ఎందుకింత కక్ష?

– న్యూస్‌క్లిక్‌ పోర్టల్‌పై కొనసాగుతున్న వేధింపుల పర్వం
– 2021లోనే దాడులు…సోదాలు
– తాజాగా ఫ్లాటు జప్తు

– ఆర్థిక అవకతవకలంటూ నిరాధార ఆరోపణలు
న్యూఢిల్లీ : తనకు వ్యతిరేకంగా గొంతు విప్పే వారంటే ప్రధాని నరేంద్ర మోడీ ఎంతమాత్రం ఇష్టపడరు. అలాంటిది ఓ స్వతంత్ర మీడియా సంస్థ తన ప్రభుత్వంపై ఆధారాలతో సహా విమర్శలు చేస్తుంటే ఆయనకు రుచిస్తుందా? నిజాలు నిర్భయంగా చెబుతుంటే ఊరుకుంటారా? అందుకే తన చెప్పుచేతల్లో నడిచే సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతారు. దాడులు చేయిస్తారు. ఆస్తులు జప్తు చేయిస్తారు. కోర్టుల చుట్టూ తిప్పుతారు. అప్పుడు కానీ ఆయన మనసు శాంతించదు.
తాజాగా ఆన్‌లైన్‌ న్యూస్‌ పోర్టల్‌ ‘న్యూస్‌క్లిక్‌’ ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ ప్రబీర్‌ పుర్కాయస్థకు చెందిన ఫ్లాట్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు దాడి చేసి జప్తు చేసిన ఉదంతం భావ ప్రకటనా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టు లాంటిది. వాస్తవానికి న్యూస్‌క్లిక్‌ పోర్టల్‌పై కక్షసాధింపు చర్యలు చేపట్టడం ఇది మొదటిసారి కాదు. పోర్టల్‌ కార్యాలయం పైన, పుర్కాయస్థ నివాసం పైన 2021 ఫిబ్రవరి 9న ఈడీ దాడి చేసింది. వరుసగా ఐదు రోజుల పాటు పోర్టల్‌తో సంబంధమున్న ఎనిమిది ప్రాంతాలలో ఒకేసారి విస్తృతంగా సోదాలు చేసింది. పుర్కాయస్థతో పాటు మరో సంపాదకుడు ప్రంజల్‌ పాండే నివాసం పైన, ఎడిటోరియల్‌, అకౌంట్స్‌ విభాగాలకు చెందిన ఐదుగురు సిబ్బంది నివాసాల పైన కూడా దాడులు జరిగాయి. అదే రోజు రాత్రి మరో ఆరుగురు సిబ్బంది నివాసాలపై దాడి చేశారు. కార్యాలయంలో 38 గంటల పాటు జరిగిన సోదాలు 10వ తేదీ రాత్రి ముగిశాయి. కానీ పుర్కాయస్థ నివాసంలో ఏకంగా 113 గంటల పాటు సోదాలు చేశారు. దాడులు జరుగుతున్నంత కాలం పుర్కాయస్థ, గీతా హరిహరన్‌లను గృహనిర్బంధంలోనే ఉంచారు. బయటికి వెళ్లేందుకు అనుమతి నిరాకరించారు. కనీసం ఫోన్‌ను ఉపయోగించేందుకు కూడా అనుమతించలేదు. విదేశీ నిధులు, మనీ లాండరింగ్‌ ఆరోపణలపై దాడులు జరిగాయంటూ ఈడీ అధికారులను ఉటంకిస్తూ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే తమపై వచ్చిన ఆరోపణలను న్యూస్‌క్లిక్‌ తోసిపుచ్చింది. అవి నిరాధారమైన ఆరోపణలని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని తెలిపింది. ఎడిటర్స్‌ గిల్డ్‌, కమిటీ టూ ప్రొటెక్ట్‌ జర్నలిస్ట్స్‌ (సీపీజే), ప్రెస్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా (పీసీఐ) తదితర సంస్థలు, ప్రజాస్వామ్య వాదులు ఆ దాడులను తీవ్రంగా ఖండించారు. అయినా కుక్క తోక వంకర అన్న సామెతను నిజం చేస్తూ ఇప్పుడు మరోసారి దాడులకు తెగబడ్డారు.
ఏం చేస్తోంది?
అసలు న్యూస్‌క్లిక్‌ పోర్టల్‌ మీద ఎందుకింత కక్ష? ఎందుకంటే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు జరిపిన ఆందోళనలపై ఆ పోర్టల్‌ పలు కథనాలు ప్రచురించింది. దాని నివేదికలు, విశ్లేషణాత్మక వీడియోలు లక్షలాది మంది పాఠకులను కదిలించాయి. ఇది సహజంగానే ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. న్యూస్‌క్లిక్‌ పోర్టల్‌ భావ ప్రకటనా స్వేచ్ఛకు పెద్దపీట వేస్తోంది. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమిస్తోంది. ప్రభుత్వంపై విమర్శనాత్మక కథనాలు ప్రచురించేందుకు ప్రధాన స్రవంతి మీడియా వెనుకాడుతుంటే న్యూస్‌క్లిక్‌ వంటి స్వతంత్ర సంస్థలు వాస్తవాలను వెలుగులోకి తెస్తున్నాయి. ప్రభుత్వ దుర్నీతిని ఎండగడుతున్నాయి.
ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పాఠకులకు చేరవేస్తున్నాయి. అందుకే న్యూస్‌క్లిక్‌పై మోడీ ప్రభుత్వం కన్నెర్ర చేస్తోంది. ఆర్థిక అవకతవకలకు పాల్పడిందంటూ తప్పుడు ఆరోపణలతో వేధింపులకు పాల్పడుతోంది. సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌ను ఎలా వేధించారో, అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సంస్థ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు ఈడీ, ఇతర సంస్థలను ఎలా ప్రయోగించారో అందరికీ తెలిసిందే. చివరికి అమ్నెస్టీ మన దేశంలో తన దుకాణాన్ని మూసేసింది. ఇప్పుడు న్యూస్‌క్లిక్‌ను కూడా అణగదొక్కాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న అకృత్యాలు, అరాచకాలను ప్రధాన మీడియా దాచి పెడుతుంటే న్యూస్‌క్లిక్‌ మాత్రం నిర్భయంగా సమాజానికి చేరవేస్తోంది.