ఏం చూసి మోడీకి ఓటేయాలి?

What did Modi see? vote?– పదేండ్లుగా రాష్ట్రానికి చేసిందేమి లేదు
– ఆర్‌ఆర్‌ఆర్‌ అడ్డుకుంటున్నారు
– మూసీ రివర్‌ ఫ్రంట్‌ నిధులివ్వలేదు : చేవెళ్ల నియోజకవర్గ సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్‌ ఆగ్రహం
– నేడు ఢిల్లీకి సీఎం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
పదేండ్లుగా రాష్ట్రానికి ప్రధాని మోడీ ఏం చేశారని సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఏం చూసి బీజేపీకి ఓటేయాలని ఆయన నిలదీశారు. రాష్ట్రానికి వరప్రదాయిని అయిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు బీజేపీ పూర్తి చేయలేదని విమర్శించారు. బుల్లెట్‌ ట్రైన్‌ను గుజరాత్‌కు తీసుకెళ్లిన మోడీ, వికారాబాద్‌కు ఎంఎంటీఎస్‌ రైలు ఎందుకు తీసుకరాలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధికి నిధులు ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రానికి రీజనల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) రాకుండా బీజేపీ ఎందుకు మోకాలడ్డుతున్నదని ప్రశ్నించారు. బీజేపీ నేతల వ్యవహారం ఎలా ఉందంటే, ‘పెండ్లి పెద్దను చూసి పిల్లనివ్వాలన్నట్టుంది’ అని ఎద్దేవా చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన ముఖ్యనాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం జరుగుతుందని భరోసానిచ్చారు. రాష్ట్రంలో 17 పార్లమెంట్‌ స్థానాల్లో 14 సీట్లను గెలవాలని మరోసారి పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో అందరి అభిప్రాయాలు, సర్వేల ఆధారంగానే పార్టీ అధిష్టానం అభ్యర్థులను ఎంపిక చేస్తున్నదని తెలిపారు. చేవెళ్ల, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి నియోజకవర్గాలకు ఒకదానికొకటి సంబంధం ఉందన్నారు. అన్ని రకాలుగా ఆలోచించే చేవెళ్లలో రంజిత్‌ రెడ్డి, మల్కాజిగిరికి సునీతా మహేందర్‌ రెడ్డి, సికింద్రాబాద్‌కు దానం నాగేందర్‌ను అభ్యర్థులుగా ప్రకటించిందని గుర్తు చేశారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపు రాష్ట్ర ప్రభుత్వ వంద రోజుల పరిపాలనకు రెఫరెండం అని తెలిపారు. తెలంగాణలో 14 పార్లమెంట్‌ స్థానాలను గెలిచి సోనియమ్మకు కృతజ్ఞతలు చెబుదామని తెలిపారు. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఇది చక్కని అవకాశమని గుర్తు చేశారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటేనే ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. కార్యకర్తలకు అండగా నిలబడేందుకు, దేశాన్ని కాపాడుకునేందుకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ వేల కిలోమీటర్లు నడిచారని తెలిపారు. పార్టీకి అండగా నిలబడి సోనియమ్మ నాయకత్వాన్ని బలపరచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు తుక్కుగూడ రాజీవ్‌ గాంధీ ప్రాంగణంలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఆరు గ్యారంటీలను ప్రకటించుకున్నామని గుర్తు చేశారు. ఏప్రిల్‌ 6 లేదా 7న మళ్లీ అక్కడే జాతీయస్థాయి గ్యారంటీలను ప్రకటించబోతున్నట్టు తెలిపారు. రంగారెడ్డి జిల్లా నుంచే దేశ రాజకీయాలకు శంఖారావం పూరించబోతున్నామని చెప్పారు. ఈ జనజాతర సభకు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే హాజరవుతారని తెలిపారు. ఇదిలా వుండగా మిగతా ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు బుధవారం సీఎం ఢిల్లీకి వెళ్లనున్నారు.
29న టీపీసీసీ కార్యవర్గ సమావేశం  సీఎం రేవంత్‌తో మహేష్‌కుమార్‌ భేటీ
పార్లమెంటు ఎన్నికలు, తుక్కుగూడ బహిరంగ సభ తదితరాంశాలపై చర్చించేందుకు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌గౌడ్‌ సీఎం రేవంత్‌తో మంగళవారం భేటీ అయ్యారు. ఈనెల 29న టీపీసీసీ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రితోపాటు ఏఐసీసీ ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు, సీనియర్‌ నాయకులు హాజరుకానున్నారు.