ఎవరికి.. ఎందుకు..ముద్దు?

పండి ఎండిన పచ్చనాకులు
చెట్టుకెందుకు ముద్దవుతాయి
వయసు మళ్ళిన వృద్ధ దేహాన్ని
ఏ గడప కడదాకా మోస్తుంది
బంధాలూ బంధుత్వాలూ
ఆస్తి సంధిలో పందిళ్ళే కదా !
రక్తాన్నెప్పుడో రూపాయి కొన్నాక
మనిషి ధర్మం మార్కెట్‌ బంధమేగా

అవును అప్పుడు.. ఇప్పుడు
ఇన్సూరెన్సే అజెండా తప్ప
పన్నుకట్టే మనిషికి వైద్యం
అసాధ్యంగా ఎందుకైందో
ప్రశ్నించడం మరిచిపోయాం

గింజకు పురుడుపోసే పొలంలో
పనెందుకు దూరమైన ప్రశ్నయిందో
తల్లిలా చనుబాలు పట్టే వాల్లిపుడు
పట్నం ఎండిన రొమ్ముగా మార్చిన
విటుడెవరో.. చర్చెందుకు లేవలేదు?

పల్లెందుకు వల్లకాడౌతుందో
పట్టణంలో ప్రయివేటు చదువు
విదేశీ గాలానికెలా తగులుకుందో
తల్లి రొమ్ము కోసిన రాక్షసి
సొంత అక్షరాన్ని హత్యచేసి
ఆంగ్ల అక్షరాన్నెలా ముద్దాడిందో
ఎవరైనా కొంచం యోచిస్తున్నారా?
ఎప్పుడైనా ఓసారి ప్రశ్నిస్తున్నారా?

– ఉన్నం వెంకటేశ్వర్లు,
8790068814