ఇన్నేళ్లూ గుర్తుకు రాని డిక్లరేషన్‌ ఇప్పుడే ఎందుకు? : జగన్‌

– తిరుమల పర్యటన వాయిదా
అమరావతి :‘తొలిసారి ఎవరైనా వెళ్తుంటే ఇలా అడగొచ్చు. కానీ, జగన్‌ ఏమైనా కొత్తనా? వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఏమైనా కొత్తనా? నా మతం ఏమిటో, కులం ఏమిటో రాష్ట్రంలో, దేశంలో తెలియదా? రాజశేఖరరెడ్డిగారు వరుసగా ఐదేళ్లు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆయన కొడుకునే కదా నేను. నా పాదయాత్ర మొదలు పెట్టే ముందు దర్శించుకున్నాను. పాదయాత్ర ముగిసిన తరువాతకూడా నడకమార్గంలో స్వామివారిని దర్శించుకున్న తరువాతే ఇంటికి వెళ్లాను. ఆ తరువాత సిఎంగా వరుసగా ఐదేళ్లు పట్టు వస్త్రాలు సమర్పించాను. ఇలా 10,11 సార్లు వెళ్లిన తరువాత, ఈ రోజు డిక్లరేషన్‌ అడగడం ఏమిటి? అడ్టుకుంటామంటూ నోటీసులు ఇవ్వడమేంటి?’ అని వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం సాయంత్రం తాడేపల్లిలోని తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక మాజీ ముఖ్యమంత్రికే ఇటువంటి పరిస్థితి ఏర్పడితే, సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగానే డిక్లరేషన్‌ అంశాన్ని ముందుకు తెచ్చారని చెప్పారు. అయితే, బాబు అనుకున్న విధంగా టాపిక్‌ డైవర్ట్‌ కాకూడదన్న ఉద్దేశ్యంతోనే తన తిరుమల పర్యటనను వాయిదా వేసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ‘మా నాయకులు, ప్రజాప్రతినిధులకు నోటీసులు ఇస్తున్నారు. హౌస్‌ అరెస్ట్‌లు చేస్తున్నారు. పక్క రాష్ట్రాల నుండి బిజెపి కార్యకర్తలను రప్పించి గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అలా తాను చేసిన తప్పులను కప్పు పుచ్చుకునేందుకు చంద్రబాబు డైవర్ట్‌ చేస్తున్నారు’ అని జగన్‌ చెప్పారు. తన మతం గురించి వివరణ ఇస్తూ ‘నాలుగు గోడల మధ్య నేను బైబిల్‌ చదువుతాను. బయటకు వస్తే హిందూ సాంప్రదాయాలను అనుసరిస్తాను. గౌరవి స్తాను. ఇస్లాంను అనుసరిస్తాను. గౌరవిస్తాను. సిక్కిజ మ్‌ను అనుసరిస్తాను. గౌరవిస్తాను. నా మతం మానవత్వం. రాసుకోండి ఇదే నా డిక్లరేషన్‌’ అని అన్నారు.