసా అని చెప్పారు. మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని నొక్కి చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతున్నదనీ, అన్నింటిలోనూ నెంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పారు. 56 ఏండ్లు పాలించిన కాంగ్రెసోళ్లు కరెంటు ఇచ్చే అవకాశమున్నా ఇవ్వలేకపోయారనీ, సరిపోను నీళ్లున్నా ప్రజలకు అందించలేకపోయారని విమర్శించారు. వాళ్లకు పరిపాలించ చేత కాలేదన్నారు. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కుని సీట్లు అమ్ముకుంటున్నాడని కాంగ్రెస్ నేతలే ఆరోపిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. ఆలూలేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా కాంగ్రెసోళ్లు అప్పుడే తాము గెలిచి ఎమ్మెల్యేలు అయినట్టు భ్రమించి మంత్రి పదవుల కోసం కొట్లాడుకుంటున్నారని విమర్శించారు. కర్నాటకలో కాంగ్రెస్ గెలిచిందని జబ్బలు సరుసుకుంటే సరిపోదన్నారు. దేశమంతటా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే బీజేపీ గెలుస్తూ వస్తోందన్నారు. ప్రాంతీయ పార్టీలున్న చోట్ల బీజేపీ పప్పులు ఉండకట్లేదన్నారు. పాలనలో ప్రజలపై భారాలు మోపే విషయంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని విమర్శించారు. మోడీ పాలన మస్తు ఫిరమైపోయిందనీ, ధరలు పెంచుకుంటూ పోతే పేదలు ఎట్లా బతుకుతారని ప్రశ్నించారు. రాష్ట్ర సంపద పెంచుడు…పేదలకు పంచుడు ఒక్క కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. తాను ఎమ్మెల్యే అయ్యాకనే మేడ్చల్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతున్నదన్నారు. తాను విద్యాసంస్థలు, యూనివర్సిటీ పెట్టి దేశంలోనే ఎక్కడా లేని విధంగా 220 కోర్సుల్లో విద్య అందిస్తున్న ఘనత తనదన్నారు. 40వేలకు పైగా విద్యార్థులు తమ కళాశాల్లో ఇంజినీరింగ్ విద్య అభ్యసిస్తున్నారని చెప్పారు. తనకే డబ్బులు ఫుల్‌గా ఉన్నాయనీ, వేరేవాళ్ల ఆస్తులను కబ్జా చేయాల్సిన అవసరం తనకు లేదని కొట్టిపడేశారు. జవహర్‌నగర్‌లో 40 వేల మంది పేదలకు ఇండ్ల స్థలాల సమస్యను క్లియర్ చేసిన ఘనత తనదన్నారు. డంపింగ్ యార్డుతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే తట్టుకోలేక కేటీఆర్ వెంట పడి అక్కడ చెత్త ద్వారా విద్యుత్ తయారు చేసే ప్లాంట్ పెట్టించామన్నారు. 300 మంది కాదు..ఎంత మంది అయినా సరే తనపై పోటీ చేసే హక్కుందనీ, ప్రజలు తననే ఆశీర్వదిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు వేణుగోపాలనాయుడు, రవికాంత్‌రెడ్డి, గోపరాజు, తదితరులు పాల్గొన్నారు.