ఆలసించకు యోచించకు
సహనాన్ని పరీక్షించకు
వెంటపడే మగనీడను
క్షమించి వదిలేయకు
అవి ఆపన్నహస్తాలని భ్రమించకు
ఎందాక పరిగెడతావ్?
ఎవరిని నమ్మి అడుగేస్తావ్?
అవి రాబందుల మూకలైతే
తృటిలోనే రెక్కలు తుంచెరు
అవి కామాంధుల చూపులైతే
తక్షణమే కండ్లు రక్కెరు
అనుమానం పొడవకముందే
దిక్కులన్నీ అన్వేషించెరు
నమ్మకాన్ని పరిచావో
అందులో నిన్ను చుట్టేస్తారు
ఆదమరిచి అడుగు వేసావో
ఆరడుగులు తోడేస్తారు
ఒళ్లంతా కండ్లు చేసుకో
మనసుకు పదును పెట్టుకో
కామం కండ్లు కదిపితే
నిలువునా నరికెరు
చేష్టల్లో చేర్పు కనిపిస్తే
అడ్డంగా చీరెరు
యువతి శక్తి పురివిప్పితే
యావత్తూ కంపిస్తుందని
పిడికిలి పట్టుకు ఊతమిస్తూ
కామ రక్కసుల గొంతు బిగించెరు
సుతిమెత్తని నీ అడుగుల్ని
పిడుగుపాటుగా మార్చెరు
తిరగబడు తెగబడు
ఉరుమై ధ్వనిస్తూ జ్వాలై ఎగస్తూ
వెంబడించే క్రూరత్వాన్ని
పాతాళానికి తొక్కిపడెరు
ఓ యువతీ
సున్నితత్వంలో శూరత్వం
సహనంలో ధీరత్వం
మెతకదనంలో కఠినత్వం
చూపుల్లో చురుకుదనం
కలబడేతత్వానికి
ఎగబడే ధైర్యాన్ని సంధించు
మహిళా శక్తికి సానబెట్టు
మౌనం సమంజసం కాదు
కామాసురులను తరగబట్టు
నిర్భయంగా సమాజంలో నిలబడు..
– నరెద్దుల రాజారెడ్డి
సెల్: 9666016636