మాజీ డీజీపీ అరవిందరావు నవంబర్ 23న ఆంధ్రజ్యోతి దినపత్రికలో కులగణనను వ్యతిరేకిస్తూ ఒక వ్యాసం రాశారు. కులగణన చేయడం భారతీయ సమాజాన్ని విడగొట్టే కుట్రగా చెప్పారు. ఇది బ్రిటీిషు పాలకులు భారతీయ సమాజాన్ని విభజించే ఎజెండాతో అనుసరించిన పంథా అని అన్నారు. అలాంటి పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని, కులగణన జరిగితే సమాజంలో అల్లకల్లోలం ఏర్పడుతుందని, దాన్ని పోలీసులుగాని, ఆర్మీగాని అదుపు చేయలేరని ఆందోళన పడ్డారు. తన వాదనను సమర్థించు కోవడానికి అవాస్తవాలు చెప్పారు,వక్రీకరణలు జోడించారు.
నిజానికి ఈ దేశ మూలవాసులకి అసలైన మొదటి శత్రువులు నాడు పశ్చిమాసియా నుండి వచ్చిన ఆర్యులే. ఆ తర్వాతనే మరేవరైనా కావొచ్చు. అరవిందరావు వర్ణవ్యవస్థ అనాదిగా ఉందని, అదేమి భారతదేశ ప్రత్యేకత కాదని, ఇలాంటి వ్యవస్థలు ప్రపంచమంతా వున్నాయన్నారు. ఆయన చెప్పింది పాక్షిక సత్యమే. బ్రిటీషువారు వచ్చాకే భారతదేశంలో వర్ణవ్యవస్థ ఉనికిలోకి వచ్చిందనడం, వారొచ్చిన తర్వాతనే దేశంలో విచ్ఛన్నకర పరిస్థితులు దాపురించాయనడం, అస్పృశ్యత బ్రిటీష్ వారు రాకముందు లేదనడం, అమాయకత్వం లేదా తెలివితక్కువతనం లేదా మోసకారితనం అవుతుంది.
బ్రిటీషు వారికి నల్ల జాతీయులంటే చులకన భావన ఉంది. దేశ సంపద కొల్లగొట్టారు. ఉద్యమాలను అణచివేశారు. కాని వారి కాలంలో తమ అవసరార్థం ఈ దేశ ప్రజలకు ఉపయోగపడే సంస్క రణలు అనేకం చేేశారన్నది వాస్తవం. వేల ఏండ్లుగా సాగుతున్న బ్రహ్మణిజాన్ని దాని ఆధిపత్యాన్ని దెబ్బతీసే విధంగా మూఢచారాలను నిషేధించారు. ”సతీసహగమనం” రద్దు చేశారు. వర్ణాశ్రమ ధర్మానికి భిన్నంగా విద్య ప్రజలందరికి అందించే ప్రయత్నం చేశారు. విద్య అంటే మత గ్రంథాలు, పురాణాలు వల్లె వేయడం కాదని లోకజ్ఞానాన్ని పెంచే లెక్కలు, సైన్సు, చరిత్ర, భూగోళం, సామాజిక శాస్త్రం వంటివని వాటిని భోదనాంశాలుగా చేశారు. ఫలితంగానే ఫూలే, పెరియార్, అంబేద్కర్ లాంటి మహనీయులు నాటి భారతీయ సమాజం నుండి తయారయ్యారు. వారికి సేవకులను తయారు చేసుకోవడమూ అందులో ఇమిడి ఉంది. అది వేరే విషయం.
అరవిందరావు కులవ్యవస్థ ఇస్లాం వచ్చాకో, క్రైస్తవం అవతరించాకో ప్రారంభమయినట్లు చెప్పడం మోసకారితనమ వుతుంది. ఈ విషయమై స్వామి వివేకానంద ఏమి చెప్పారో చూడండి. ”అస్పృశ్యులు అనబడే ప్రజలను ఈనాటి అధ్వాన్న స్థితికి దిగజార్చింది ఎవరు? ఎవరు దీనికి బాధ్యులు? దీనికి ఆంగ్లేయులు మాత్రం కారణం కాదు. అనేక పారమార్దిక, వ్యవహారిక సిద్ధాంతాలను కనిపెట్టిన హిందూమతంలోని కుటిలులే ఇందుకు కారణం” అని స్పష్టంగా చెప్పారు. రామకృష్ణ మఠం ప్రచురించిన ”స్వామి వివేకానంద” పుస్తకంలోని పదహారో పేజీలో ఈ విషయం స్పష్టంగా ఉంది. స్వామి వివేకానంద చెప్పిందైనా అరవిందరావు పరిగణలోకి తీసుకొని ఉంటే బావుండేది.
