భార్యంటే చులకనెందుకు..?

Why do you care about your wife?భార్యాభర్తలు ఒకరి మాటను మరొకరు గౌరవించుకుంటేనే కుటుంబాన్ని సాఫీగా నడిపించడం సాధ్యం. అయితే కొన్ని కుటుంబాల్లో పరిస్థితులు దీనికి భిన్నంగా ఉంటున్నాయి. అందుకే అనేక సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా భర్తలు తమ భార్యల మాటలను పెద్దగా పట్టించుకోరు. ఆమేమో అతనే తన ప్రపంచంగా బతుకుతుంటుంది. అలాంటప్పుడు ఇక ఆ కుటుంబంలో ఎదురయ్యే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. అలాంటి ఓ సమస్యే ఈ వారం ఐద్వా అదాలత్‌లో…
సునీతకు 28 ఏండ్లు ఉంటాయి. రాహుల్‌తో పెండ్లి జరిగి ఐదేండ్లు అవుతుంది. వీరికి ఒక పాప ఉంది. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఆర్థికంగా ఇద్దరికీ ఎలాంటి ఇబ్బందీ లేదు. కుటుంబ పరంగా కూడా ఎలాంటి సమస్యలూ లేవు. అయితే సునీత మాటకు రాహుల్‌ అస్సలు విలువ ఇవ్వడు. ఏ విషయంలో కూడా ఆమెను లెక్కచేయడు. వాళ్ల కుటుంబ సభ్యుల ముందు, స్నేహితుల ముందు ఆమెను అవహేళనగా మాట్లాడుతుంటాడు. ఆమె ఏ విషయంలో అయినా సలహా ఇవ్వబోతుంటే ‘ఆమెకేం తెలుసని అడుగుతున్నారు’ అంటాడు. ఆమె చేసిన వంటకు కూడా కావాలని ఏదో విధంగా వంకలు పెడుతుంటాడు.
భర్త ఇలా ప్రతి విషయానికి తప్పుబడుతుంటే సునీతకు చులకనగా ఉండేది. ఇదంతా ఆమెకు చాలా ఇబ్బందిగా ఉండేది. దాంతో ‘నిజంగా నాకు ఏం తెలియదా? నేను చేస్తున్న ఉద్యోగానికైనా న్యాయం చేస్తున్నానా లేదా?’ అనే అనుమానం వచ్చేది. అయితే ఆఫీసులో ఆమెపై ఇప్పటి వరకు ఎవ్వరూ ఫిర్యాదులు చేయలేదు. పైగా సునీతకు ఏ పని ఇచ్చినా బాగా చేస్తుంది అనే పేరు కూడా ఉంది. అయితే పాపకు ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి. రాహుల్‌ మాటలు వింటుంది కాబట్టి పాప కూడా ‘నీకు ఏమీ తెలియదు. డాడీ ఎప్పుడూ ఇలా అంటారు కదా!’ అని అందరి ముందు అనేది. పైగా ‘సునీత నీకేం తెలియదు నువ్వు నోరుమూసుకో, ఎందుకు ప్రతి దాంట్లో తలదూరుస్తావు’ అంటూ వాళ్ళ నాన్నలాగే అనేది. దాంతో చివరకు పాప కూడా రాహుల్‌లా తయారవుతుందనే దిగులు పట్టుకుంది ఆమెకు.
సునీత ఇంట్లో పని చేస్తూ, ఉద్యోగం చేస్తూ రాహుల్‌ కంటే కాస్త ఎక్కువే సంపాదిస్తుంది. కనీసం ఒక మనిషికి ఇవ్వాల్సిన గౌరవం కూడా ఆమెకు ఇవ్వడం లేదు. ఇన్నేండ్ల నుండి అతనే తన ప్రపంచంగా బతికిన ఆమె ఇప్పుడు తన పరిస్థితికి తనే జాలి పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐద్వా అదాలత్‌కు వచ్చి ‘మేడమ్‌ ఒకప్పుడు నాపై నాకు నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు ఆ నమ్మకం మొత్తం పోతుంది. పైగా నాపై నాకే జాలేస్తుంది. ఇలాగే ఉంటే నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావడం లేదు’ అంటూ కన్నీరు పెట్టుకుంది.
