81 వేల కోట్ల అప్పు ఎందుకైంది?

Why is there a debt of 81 thousand crores?– విద్యుత్‌ అధికారుల్ని ప్రశ్నించిన సీఎం రేవంత్‌రెడ్డి
– సచివాలయంలో సమీక్షకు సీఎమ్‌డీ డీ ప్రభాకరరావు డుమ్మా
విద్యుత్‌ శాఖ అప్పులు రూ.81వేల కోట్లకు పెరగడానికి కారణాలు ఏంటని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అధికారుల్ని ప్రశ్నించారు. ఇంత పెద్దమొత్తంలో అప్పులు చేస్తుంటే అధికారులుగా మీరెలా మౌనంగా ఉన్నారని అడిగారు. విద్యుత్‌ శాఖపై డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో శుక్రవారంనాడాయన అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. రాష్ట్రంలో విద్యుత్‌ స్థితిగతులపై కూలంకషంగా చర్చించారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకష్ణారావు, ఇంధన శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మ, జేఎమ్‌డీ శ్రీనివాసరావు, సింగరేణి సీఎమ్‌డీ ఎన్‌ శ్రీధర్‌, తెలంగాణ రాష్ట్ర దక్షిణ, ఉత్తర ప్రాంతాల విద్యుత్‌ పంపిణీ సంస్థల సీఎమ్‌డీలు జీ రఘుమారెడ్డి, ఏ గోపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా విద్యుత్‌ రంగ స్థితిగతులను వివరించారు.
ఇదీ లెక్క…
విద్యుత్‌పై సమీక్షా సమావేశంలో అధికారులు ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ వివరాలు…
జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంల మొత్తం అప్పులు రూ.81,516 కోట్లు
– 2014-23 మధ్యకాలంలో డిస్కంల నష్టాలు రూ.50,275 కోట్లకు పెరిగాయి
– విద్యుత్‌ కొనుగోళ్లకు డిస్కంలు చేసిన అప్పులే రూ.30,406 కోట్లు
– ప్రతి నెలా రూ.1,300 కోట్లు అప్పుల తిరిగి చెల్లింపునకు కావాలి
– రూ.12,515 కోట్ల ట్రూఅప్‌ చార్జీల సొమ్ము ప్రభుత్వం నుంచి రావాలి.
– 2023 డిసెంబర్‌- 2024 మే వరకు రూ.11,058 కోట్ల నష్టాలొస్తాయని అంచనా.
– అప్పులు, క్లీన్‌ ఎనర్జీ సెస్‌, బొగ్గు ధరలు, విదేశీ బొగ్గు, పెరిగిన ఉద్యోగుల జీతాలే నష్టాలకు కారణం
– 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ సరఫరాకు రూ.4,008 కోట్ల వ్యయం అవుతుంది.
– వారం రోజుల్లో మరోసారి సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన విద్యుత్‌శాఖపై పూర్తిస్థాయి సమీక్ష
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విద్యుత్‌ శాఖపై సమీక్ష సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి అనేక సందేహాలను వ్యక్తంచేశారు. వాటికి సమాధానం చెప్పే ప్రక్రియలో అధికారులు మౌనం వహించినట్టు తెలిసింది. ప్రధానంగా యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (వైటీపీఎస్‌) నిర్మాణం కోసం పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ), రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఈసీ) ద్వారా తీసుకున్న దాదాపు రూ.30వేల కోట్లకు పైగా నిధుల్ని కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు మళ్లించిన విషయంపై ఆరా తీసినట్టు తెలిసింది. వైటీపీఎస్‌ నిర్మాణ ఆలస్యానికి ఇది కూడా కారణమేనా అని సీఎం రేవంత్‌రెడ్డి అడిగినట్టు సమాచారం. దీనితో పాటు మరికొన్ని విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణం కోసం ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తెచ్చి, వాటి దారిమళ్లింపుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆయన అధికారుల్ని కోరినట్టు తెలిసింది. అలాగే డిస్కంలు పవర్‌ ఎక్సేంజ్‌ల నుంచి కొంటున్న విద్యుత్‌, ప్రయివేటు డెవలపర్స్‌ నుంచి కొంటున్న కరెంటు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కూడా నివేదిక రూపంలో ఇవ్వాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి విద్యుత్‌ సంస్థలకు వచ్చిన నిధులు ఎన్ని? వాటిని ఎలా వినియోగించారు? అనే వివరాల్ని కూడా అడిగారు. విద్యుత్‌రంగంలో 2014కు ముందు ఉన్న పరిస్థితి…ఆ తర్వాతి స్థితిగతులపై తనకు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు. విద్యుత్‌రం గంలో గత ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణపై తొలి ప్రధాన్యతగా శ్వేతపత్రం తయారు చేయాలనీ, దీనిలో ఏఏ సంస్థల నుంచి ఏ రూపంలో నిధులు వచ్చాయి? వాటిని ఎలా ఖర్చు చేశారు? దారి మళ్లించిన నిధులు ఎన్ని? వాటిని ఎవరి ఆదేశాల మేరకు మళ్లించారు? మళ్లింపు నిధుల్ని ఎక్కడ ఎలా వినియోగించారు? విద్యుత్‌ సంస్థల అప్పులు పెరగడానికి కారణాలు ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం ఆ శాఖకు ఇచ్చిన నిధులు ఎన్ని? అనే అంశాలన్నీ ఆ నివేదికలో ఉండాలని స్పష్టంగా చెప్పినట్టు తెలిసింది. దీనిపై మరోసారి పూర్తిస్థాయి సమీక్ష చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు చెప్పారు.
ప్రభాకరరావు డుమ్మా
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశానికి టీఎస్‌జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు హాజరుకాలేదు. ఈనెల 3వ తేదీ ఎన్నికల ఫలితాలు వెలువడగానే 4న ఆయన తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే గురువారం జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో ప్రభాకరరావును పిలిపించాలని ప్రత్యేకంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఆయన రాజీనామాను ఆమోదించవద్దని ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మకు చెప్పారు. అయితే ఉత్తర ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీడీసీఎల్‌) సీఎమ్‌డీ ఏ గోపాలరావు గురువారం తన పదవికి రాజీనామా చేశారు. దాన్ని ఆమోదించకపోవడంతో శుక్రవారం జరిగిన సమీక్షకు హాజరయ్యారు.
సమాచారం లేదు
సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన విద్యుత్‌శాఖ సమీక్షా సమావేశానికి హాజరుకావాలని సచివాలయం నుంచి కానీ, విద్యుత్‌ శాఖ నుంచి కానీ తనకు ఎలాంటి సమాచారం లేదని టీఎస్‌జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు తెలిపారు. ఈ మేరకు ఆయన పేరుమీద ఓ పత్రికా ప్రకటన సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది. తనను ఆహ్వానిస్తే మీటింగ్‌కు తప్పకుండా వెళ్లేవాడిననీ, ముఖ్యమంత్రి పిలిస్తే ఎందుకు వెళ్లనంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.