– శ్రీలంక సుప్రీం కోర్టు రూలింగ్
కొలంబో : స్థానిక ఎన్నికలను ఏడాదికి పైగా నిర్వహించకుండా జాప్యం చేస్తూ వచ్చి చట్టవిరుద్ధంగా వ్యవహరించినందుకు శ్రీలంక అధ్యక్షుడు రనీల్ విక్రమసింఘె దోషి అని శ్రీలంక సుప్రీం కోర్టు నిర్ణయించింది. అయితే ఆయన అధ్యక్షుడిగా అధికారంలో వున్నందున ఆయనకు గల రక్షణ దృష్ట్యా ఈ తీర్పు వల్ల తక్షణమే ఎలాంటి చట్టపరమైన పర్యవసానాలు వుండవు. 2023 మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కావాల్సిన నిధులు విడుదల చేయడంలో విక్రమసింఘె విఫలమయ్యారని ఐదుగురు సభ్యుల సుప్రీం కోర్టు ధర్మాసనం గురువారం ఏకగ్రీవంగా తీర్పు చెప్పింది. కాగా వచ్చే నెల్లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో దేశ ఆర్థిక పరిస్థితులు, ఓటర్లకు కీలకాంశంగా మారుతుందని భావిస్తున్నారు. స్థానిక ఎన్నికలు వాయిదా పడినందున, సెప్టెంబరు 21న జరిగే ఎన్నిక ఈ ప్రభుత్వ మొదటి ఎన్నికలు కానున్నాయి. విక్రమసింఘె ఈఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ప్రత్యర్ధుల నుండి గట్టి సవాలు ఎదుర్కొంటున్నారు.