ఎందుకీ వంచన…?

Editorialప్రభుత్వాలు పటిష్టమైన సామాజిక రక్షణ పథకాలను అమలు జరపనట్లయితే వచ్చే దశాబ్ది కాలంలో ఆసియాలో 26కోట్ల మంది దారిద్య్రంలోకి దిగజారతారని మంగళవారంనాడు వెల్లడించిన ఐరాస నివేదిక హెచ్చరించింది. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో దారిద్య్రం పెరుగుతోందని, అసమానతలు విస్తరిస్తున్నాయని కూడా ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తంగా చూసినపుడు ఈ ప్రాంతంలోని 45శాతం జనాలకు సామాజిక భద్రతా పథకాలు అమలు కావటం లేదు. అమలు జరుగుతున్న పథకాలు కూడా ఎంతమందికి మేలు చేస్తున్నాయన్నది ప్రశ్న. ఈ నివేదిక ఆసియా గురించి చెప్పింది గనుక మనదేశం మినహాయింపు కాదు. మన కేంద్ర ప్రభుత్వం జాతీయ సామాజిక సహాయ పథకం సోషల్‌ ఆడిట్‌ 2023 నివేదికను విడుదల చేసింది. 1995 నుంచి ఈ పధకం అమలు జరుగుతోంది. దీని ఐదు ఉపపథకాలు ఉన్నాయి. వాటిలో ఒకటైన వృద్ధాప్య పెన్షన్‌ కింద అరవై సంవత్సరాలు నిండితే నెలకు రూ.200, 80ఏండ్లు దాటితే రూ.500 ఇస్తున్నారు. ఈ మొత్తాలు ఏమూలకు సరిపోతాయో పాలకపార్టీ పెద్దలు చెప్పాలి. పొరుగు రాష్ట్రం ఏపీలో నెలకు నాలుగు వేలు గరిష్టంగా ఇస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో వెయ్యి రూపాయలకు మించి ఇవ్వటం లేదు, ఇది కేంద్ర ప్రభుత్వ పథకమైనా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెంచకుండా పాతికేండ్ల నాటి మొత్తాలే ఇస్తున్నది. అంతర్జాతీయ సంస్థల దృష్టిలో ఇదొక ఉద్దరణ పథకం.
ఒకవైపు కోట్లాది మందిని దారిద్య్రరేఖనుంచి ఎగువకు తెచ్చి ఉద్దరించినట్లు మోడీ తన జబ్బలను తానే చరుచుకుంటారు. మరోవైపు సామాజిక సంక్షేమం కింద 80కోట్ల మందికి ఉచితంగా బియ్యం, గోధుమలు ఇస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటారు. అంటే వారంతా దారిద్య్రంలో ఉన్నట్లే కదా! ఎందుకీ వంచన? విషాదకరమైన అంశం ఏమిటంటే అసలు దారిద్య్రరేఖకు ప్రాతిపదిక ఏమిటన్న దానిమీద ఇంతవరకు ఏకాభిప్రాయం లేదా ప్రమాణం లేదు. సాంకేతికంగా ఒక ప్రాతిపదికను గుర్తించినప్పటికీ అనేక దేశాల్లో దానికి ఎగువన అనేక కోట్లమంది ఎప్పుడైనా దారిద్య్రంలో తిరిగి కూరుకుపోయే వారిగా వున్నారు. ఇది ఎలా అంటే గోచిపాత రాయుడు దుర్భర దారిద్య్రంతో ఉన్నట్లు, చాలీచాలని అంగవస్త్రం చుట్టుకుంటే దాన్నుంచి బయటపడినట్లు పరిగణించటంగా చెప్పవచ్చు. అనుకోని అవాంతరాలు ఏర్పడితే అంగవస్త్రం కూడా కొనుక్కోలేరు. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్న ప్రపంచ బ్యాంకు 2017లో దుర్భర దారిద్య్రరేఖ ప్రమాణంగా రోజుకు పిపిపి పద్ధతిలో ప్రతిమనిషికి 1.9డాలర్లుగా ఉన్న దాన్ని 2.15 డాలర్లకు పెంచి అంతకంటే తక్కువ ఆదాయం వచ్చేవారిని గర్భదరిద్రులుగా వర్గీకరించింది. మన కరెన్సీలోకి దీన్ని మార్చుకుంటే రోజుకు ప్రతిమనిషికి రూ.180 కంటే తక్కువ వచ్చేవారని అర్ధం. ఎవరికి వారు దీన్ని వర్తింపచేసుకుని తామెక్కడ ఉన్నదీ అర్ధం చేసుకోవచ్చు.
ప్రపంచంలో అత్యధిక ధనవంతమైన దేశంగా పరిగణించే అమెరికాలో అంతకంటే తక్కువ రాబడి వచ్చేవారు 1.2శాతం ఉన్నారు. ఈ కారణంగానే మన దేశంలో ఉచిత బియ్యం ఇస్తున్నట్లు అక్కడ పేదలకు ఆహార కూపన్లను ప్రభుత్వం ఇస్తున్నది. ఇండ్లు లేని వారు మనదేశంలో రోడ్ల మీద పడుకున్నట్లే అక్కడ పార్కుల్లో, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఉండేవారు కూడా ఉన్నారు. మనదేశాన్ని 2047 నాటికి ఎక్కడికో తీసుకుపోతామని చెబుతున్న నరేంద్రమోడీ, ఆయనకు భజన చేసే చంద్రబాబు, నితీష్‌కుమార్‌ వంటి వారు కొలువై ఉన్న మనదేశంలో గర్భదరిత్రులు 12.9శాతం(2022) మంది ఉన్నారు. ఇది ప్రపంచ సగటు తొమ్మిదిశాతం కంటే ఎక్కువ. అదే 3.65 డాలర్లను తీసుకుంటే 44శాతం, 6.85 డాలర్లను తీసుకుంటే 81.8శాతం ఉన్నారు. ప్రపంచ సగటును చూస్తే ఈ తరగతికి కిందకు వచ్చే వారు 9-22.4-44.9 శాతం వంతున ఉన్నారు. కమ్యూనిస్టు నియంతల దేశం, అక్కడ ప్రజాస్వామ్యం ఉండదు అని చెప్పే చైనాలో ఈ అంకెలు వరుసగా 0-0.1-17(2020 సంవత్సరం ప్రపంచబ్యాంకు సమాచారం)శాతం మాత్రమే.
ప్రపంచబ్యాంకు సమాచారం ప్రకారం..2019లో 2.15 డాలర్ల కంటే తక్కువ వచ్చే వారు 64.8కోట్ల మంది ఉన్నారు. ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ చెబుతున్నదాని ప్రకారం రోజుకు 1.25 డాలర్ల కంటే తక్కువ ఆదాయం వచ్చేవారు ఆసియా-పసిఫిక్‌లో 70కోట్ల మంది ఉన్నారు. నిజానికి ఈ 1.25 డాలర్లన్నది 1988 నుంచి 2005వరకు 15 అతిపేద దేశాలలో ధరలు, కరెన్సీల విలువను పరిగణనలోకి తీసుకొని నిర్ణయించారు. దీన్లో అసియా నుంచి రెండు దేశాలను మాత్రమే తీసుకున్నారు. నాటికి నేటికి వచ్చిన తేడాను పరిగణనలోకి తీసుకుంటే దారిద్య్ర నిర్మూలన, దారిద్య్రరేఖ నిర్ణయం అంతా అంకెల గారడీ తప్ప మరొకటి కాదు.