వర్ణవ్యవస్థగా చెప్పబడేది కేవలం సమాజ అవసరాల కోసం, సౌలభ్యం కోసం ఏర్పడ్డ వృత్తుల విభజన మాత్రమే, ఆ వృత్తులు వంశ పారంపర్యం కాదు. అక్కడ ఉచ్చం, నీచం, అంటరానితనం అంటూ తారతమ్యాలు లేవు. ఒక వృత్తి నుండి మరే వృత్తికైనా మారే స్వేచ్ఛ వుండేది. ఎలాంటి వివక్షలు లేవని ఆయన వాదన. ఆయన నిజంగానే ఆ వాదనను నమ్మేవారయితే మనుస్మృతిని రామాయణ, మహాభారతంలో వర్ణవ్యవస్థకు అనుకూలంగా ఉన్న అంశాలను ఖండ ఖండాలుగా చీల్చి చెండాడేవారు. కానీ, మన సమాజంలోని వర్ణ కుల వ్యవస్థకు గ్రీస్ మరికొన్ని ప్రాచీన నాగరిక దేశాలకు చెందిన బానిస వ్యవస్థలకు మౌలిక తేడాలున్నవి. రెండింటిలో దోపిడీ చేసే వారికి దోపిడీ చేయబడే వారికి మధ్య వైరుధ్యమే ప్రధానమైనది. అయితే ప్రధాన తేడా ఏమిటంటే అక్కడ బాని సల పేరిట దోపిడీ చేసేవారు. ఇక్కడ వర్ణం, కులం ముసుగులో దోపిడీ కొనసాగింది. ఈ వ్యవస్థలను నిలబెట్టడానికి, దీర్ఘకాలిక ప్రయోజనాలను బలపర్చు కోవడానికి ఒక సైద్ధాంతిక, తాత్విక మత చట్రం, నిర్మితమైనది. బయటి ప్రపంచ దేశాలలో కులవివక్ష, అంటరానితనం, మైల సిద్ధాంతం వగైరాల్లేవు. ఆర్థిక అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న తత్కాలిక నిర్భంధ చట్టాలవి.
దేవుడే అసమానతలు సృష్టించాడని, దేవుడి నోటి నుండి, బ్రాహ్మణులు బాహువుల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు పుట్టారని, హిందువులు పవిత్రంగా భావించే గ్రంథాలన్నీ చెపుతాయి. శూద్రుల పట్ల వివక్ష పాటించాలని, దళితులను అంటరానివారిగా చూడాలని, మహిళలను అణిచి ఉంచాలని చెపుతాయి. ఇతర వ్యవస్థల్లో ఇది మనకు కనపడదు. కానీ అరవిందరావు రెంటిని ఒకే గాట కట్టి మాయ చేస్తున్నారు. యూరప్‌లో కూడా కులవ్యవస్థ ఉన్నట్లు, అది పారిశ్రామిక విప్లవం ద్వారా అంతమయినట్లు ఆధారం లేని వాదనలు చేస్తున్నారు. ఇంగ్లీషు వారు రాకపోతే మన దేశంలోనూ పారిశ్రామిక విప్లవం వచ్చి కులవ్యవస్థ పటాపంచలయ్యేదని అన్నారు.
వారు చెప్పిన మరో అవాస్తవం ఏమిటంటే, హిందుమత గ్రంథాలు కులవ్యవస్థకు మూలమైన వర్ణవ్యవస్థ భారతీయ సమాజానికి ఏ నష్టం చేయలేదన్నది. పైగా లాభమే చేసిందని వాధిస్తున్నారు. కులగణన ద్వారా ప్రస్తుత ఆధిపత్య వర్ణాలకు ప్రయోజనకారిగా వున్న వర్ణ, కులవ్యవస్థలు నిర్వీర్యమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత నిచ్చెనమెట్ల కులవ్యవస్థలో బ్రహ్మణ, క్షత్రియులకు ఎలాంటి ఇబ్బందులు లేవు. చదువు, సంపదలు కింది కులాలకు నిషేధించి తాము సమాజంపై పెత్తనం చేస్తూ సుఖ, సౌఖ్యాలు అనుభవించారు. ఇప్పటికి అనుభవి స్తున్నారు. వారు ఈ సౌకర్యాలు కొనసాగాలనుకోవడం సహజం. మన సమాజంలో కులం కొందరికి వరమైతే, కోట్లాను కోట్లమందికి శాపంలా దాపురించింది. సంపన్నులంతా ఎక్కువగా అగ్రకులాల నుండే వున్నారు. పేదలంతా దాదాపు ఎస్సీ, ఎస్టీ, బీసి కులాల నుండే వున్నారు. కులం ప్రభావితం చేయని రంగమంటూ లేదు. ఒక ఉదాహరణ చూస్తే ఇదెంత వాస్తవమో గమనించవచ్చు. ఈ ఏడాది జూన్ 30న దినపత్రికలలో ఈ వార్త వచ్చింది. ప్రపంచ అసమానతల నివేదిక వారు బహిర్గత పర్చారు. భారతదేశంలోని శతకోటీశ్వరులలో 88శాతం అగ్రకులస్తులే. జనాభాలో 15శాతం కూడా లేని అగ్రకులాలకు చెందినవారే సంపన్నుల్లో 88శాతం వున్నారు. మిగతా కులాలన్నింటి నుండి కేవలం 12శాతం మాత్రమే. ఇదే పరిస్థితి, రాజకీయ, న్యాయవ్యవస్థ, బ్యూరోక్రసి, మీడియా అధిపతుల్లోనూ కనిపిస్తుంది.
