– చేవెళ్లలో కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించాలి
– బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
– పార్టీ మారిన నాయకులను.. శిక్షించాల్సిన బాధ్యత కార్యకర్తలదే
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
పార్టీ మారిన నాయకులను శిక్షించాల్సిన బాధ్యత కార్యకర్తలే తీసుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వికారాబాద్ జిల్లా చేవెళ్లలో నిర్వహించిన చేవెళ్ల పార్లమెంటు విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీకి ద్రోహం చేశారని విమర్శించారు. మంత్రి కావాలని రాజకీయల్లోకి వచ్చినప్పటి నుంచి కలలు కన్నారని, ఆ కలను మాజీ సీఎం కేసీఆర్ నెరవేర్చి.. ఒకసారి కాదు రెండు సార్లు మంత్రిగా అవకాశం కల్పించారని తెలిపారు. చేవెళ్ల ప్రజలకు అనామకుడైన రంజిత్‌రెడ్డిని కేసీఆర్ ఎంపీగా గెలిపించారని, అయినా వారు పార్టీకి ద్రోహం చేసి మరో పార్టీలోకి వెళ్లారని, ఆ ఇద్దరిని శిక్షించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిగా పోటీ పడేందుకు ముందుకు వచ్చిన కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. రంజిత్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఇక్కడి ప్రజలను తక్కువ అంచనా వేస్తున్నారని, మోడీ, రేవంత్‌రెడ్డి దొరికారని వీళ్లు సంబురపడిపోతున్నారని తెలిపారు. వంద రోజుల కాంగ్రెస్ పాలనలో జరిగిన వైఫల్యాలు, ప్రభుత్వ మోసాలను, కరువు తదితర విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పరిగి సమావేశంలో మహేందర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి డ్రామాలు చేశారని తెలిపారు. యాక్టింగ్‌కు ఆస్కార్ వారికే ఇవ్వాలని తెలిపారు. కేసీఆర్‌ను, పార్టీని మోసం చేసిన వాళ్లకు బుద్ధి చెప్పాలన్నారు. రాముడిని మొక్కుదాం.. బీజేపీని తొక్కుద్దామన్నారు. ఒక్క మెడికల్ కాలేజీ, నవోదయ పాఠశాల ఇవ్వని, రైతుల ఆదాయం డబుల్ చేస్తానని చెప్పి మోసం చేసిన బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. రూ. 70 ఉన్న పెట్రోలను రూ. 110 చేసినందుకు, డీజిల్ రేట్లు పెంచినందుకు, సిలిండర్ రేట్లు పెంచినందుకు, పప్పు, ఉప్పులు ధరలు పెంచినందుకు బీజేపీకి ఓటు వేయాలా అని ప్రశ్నించారు. డిసెంబర్ 9న రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పాడు కానీ ఇప్పటికి అమలు చేయలేదని విమర్శించారు.
మల్కాజ్‌గిరిలో పోటీకి రమ్మంటే ఇప్పటికీ రేవంత్‌రెడ్డి నుంచి స్పందన లేదని, ఓడిపోతామని రేవంత్‌కు తెలుసని, అందుకే మల్కాజ్‌గిరి, చేవెళ్లలో డమ్మీ అభ్యర్థులను పోటీలో పెట్టారని విమర్శించారు. చేవెళ్లలో బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల మధ్యనే పోటీ అని తెలిపారు. రేవంత్.. నువ్వు మగాడివైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేరవేర్చాలని, మహిళలకు ఇస్తానన్న రూ.2,500 ఇవ్వాలని, రుణమాఫీ చెయ్యాలని, అవ్వ, తాతలకు రూ. 4 వేలు ఇవ్వాలని, పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హౌదా తీసుకురావాలని కేటీఆర్ సవాల్ విసిరారు.