ఆమె చెప్పింది మొత్తం విని రాహుల్‌ని పిలిపించి మాట్లాడితే ‘సునీత నాకంటే మంచి ఉద్యోగం చేస్తుంది. నా కంటే ఎక్కువ సంపాదిస్తుంది. నా కంటే ఆమెకు తెలివి ఎక్కువ. ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలో ఆమెకు బాగా తెలుసు. అందుకే మా కుటుంబ సభ్యులు, నా స్నేహితులు ఆమెను ప్రతి విషయంలో సలహాలు అడుగుతుంటారు. మా వాళ్లయితే నా కంటే ఎక్కువగా ఆమెనే ప్రేమగా చూసుకుంటారు. నేను కూడా సునీతను ‘నువ్వు చాలా తెలివైన దానివి, ఏ పని అయినా సులువుగా చేయగలవు’ అని అంటే నన్నెక్కడ తక్కువగా చూస్తుందో అని అందరి ముందు అలా హేళన చేసి మాట్లాడుతుంటాను.
నేనేమన్నా సునీత పెద్దగా పట్టించుకోదు. నాతో ప్రేమగానే ఉంటుంది. ఈ లోకంలో ఆమెకు నాకంటే ఏదీ ఎక్కువ కాదు. ఆమె అలాగే ఉండాలి. నేను ఆమెను అందరి ముందు మెచ్చుకోవడం ఆమెకు ఇష్టం. కానీ నేను ఎప్పుడూ ఆ పని చేయలేదు. సునీత చెప్పినట్లుగానే నేను ఎప్పుడూ ఆమెను గౌరవించలేదు. దానికి కారణం నాలో ఉన్న అభద్రతా భావమే. అయితే ఆమె అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఇంత చిన్న విషయానికి మీ వరకు వస్తుందని అనుకోలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.
అతని మాటలు విన్న తర్వాత ‘రాహుల్‌ మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. ఏ భార్యా తన భర్తను తక్కువ చేయాలని చూడదు. కానీ మీరు మీ ప్రవర్తనతో ఆమెపై ఆమెకున్న నమ్మకాన్ని చంపేస్తున్నారు. అలా భార్యను తక్కువ చేసి మాట్లాడడం సరైనది కాదు. పైగా మీ పాప ముందు కూడా అలాగే అంటున్నారు. దీని వల్ల తర్వాత కాలంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆమెకు మీరంటే ప్రాణమని మీరే చెబుతున్నారు. ఇక మీకెందుకు అంత అభద్రతా భావం. మీరు ప్రేమగా దగ్గరకు తీసుకుంటే ఆమె ఎప్పటికీ మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడదు. కనీసం ఇప్పడు కూడా ఆమె మీ గురించి మా దగ్గర తక్కువగా ఏమీ చెప్పలేదు. కేవలం తను పడుతున్న బాధను మాత్రమే చెప్పింది. భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఒకరిలో ఉన్న టాలెంట్‌ను మరొకరు గుర్తించి గొప్పగా చెప్పుకోవడంలో తప్పేంలేదు.
అనవసరంగా ఏవేవో ఊహించుకొని మంచి జీవితాన్ని పాడుచేసుకోవద్దు. మిమ్మల్ని ఎంతో ప్రేమించే భార్య దొరకడం మీ అదృష్టం. పైగా మీ ఇంట్లో వాళ్లందరినీ ఆమె ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. ఇక ఇంతకు మించి మీకేం కావాలి. సంతోషంగా ఉండాల్సింది పోయి మీ చేతులారా మీరే సమస్యలు తెచ్చిపెట్టుకుంటున్నారు. మీలోని అభద్రతా భావాన్ని పక్కనపెట్టి మీ భార్యను గౌరవించండి. అప్పుడు మీపై మీకు మరింత ప్రేమ కలుగుతుంది. మీ బంధువులు కూడా మిమ్మల్ని ఎంతో గౌరవిస్తారు’ అని చెప్పాము.
‘మీరు చెప్పింది నిజమే మేడం. అనవసరంగా నేనే ఏవేవో ఊహించుకొని ఇన్ని రోజులు ఇలా ప్రవర్తించాను. దీని వల్ల ఇద్దరం సంతోషంగా ఉన్నదీ లేదు. ఇప్పటి నుండి మీరు చెప్పినట్టే ఉంటాను. సునీతను ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటాను. ఆమెను చులకన చేసి మాట్లాడను. నేను చేసిన పొరపాటు ఏంటో నాకు తెలిసొచ్చింది. నా వల్ల నా భార్య ఎంత బాధపడుతుందో అర్థమయ్యేలా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు’ అని చెప్పి సునీతకు సారీ చెప్పి తీసుకెళ్లాడు.
– వై వరలక్ష్మి,
9948794051