గత మూడు, నాలుగు తరాల నుండి బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు వారు చదువుకొని విజ్ఞాన వంతులవుతున్నారు. ఆర్థికంగా మధ్య తరగతి వర్గాలలోకి చేరగలుగుతున్నారు. చైతన్యవంతులు కాగలుగుతున్నారు. తరతరాలుగా తమ పూర్వీకులకు జరిగిన అన్యాయాలు గుర్తిస్తున్నారు. ఇప్పటికీ తాము అన్నిరంగాల్లో వెనుకబడిన విషయాన్ని గమనించగలు గుతున్నారు. తమ భాగం తమకు కావాలంటున్నారు. అనేక రూపాల్లో ఆ ఉద్యమాలు సాగుతున్నాయి. కుల గణన జరిగితే వాస్తవాలు బయటికొస్తాయి. ఒక కుట్ర ప్రకారం వారు కులగణనను పలుచబరచాలని చూస్తున్నారు. ఏ కులం వారు ఎంత వున్నారు? ఎవరి దగ్గర ఎంతెంత మేరకు ఆస్తులున్నాయి. బహిర్గతమవుతాయి.అందుకే కింది కులాల వారు కులగణన కావాలని వివిధ రంగాల్లో కొంత కాలంగా ఉద్యమం చేస్తున్నారు. 1931లో బ్రిటీషు వారు కుల గణన చేశారు. కాని తర్వాత మళ్లీ జరుగలేదు. అప్పుడు జరిగిన కులగణన వలననే కింది కులాలకి రిజర్వేషన్ లాంటివి వచ్చాయి. వాటివలన దేశానికి నష్టం వాటిల్లిందని మతాంతీకరణలు జరిగాయని అరవిందరావు సిద్ధాంతీకరిస్తున్నారు.
సామాజిక న్యాయం కావాలని, కులగణన జరగాలని చేస్తున్న ఉద్యమాలు అరవిందరావు లాంటి వారిని కలవరపెడుతున్నాయి. ఎవరు కోరకున్నా పాలకులే ఓట్ల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం కుల గణన చేపడుతున్నారని ఆక్రోషిస్తున్నారు. ప్రస్తుత సామాజిక వ్యవస్థ పట్ల అందరూ సంతృప్తికరంగా వున్నారని అవాస్తవాలు చెపుతున్నారు. ఇది ఆయన స్థాయికి తగింది కాదు. పైగా సామాజిక న్యాయం, కులగణన లాంటి ఉద్యమాలను పాలకులు పట్టించుకోరాదని, దానివల్ల ప్రభుత్వం నిర్వీర్యం అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని గుర్తుచేస్తున్నారు.
ఎంత చదివినా, ఎంత పెద్ద పదవులు నిర్వహించినా తాము పుట్టిన సామాజిక, ఆర్థిక పునాదులు వదులుకోవడం ఎంతో కష్టమని, అరవిందరావు వ్యాసం చూశాక ఎవరికైనా మరింత రూఢ అవుతుంది. తమ నేపథ్యాల అస్థిత్వం నుండే భావనలు పుడుతాయని ఎంగెల్స్ చెప్పింది ఎంత వాస్తవమో అరవిందరావు వాదనలు చూస్తే అర్థమవుతుంది. కులగణన ద్వారా ఆ కుటుంబం ఆర్థిక, సామాజిక వివరాలన్ని సేకరించాలి. తరతరాలుగా చదువు,సంపద నిషేధించబడి, గత మూడు,నాలుగు తరాలు కొంత లబ్ధి పొందుతున్నారు. కింది కులాల్లోని వారు నూటికి నూరు శాతం ప్రయోజనం పొందుతున్నారన్న భావన కూడా సరైంది కాదు. కింది కులాల్లోనే నేడు నిరుద్యోగులు, చిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారు. ఆ వాస్తవాలు కూడా ఎక్కడ వెళ్లడవుతా యోనని కొందరు మేధావులు తల్లడిల్లిపోతున్నారు. వెనుకబడిన కులాలు రిజర్వేషన్లను కొనసాగించవద్దని, తీసివేయాలని అగ్రకుల సంపన్న వర్ణాలు ఎప్పటి నుండో తమకున్న ప్రచార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నాయి. కులగణనను ఆపడం ద్వారా కులాల వారి వివరాలు వారి పరిస్థితి తెలువకుండా చేయాలని వారి ప్రయత్నాలు ఉంటున్నాయి. సామాజిక ఉద్యమకారులు, వామపక్ష వాదులు ఈ ప్రమాదాన్ని గుర్తిస్తున్నారు. అరవిందరావు డొల్ల మాటలను ఎవరూ విశ్వసించరు.
– జి.రాములు, 9490098006