– క్రిస్టియన్ బిషప్‌ల తీరుపై కేరళ మంత్రి ఆక్షేపణ
అలప్పుజ : మణిపూర్ హింసాకాండపై మౌనం వహించిన క్రిస్టియన్ బిషప్‌లపై కేరళ మంత్రి ధ్వజమెత్తారు. ఆదివారం అలప్పుజలో సీపీఐ(ఎం) స్థానిక కమిటీ కార్యాలయాన్నికేరళ సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సాజీ చెరియన్ ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని కార్యక్రమానికి రావాలని బీజేపీ నేతలు ఆహ్వానించినపుడు వారు ఉబ్బి తబ్బిబ్బై పోయారని ఎద్దేవా చేశారు. వారం దించిన కేకులు, ద్రాక్ష వైన్‌లతో మణిపూర్‌లో తమ కమ్యూనిటీ లక్ష్యంగా జరిగిన హింసాకాండను మరిచిపోయారని మండిపడ్డారు. ఈ విషయంపై స్పందించాలని వారు ప్రధానిని ఎందుకు కోరలేదని ప్రశ్నించారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ప్రధాని మోడీ నిర్వహించిన క్రిస్మస్ కార్యక్రమానికి పలువురు బిషప్‌లు హాజరైన సంగతి తెలిసిందే. మణిపూర్‌లో క్రిస్టియన్ కమ్యూనిటీపై బీజేపీ మద్దతుదారులు హింసాకాండ సాగించినప్పటికీ.. కేరళలో కొంతమంది బిషప్‌లు బీజేపీలో చేరుతున్నారని విమర్శించారు. పథనంతిట్ట జిల్లాలో ఓ బిషప్ సహా క్రైస్తవ కుటుంబాలు బీజేపీలో చేరడంపై పైవిధంగా స్పందించారు.