ఎమ్మెల్యేను కాదా? సీతక్క లెటరెందుకు?

– అధికారులను ప్రశ్నించిన ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
స్థానిక అధికారులు పనిమీద వెళ్తే సీతక్క లెటర్‌ తీసుకుని రావాలంటున్నారనీ, తాను ఎమ్మెల్యేను కాదా? సీతక్క లెటరెందుకు తీసుకెళ్లాలని అని సిర్పూర్‌ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీతక్కను ములుగు ప్రజలు ఎలా ఎన్నుకున్నారో సిర్పూర్‌లో తనను ప్రజలు అలాగే ఎన్నుకున్నారన్నారు. స్థానిక అధికారులు తనకు సమాచారం ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టారు. అధికారుల తీరుపై గవర్నర్‌కు లేఖ రాశానని తెలిపారు. దీనిపై ఆయన చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. సిర్పూర్‌లో సీతక్క దందాలు మొదలు పెట్టిందని విమర్శించారు. దీనిపై సీతక్కకే బహిరంగ లేఖ రాశానని తెలిపారు. వందరోజులైనా హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల రుణమాఫీ చేయకుంటే సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. మోడీ హవాలో రేవంత్‌రెడ్డి సర్కారు కొట్టుకుపోతుందన్నారు.