ఈ తెలివి మనకెందుకు లేకపోయింది?!

Why don't we have this intelligence?!జర్మనీలో ఫిబ్రవరి 23న జరగనున్న ఆకస్మిక ఎన్నికల్లో ఛాన్సలర్‌ అభ్యర్థిగా తీవ్ర మతవాద జర్మనీ ప్రత్యామ్నాయపార్టీ ఎ.ఎఫ్‌.డి. నాయకురాలు ఆలిస్‌ వీడల్‌ను ఎన్నుకోడానికి జర్మనీ పట్టణం రీసాలో ఈ నెల 11న ఎ.ఎఫ్‌.డి. కీలక సమావేశం ఏర్పాటు చేసింది. తూర్పు జర్మనీ రాష్ట్రం సాక్సనిలోని రీసా ఎ.ఎఫ్‌.డి.కి బలమైన కేంద్రం. నాజీలకు చావులేదని నినదిస్తూ పన్నెండు వేల నిరసనకారులు రీసా చేరారు. రీసాదారులన్నిటిని ఉదయాన్నే అడ్డగించారు. మిరియాల పొడితో ప్రదర్శనకారులను చెదర గొట్టడానికి పోలీసులకు రెండుగంటలు పట్టింది. బహిష్కరణకు, దాడికి గురికాకుండా జీవించే హక్కు కోసం నిరసిస్తున్నామని, ఫాసిజానికి రీసా శాంతి స్థలం కాదని స్పష్టం చేశామని ప్రదర్శనకారుల ప్రతినిధి మరియ ష్మిత్‌ అన్నారు. ఆరువందల ప్రతినిధుల ఎ.ఎఫ్‌.డి.సభ ఆలస్యంగా మొదలైంది.వామపక్షాన్ని ధిక్కరించినం దుకు పార్టీ సభ్యులను వీడల్‌ అభినందించారు. ప్రజాస్వామ్య వ్యతిరేకులుగా, తీవ్రవాదులుగా ప్రవర్తించారని మరొక నాయకులు టినొ చ్రుపల్ల ప్రదర్శనకారులను నిందించారు.విదేశీ వలసదార్లను దేశం నుండి బహిష్కరించాలని రెండు రోజుల ఎ.ఎఫ్‌.డి. సభ తీర్మానించింది. పార్ట్టీ యువ విభాగం ‘జుంజే ప్రత్యామ్నాయం’ ఉగ్రవాద సంస్థగా మారిందని పార్టీ నిఘా విభాగం ఇచ్చిన సమాచారం ఆధారంగా దాని నాయకత్వాన్ని మార్చాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఇది తీవ్ర వివాదానికి దారితీసింది.యూరప్‌ యూనియన్‌ కరెన్సి యూరోను వదిలేయాలని, జర్మని అణుశక్తి దేశంగా పున: ప్రవేశించాలని ముసాయిదా ప్రణాళిక పేర్కొంది.
ఎన్నికల్లో వీడల్నెగ్గే అవకాశం లేదని అమెరికా వాణిజ్య శతకోటీశ్వరుడు ఎలాన్‌ మస్క్‌ ‘ఎక్స్‌’లో వ్యాఖ్యానించారు.ఇరవై శాతం ఓట్లతో ఎ.ఎఫ్‌.డి. రెండో స్థానం పొందగలదని ఎన్నికల అంచనాలు తెలిపాయి. ఎ.ఎఫ్‌.డి.తో కలవడానికి ఇతర పార్టీలు తిరస్కరించాయి.సంప్రదాయవాద ప్రతిపక్ష కూటమి నాయకుడు ఫ్రెడరిక్‌ మెర్జ్‌ 30% ఓట్లతో ఛాన్సలర్‌ అవచ్చు. మధ్యేవాద-వామపక్ష కూటమి మాజి ఛాన్సలర్‌ ఓలఫ్‌ స్కోల్జ్‌ విధానాలకు ప్రాథమికంగా మారుస్తానని మెర్జ్‌ ప్రకటించారు. ఆర్థికవ్యవస్థను పునరుద్ధరించే పద్ధతుల్లో తలెత్తిన విభేదాలతో స్కోల్జ్‌ ఆర్థిక మంత్రిని తొలగించారు. తర్వాత ఘటనలతో 2023 నవంబర్‌లో స్కోల్జ్‌ ప్రభుత్వం పడిపోయింది. ముందస్తు ఎన్నికలకు దారితీసింది. తప్పులు జరిగాయని, అయితే ఇది భవిష్యత్దర్శన సమయమని జనవరి 11న బెర్లిన్‌లో తనను ఛాన్సలర్‌ అభ్యర్థిగా ఎన్నుకున్న ప్రతినిధుల సభలో స్కోల్జ్‌ ఒప్పుకున్నారు.పోరాడుదామని నినదించారు.
12 సెప్టెంబర్‌ 2013న బీజేపీ సమావేశంలో మోడీని 2014 సాధారణ ఎన్నికల ప్రధాని అభ్యర్థిగా నిర్ణయించారు. సొంత స్వయం సేవకులు, మోడీ ఉన్నతికి కారకులైన ఆద్వానీ, మురళిమనోహర్‌ జోషి వగైరాలు ఆ నిర్ణయాన్ని విభేదించారు. అందుకు వాళ్లనుపక్కకు నెట్టారు. కాని ప్రజలు, మేధావులు, పౌర సంఘాలు, ప్రత్యామ్నాయ పక్షాలు మోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని పట్టించుకోలేదు. వీడల్‌ నెగ్గే అవకాశం లేకున్నా జర్మన్లు ఆమె ఛాన్సలర్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. 2014లో బీజేపీ గెలిచే అవకాశాలెక్కువ. నాటి రాజకీయ శూన్యాన్ని మోడీ సులభంగా ఆక్రమించుకునే అవకాశం ఉండింది. పదేండ్లు మన్మోహన్‌సింఫ్‌ు పాలనలో అనేక అవినీతి కుంభకోణాలు జరిగాయి. ”ప్రధాని” మన్మోహన్‌ ఎన్నికల ప్రచారానికి పనికి రాలేదు.2014 ఎన్నికల్లో అవకాశవాద జిత్తుల బీజేపీ గెలుస్తుందని కాంగ్రెస్‌, ప్రతిపక్షాలు, మేధోపౌర సంఘాలు ఊహించలేకపోయాయా? బీజేపీ అభ్యర్థి మోడీ ప్రధాని అవుతారనుకోలేదా? గుజరాత్‌ ముఖ్యమంత్రిగా మోడీని గమనించలేదా? గుజరాత్‌ అభివృద్ధి నమూనాను నమ్మారా?
