సమాచారం ఎందుకు సేకరిస్తున్నారు?

Why is the information being collected?– ఎలక్ట్రానిక్‌ వస్తువుల దిగుమతిదారులపై ఆంక్షలెందుకు?
– భారత్‌ను ప్రశ్నించిన అమెరికా
న్యూఢిల్లీ : లాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, కంప్యూటర్లు వంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులను దిగుమతి చేసుకునే వారి నుండి సమాచారాన్ని ఎందుకు సేకరిస్తున్నారో వివరాలు తెలియజేయాలని మన దేశాన్ని అమెరికా కోరింది. ఎలక్ట్రానిక్‌ పరికరాలను దిగుమతి చేసుకునే వారి నుండి కేంద్ర ప్రభుత్వం నవంబర్‌ 1వ తేదీ నుండి సమాచారాన్ని కోరుతుంది. ఇతర వస్తువులను దిగుమతి చేసుకునే వారి నుండి కూడా ఇదే రకమైన సమాచారాన్ని కోరతారా అని అమెరికా ప్రశ్నించింది.
దిగుమతి లైసెన్సింగ్‌పై ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటు చేసిన కమిటీకి ఈ నెల 19న అమెరికా ఓ లేఖ రాసిందని హిందూ బిజినెస్‌ లైన్‌ పత్రిక తెలిపింది.’మీరు సేకరించిన సమాచారం లైసెన్సుల జారీ ప్రక్రియపై ప్రభావం చూపుతుందా? దిగుమతిదారులు ఇచ్చే సమాచారం ఆధారంగా పరిమాణాత్మక ఆంక్షలు విధించే అంశాన్ని భారత్‌ పరిశీలిస్తుందా? సమాచారాన్ని సేకరించాలని అనుకున్నప్పుడు ముందుగా బహిరంగ నోటిఫికేషన్‌ ఇచ్చారా? తుది ప్రకటన చేయడానికి ముందు ప్రజాభిప్రాయం తీసుకున్నారా?’ అని అమెరికా ప్రశ్నల వర్షం కురిపించింది. భద్రతా కారణాల రీత్యా లాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, కొన్ని రకాల కంప్యూటర్ల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆగస్టులో ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకే ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఎలక్ట్రానిక్‌ వస్తువుల్ని దిగుమతి చేసుకునే వారు కేంద్రం నుండి లైసెన్సులు లేదా అనుమతులు పొందాల్సి ఉంటుంది. అయితే ఆంక్షల కారణంగా అనేక పెద్ద కంపెనీలపై ప్రభావం పడడంతో కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చింది.