గాంధీజీని ఎందుకు చంపినట్లు?

గాంధీజీని ఎందుకు చంపినట్లు?మహాత్మ గాంధీని మతోన్మాదులు పొట్టన పెట్టుకొని 75 ఏండ్లు పూర్తిగానుంది. 1948 జనవరి 30వ తేదీన ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూ మహాసభ అనుచరులైన నాథురాం గాడ్సే, నారాయణ్‌ ఆప్టేల బృందం కుట్ర చేసి గాంధీజీని దేశ రాజధాని ఢిల్లీలో హత్య చేసింది. ఆ కుట్రలో వినాయక్‌ రావు దామోదర్‌ సావర్కర్‌ కూడా ఉన్నారని పోలీసులు ఆయన్ని బోనెక్కించినా సమగ్ర దర్యాప్తు జరగని కారణంగా ఆయన బయటపడినట్లు అప్పటి పోలీసు ఉన్నతాధికారులు ఆ తర్వాత చెప్పారు.
దేశవిభజన సందర్భంగా పంజాబ్‌, బెంగాల్‌ రాష్ట్రాల్లో జరిగిన మారణకాండలో వేలకు వేల హిందువులు, సిక్కులు, ముస్లింలు నిరాశ్రయులయ్యారు, మరణించారు. ఆ మారణకాండ రాజధాని ఢిల్లీకి కూడా చేరింది. శాంతి భద్రతల కోసం చేసిన విజ్ఞప్తులు ఫలించలేదు. ద్వేషాగ్నులను చల్లబర్చడానికి గాంధీజీ మొదట నైఖాళీలో ఆ తర్వాత ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వెనువెంటనే చేసిన ఆ రెండు నిరాహార దీక్షల వల్ల ఏర్పడిన బలహీనత నుండి గాంధీ పూర్తిగా కోలుకోలేదు. మను, తను భుజాలపై చేతులు వేసి అడుగులలో అడుగేసుకొంటు బిర్లా హౌస్‌లోని ప్రార్ధనా వేదిక వైపు నడుస్తుండగా ఆయనకు అతి దగ్గరగా వచ్చిన గాడ్సే తుపాకితో మూడు సార్లు కాల్పులు జరిపాడు. ‘హే రాం’ అంటూ నేలకొరిగారు. శారీరకంగా బలహీనంగా ఉన్న గాంధీజీ ప్రాణాలు అనంత వాయువుల్లో కలవడానికి అట్టే సమయం పట్టలేదు. గాంధీజీ హత్యకు అవసరమైన డబ్బులు ఎలా సేకరించిందీ, దేనికెంత ఖర్చు చేసింది పక్కాగా రాసుకున్న పాకెట్‌ నోటు బుక్కు ఘటనా స్థలంలోనే గాడ్సే జేబులో దొరికింది. పోలీసులు ఆ నోట్‌బుక్‌ ద్వారా కొద్ది సమయంలోనే ఆ కుట్రలో పాల్గొన్నా బృందాన్నంతటినీ అరెస్టు చేశారు.
కోపోద్రిక్తులైన ప్రజలు తెల్లవారేలోగా ఆర్‌ఎస్‌ఎస్‌ ఆఫీసులపై, బొంబాయిలోని ప్రజలు సావర్కర్‌ సదన్‌పై దాడి చేశారు. పోలీసులు వేగంగా స్పందించడం వల్ల సావర్కర్‌, అలాగే లిమాయే వంటి ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖులు బతికి పోయారు. గాడ్సే తల్లిదండ్రులను జిల్లా కలెక్టర్‌ కాపాడారు.