పార్టీలో విభేదాలు సృష్టిస్తున్నారని గతంలో సంఫ్‌ు మోడీని గుజరాత్‌ నుంచి బహిష్కరించింది. మోడీ ఢిల్లీకి మారారు. అరుణ్‌ జైట్లి ఇంట్లో మకాం పెట్టారు. జాతీయ నాయకులతో పరిచయాలు పెంచుకున్నారు.మోడీని భరించలేని జైట్లి విశ్వ హిందూ పరిషత్‌ సాయంతో ఆయన్ను అమెరికా పంపారు. అక్కడి నుంచి రప్పించి మోడీ ఎత్తులకు లొంగి శాసన సభ్యుడు కాని ఆయన్ను ప్రధాని వాజ్‌పేయి గుజరాత్‌ ముఖ్యమంత్రిని చేశారు.తన మోద్‌ ఘంచి వైశ్య ఉపకులాన్ని మోడీ బీసీగా మార్పించుకున్నారు. గోధ్రా మారణహోమంతో ”ఇతరుల” ధన మాన ప్రాణాలను బలిపెట్టి పదవిని స్థిరపరుచుకున్నారు. మోడీకి అమిత్‌షా కలిశారు. తమ అరాచకాల సాక్షులైన అధికారులను జైళ్లకు పంపారు. తమ కేసుల్లో వాదిస్తున్న న్యాయవాదులను లోబర్చు కున్నారు. విచారిస్తున్న న్యాయమూర్తులను చంపించారు. రైతుల భూములను, ప్రజల ఆస్తులను కార్పొరేట్లకు కట్టబెట్టారు. కార్పొరేట్ల వినోద విశ్రాంత గృహాల్లో వారిని కూలీలను చేశారు. కార్పొరేట్ల లాభాల కోసం గిఫ్ట్‌ నగరం నిర్మించారు. ఉప్పు తయారిదారులైన ఎస్‌.టి. ముస్లిం అఘరియాలను హింసించి, వారిని ఓటుకు దూరం చేశారు.విద్యను ప్రయివే టీకరించారు. కాషాయీ కరించారు. ఛాందసీకరించారు. అనేక ప్రత్యేక కేటాయింపులతో మద్య నిషేధాన్ని నీరుగార్చి మద్యపుటేరులు పారించారు. ముస్లింలను తరిమేశారు. ఉన్నవాళ్లను ప్రత్యేక ప్రాంతాల్లో బంధించారు. పాత్రికేయాన్ని పాతేశారు. న్యాయవ్యవస్థను జేబులో వేసుకున్నారు. గాంధీని కించపర్చారు. గాడ్సేకు గుడికట్టారు. ఏండ్లు దాటినా లోకాయత్‌ను నియమించలేదు. దాన్ని సమర్థించుకోడానికి కోర్టుల్లో కోట్ల రూపాయలు ఖర్చుచేశారు. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు లోకాయత్‌ను నియమించిన మహిళా గవర్నర్‌ కమల బేనివాల్‌ను మోడీ ప్రధాని అయిన తర్వాత సతాయించారు. ఇంటికి పంపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను లెక్కచేయలేదు. ఎస్సీ,ఎస్టీల పిల్లలు బడులకు పోకుండా నదులు, కాలువలపై వంతెనలు కట్టలేదు. అసౌకర్యాలను కొనసాగించారు. వారి తండ్రులు రోజుకొకరు పిల్లలను నదులు ఈది దాటించి బడులకు పంపేవారు. బాలికల కష్టాలను చూసిన తర్వాతి ముఖ్యమంత్రి ఆనందిబెన్‌ పటేల్‌ మాతృ హృదయం రోదించింది. భండారం బయటపడుతుందని ఆమెను ముఖ్యమంత్రి పదవి నుండి తప్పించారు. మోడీ, షాలు అబద్దాల ప్రచారాలతో ఈ అస్తవ్యస్తతలను గుజరాత్‌ నమూనా ఘనతగా చాటారు.
ఇంతటి గుజరాత్‌ దుర్మార్గం ఢిల్లీ పీఠం ఎక్కుతూ ఉంటే పౌరులు, మేధావులు, రాజకీయులు నిశ్శబ్దంగా ఉన్నారు. అమానవీయ ఫాసిజాన్ని అనుభవించిన జర్మన్ల వారసులు తీవ్ర మతవాద ఫాసిస్టు ఎ.ఎఫ్‌.డి.అవకాశాన్ని నేడు నిరసించారు. 2013లోనే కాదు, నేటికీ మనకు ఈ తెలివిలేదు. అందుకే మోడీ కార్పొరేట్‌ ఫాసిజం కొనసాగుతోంది. భవిష్యత్తులో మనకు తెలివి వస్తుందని ఆశిద్దాం.

– సంగిరెడ్డి హనుమంత రెడ్డి
9490204545