ఎందుకీ సస్పెన్స్‌ ?

– ప్రత్యేక సమావేశాల అజెండా ఏది?
– రాజ్యాంగ నిబంధనలకు తూట్లు
– ప్రజాస్వామ్యం చట్టసభల అపహాస్యం
న్యూఢిల్లీ: పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ఈ నెల 18 నుండి 22వ తేదీ వరకూ ఐదు రోజుల పాటు జరగబోతున్నాయి. అయితే ఇంత అకస్మాత్తుగా ఎందుకు జరుగుతున్నాయో ఎవరికీ తెలియడం లేదు. ప్రత్యేక సమావేశాల గురించి ‘ఎక్స్‌’లో ట్వీట్‌ చేసిన కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషీ, వాటిని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో మాత్రం వెల్లడించలేదు. దీంతో మీడియా, రాజకీయ నాయకులు ఎవరికి తోచిన ఊహాగానాలు వారు చేస్తున్నారు. జమిలి ఎన్నికల పైన చర్చించేందుకే పార్లమెంటును సమావేశపరుస్తున్నారని కొన్ని ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నాయి. కొందరేమో ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)పై చర్చించడానికని అంటుంటే మరి కొందరు చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుకు చట్టరూపం కల్పించడానికంటూ ఊహిస్తున్నారు.
ఒకవేళ తాము ప్రభుత్వ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా సమావేశాలను స్తంభింపచేస్తే నరేంద్ర మోడీ, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ వెంటనే రంగంలోకి దిగుతాయని, తమను లక్ష్యంగా చేసుకొని ప్రజలలో దురభిప్రాయం కలిగించేందుకు ప్రయత్నిస్తాయని ప్రతిపక్ష పార్టీ ఎంపీ ఒకరు తెలిపారు. కాగా సమావేశాలపై మోడీ ప్రభుత్వ ప్రకటనలో నాటకీయత శృతి మించిందని కాంగ్రెస్‌ నేత అభిషేక్‌ మనుసింఘ్వీ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్దేశాన్ని రహస్యంగా ఉంచుతూ, బయటకు లీకులు అందిస్తున్నారని విమర్శించారు.
నిబంధనలకు నీళ్లు
ప్రభుత్వ ఉద్దేశం ఏదైనప్పటికీ పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల నిర్వహణకు సంబంధించిన నిబంధనలను, గతంలో అనుసరించిన సంప్రదాయాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగంలోని 85వ అధికరణలో పార్లమెంట్‌ సమావేశాల నిర్వహణ, ప్రొరేగ్‌, రద్దు గురించిన వివరాలను పొందుపరిచారు. పార్లమెంట్‌ సమావేశాలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయాల్సింది రాష్ట్రపతి. సమా వేశాల మధ్య ఆరు నెలలకు మించి వ్యవధి ఉండకూడదు. రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలను రాష్ట్రపతి ఏర్పాటు చేయాల్సి ఉండగా అందుకు భిన్నంగా ప్రభుత్వమే ప్రకటన చేయడం గమనార్హం.
అసలు రాజ్యాంగంలోని 85వ అధికరణలో ‘ప్రత్యేక’ సమావేశాల ప్రస్తావనే లేదు. అయితే సభా వ్యవహారాలకు సంబంధించిన రూల్‌ 3 ప్రకారం సమావేశాలకు హాజరు కావాల్సిందిగా సభ్యులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అత్యవసరంగా, తక్కువ వ్యవధిలో సమావేశాలు నిర్వహించాల్సి వస్తే ప్రతి ఒక్క సభ్యుడికీ విడివిడిగా సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడు, ఎక్కడ నిర్వహించాలన్న దానిపై గెజిట్‌లోనూ, పత్రికలలో నూ ప్రకటించాలి. ప్రహ్లాద్‌ జోషీ చేసిన ట్వీట్‌ను పరిశీలిస్తే సమావేశాలను తక్కువ వ్యవధిలో, అత్యవసరంగా నిర్వహిస్తున్నట్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రత్యేక సందర్భాలలో మాత్రమే…
ప్రభుత్వాలు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయ డానికి సంబంధించి రాజ్యాంగంలో ఎక్కడా ప్రస్తావన లేనప్పటికీ కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఉదాహరణ కు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 1998లో ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచారు. ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి కల్యాణ్‌ సింగ్‌, జగదాంబికా పాల్‌లలో ఎవరికి మెజారిటీ ఉన్నదో తేల్చడానికి ప్రత్యేక సమావేశం నిర్వహించాలని అప్పుడు సుప్రీంకోర్టు ఆదేశించింది. భారత స్వాతంత్య్ర స్వర్ణోత్సవాలను పురస్కరించు కొని 1997 ఆగస్ట్‌ 26 నుండి సెప్టెంబర్‌ 1వ తేదీ వరకూ పార్లమెంట్‌ ఉభయ సభలు ప్రత్యేకంగా సమావేశమయ్యాయి. 1975 జూన్‌ 21న పార్లమెంట్‌ ప్రత్యేక సమా వేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంలో ఇతర కార్యకలా పాలన్నింటినీ పక్కనపెట్టి కేవలం ప్రభుత్వ వ్యవహారాలను మాత్రమే చేపట్టారు. ఆ తర్వాత 1976 అక్టోబర్‌ 25న మరోసారి లోక్‌సభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఆ సమావేశంలో రాజ్యాంగానికి 42వ సవరణ బిల్లును ప్రతిపాదించారు. ఈ పరిణామా లన్నీ దేశంలో అత్యవసర పరిస్థితి అమలులో ఉన్న 19 నెలల కాలంలో జరిగినవే.ఇప్పుడు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలను ఎందుకు నిర్వహిస్తున్నదీ ప్రభుత్వం ప్రకటించి ఉంటే సభ్యులు ఆయా అంశాలపై ముందుగానే అవగాహనకు వచ్చే అవకాశం ఉండేది. తద్వారా సభలో అర్ధవంతమైన చర్చకు వీలు కలిగేది. కానీ ప్రభుత్వానికి ఆ ఉద్దేశమే ఉన్నట్లు కన్పించడం లేదు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి ఎంతమాత్రం మంచివి కావు. ఇది కచ్చితంగా చట్టసభను, రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే అవుతుంది.