గోద్రాలో జరిగిన ఘోర ఉదంతం అనంతరం ఆనాటి గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ దేశ ప్రధానిగా ఉండిన అటల్‌ బిహారి వాజ్‌పేయి వ్యవహరించిన తీరుకు; గాంధీ హత్య జరిగిన నాడు బొంబాయి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండిన మొరార్జీ దేశాయి, భారత ప్రధానిగా ఉండిన జవహార్‌ లాల్‌ నెహ్రూ శాంతి భద్రతల రక్షణ కోసం స్పందిన తీరుకు మధ్య ఎలాంటి పోలికా లేదు. ఇందిరా గాంధీ హత్య తర్వాత ఢిల్లీలో జరిగిన మారణకాండ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకత్వం వ్యవహరించిన తీరు కూడా దుర్మార్గమైంది. గాంధీజీ హత్యకేసును లాల్‌ ఖిలాలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి విచారించారు. గాడ్సే, ఆప్టేలకు మరణశిక్ష పడింది. సావర్కర్‌ మినహాయించి మిగతా నిందితులందరికీ శిక్షలు పడ్డాయి. కింది కోర్టు తీర్పును గాడ్సే బృందం అంబాలలో ఆనాటి పంజాబ్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. హైకోర్టు కింది కోర్టు తీర్పును ధృవపర్చింది.
తను అరెస్టయ్యాక సావర్కర్‌ ఒక్కసారి కూడా తనవైపు కనీసం చూడలేదని గాడ్సే చాలా బాధపడ్డాడు. ఆ బాధను పలు మార్లు తన న్యాయవాదితో గాడ్సే చెప్పుకున్నాడు. గాంధీజీ హత్య గర్హనీయమని అప్పటి ఆర్‌ఎస్‌ఎస్‌ అధినాయకుడు గోల్వాల్కర్‌ ఆలస్యం చేయకుండా ప్రకటించారు. గాడ్సే ఆ సమయంలో తమ సభ్యుడు కాదని చెప్పారు. కాని ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యత్వ రికార్డులను నిర్వహించిన సంస్థ నాగ్‌పూర్‌ లోని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయాన్ని సోదా చేసినప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌ ముఖ్య నాయకుల సమావేశంలో గాడ్సె పాల్గొన్నట్లు మినిట్స్‌లో లభించింది.
తమ రెండవ ప్రయత్నంలో గాడ్సే బృందం గాంధీజీని హత్యచేయగల్గింది. మొదటి ప్రయత్నానికి బయల్దేరే ముందు గాడ్సే, ఆప్టేలు పూనా నుండి తమ బృందంతో ముంబాయికి వచ్చి హిందు మహాసభ ఆఫీసులో సావర్కర్‌ను విడిగా కలిసినట్లు సాక్ష్యాలు ఉన్నాయి. వారిని సాగనంపుతూ సావర్కర్‌ జయీభవ అని దీవించినట్లు, ఆ ముసలాడికి నూకలు చెల్లాయని వాఖ్యానించినట్లు మాత్రం పోలీసులకు సాక్ష్యం దొరికింది. స్వాతంత్య్ర సమర యోధుడిగా అండమాన్‌ జైలుకు వెళ్లిన సావర్కర్‌ బ్రిటిష్‌ ప్రభుత్వం పెట్టిన క్షమాభిక్షతో జైలు నుండి బయటికి వచ్చాడు. క్షమాభిక్ష దరఖాస్తులో ఇచ్చిన హామీ మేరకు ఆయన బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటాల్లో పాల్గొనలేదు. తనను జైలు నుండి విడిపించడంలో ప్రధాన పాత్ర వహించిన మూంజే అధ్యక్షతన ఉన్న హిందూ మహాసభలో చేరాడు. మూంజే తర్వాత సావర్కర్‌ హిందూ మహాసభ అధ్యక్షుడయ్యారు.
