భార్య ఆత్మహత్య

– ఆగ్రహంతో భర్తను కొట్టి చంపిన అత్తింటివారు
నవతెలంగాణ – కందనూలు
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకోగా.. అందుకు భర్తనే కారణమంటూ అత్తింటివారు అతన్ని కొట్టి చంపారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లాలో జరిగింది. అచ్చంపేట ఎస్‌ఐ గోవర్ధన్‌ తెలిపిన వివరాలు ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం చెన్నంపల్లి గ్రామానికి చెందిన సింధు(26), ఖమ్మం జిల్లాకు చెందిన నాగార్జున(30) మూడేండ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. నాగార్జున అచ్చంపేటలోని శ్రీరామ్‌ సరియన్‌ పనిచేస్తున్నాడు.
అచ్చంపేట మండల కేంద్రంలో నివాసం ఉంటున్నారు. కొద్దిరోజులుగా ఇద్దరి మధ్య గొడవలు అయ్యాయి. క్రమంలో శుక్రవారం రాత్రి సింధు ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కొన ఊపిరితో ఉన్న ఆమెను అచ్చంపేటలోని ప్రయివేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం నాగర్‌కర్నూల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. దాంతో ఆగ్రహానికి గురైన ఆమె కుటుంబీకులు సింధు భర్త నాగార్జును వాహనంలోనే తీవ్రంగా కొట్టారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా ఆమనగల్‌ సమీపంలోకి రాగానే అతను మృతిచెందాడు. తమ కూతురు ఆత్మహత్యకు నాగార్జున కారణమని, ఆయనకు డాక్టర్‌ కృష్ణ, అతని భార్య అండగా ఉన్నారనిమృతురాలి తల్లి ఆరోపించింది. అచ్చంపేట ఎస్‌ఐ గోవర్ధన్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.