సావర్కర్‌ రత్నగిరి జిల్లా నుండి బయటికి వెళ్లరాదన్న ఆంక్షలు వైదొలిగాక అప్పటి ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థాపక అధినేత హెడ్గేవార్‌ మహారాష్ట్ర అంతటా సావర్కర్‌కు స్వాగత సభలు ఏర్పాటు చేసి బ్రహ్మరథం పట్టారు. ఆర్‌ఎస్‌ఎస్‌ యంత్రాంగాన్నంతా ఆ పనిలోకి దించారు. తాను స్వయంగా కొన్ని సభలల్లో పాల్గొన్నారు. మూంజే తన పర్యటన సందర్భంగా, ఇటలీ వెళ్లి ఫాసిస్టు నాయకుడు ముస్సోలినీని, ఆయన ఇతర సహచరులను కలిసి స్ఫూర్తి పొందారు. స్వాతంత్య్రోద్యమంలో ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూ మహాసభలు రెండూ పాల్గొనలేదు. ఇప్పుడు సావర్కర్‌ను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నెత్తిన పెట్టుకొంది. అండమాన్‌ విమానాశ్రయానికి సావర్కర్‌ పేరు పెట్టింది. పార్లమెంట్‌లో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించింది.
జాతిపిత చివరి మాట ‘హేరాం’లో బాధ, వేదన ఉంది. కష్ట సమయాల్లోనూ హేరాం, లేదా రామా అని తలచుకోవడం హిందువులకు అలవాటు. కాని బిజెపి అండ్‌ కంపెనీ ఎంచుకొన్న ‘జై శ్రీరాం’ నినాదంలో బాధలేదు, భక్తి లేదు. కసి మాత్రమే ఉంది. ఈ కసి ఎవరి మీద అంటే దేశపౌరుల్లో భాగమైన ముస్లిం, క్రైస్తవుల మీద. అవి విదేశీ మతాలని, వాటికి దేశంలో స్థానం లేదని అంటారు. దేశీమతాలైన జైనం, బౌద్ధాలను వారేదో ఉద్దరించారనుకొంటే అదీలేదు. శాంతి కాముకులైన భారతీయులను రెచ్చగొట్టడానికి ‘జై శ్రీరాం’ నినాదాన్ని వారు వాడుకొంటున్నారు. ఇంతకూ గాంధీజీ చేసిన పాపం ఏమిటంటే భారతీయులందరినీ స్వాతంత్య్ర పోరాటంలో ఒక తాటిమీదికి తేవడమే. ఆ తాడునే ఆర్‌ఎస్‌ఎస్‌ హిందూ మహాసభలు మహాత్ముడిని చంపడానికి వాడాయి. గాంధీజీ ముస్లింలను సంతృప్తి పరచడానికే దేశ విభజనకు ఒప్పుకొన్నారని నేరం మోపాయి. భారతదేశంలో హిందూ, ముస్లింలు రెండు జాతులున్నాయని మొదట చిచ్చు పెట్టింది సావర్కరే. చాలాకాలం తర్వాత దాన్ని అంది పుచ్చుకొంది మహ్మదలీ జిన్నా. గాంధీజీ తనను తాను సనాతన హిందువునని చెప్పుకొన్నా మత సామరస్యం కోరేవాడు. హిందూమతానికి తామే సోల్‌ ఏజెంట్‌ అని భావించిన వారికి గాంధీజీ ప్రమాదకరగా కన్పించాడు. గాంధీజీ వర్ణాశ్రమ ధర్మాన్ని నమ్మేవాడు. ఆ విషయం బహిరంగంగానే చెప్పేవాడు. నిజానికి వర్ణాశ్రమ ధర్మం ప్రకారం అయితే గాంధీజీ నాయకత్వానికి పనికి రానివాడు. అలాంటి వ్యక్తి బాలగంగాధర తిలక్‌ నుండి కాంగ్రెస్‌ నాయకత్వాన్ని స్వీకరించారు. బ్రాహ్మణాధిపత్యం కోరే వారికి అది సహజంగానే ప్రమాదకరంగా కన్పించేది. పూనాలోని తిలక్‌ స్మారక మందిరం హిందూ మహాసభ గాంధీజీ వ్యతిరేకులకు అడ్డుగా మారడం కాకతాళీయం కాదు.