ఉద్యోగాల పేరిట భర్త మోసం.. భార్యకు శిక్ష

ఉద్యోగాల పేరిట భర్త మోసం.. భార్యకు శిక్ష– గుడిలో బంధించి కొట్టిన బాధితులు
– చోద్యం చూసిన పోలీసులు!
నవతెలంగాణ-సూర్యాపేట
మెడికల్‌ కళాశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 40 మంది దగ్గర రూ.63 లక్షలు తీసుకుని మోసం చేసిన ఘటనలో నిందితుడు పరారీలో ఉండటంతో బాధితులు అతని భార్యను బంధించారు. గుడిలోకి తీసుకొచ్చి చిత్రహింసలకు గురి చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో బుధవారం జరిగింది. బాధితులు తెలిపిన వివరాలిలా ప్రకారం..పట్టణంలోని కృష్ణటాకీస్‌ ముత్యాలమ్మ బజార్‌లో నివసిస్తున్న సతీశ్‌ మెడికల్‌ కాలేజీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని దాదాపుగా 40 మంది దగ్గర రూ.63 లక్షలు తీసుకున్నాడు. అనంతరం వారికి మాయమాటలు చెబుతూ వచ్చాడు. ఇటీవల బాధితులు డబ్బులు తిరిగి ఇవ్వాలని సతీశ్‌ని నిలదీశారు. తాను ఆఫీస్‌లో మరో వ్యక్తికి డబ్బులు ఇచ్చానని, తప్పకుండా ఉద్యోగాలు వస్తాయని చెప్పాడు. ఇలా రోజులు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడంతో బాధితులు మోసపోయామని గ్రహించి బుధవారం సతీశ్‌ నివాసానికి వచ్చారు. అతడు ఇంట్లో లేకపోవడంతో సతీశ్‌ భార్య కల్యాణిని ముత్యాలమ్మ ఆలయానికి తీసుకెళ్లి డబ్బుల గురించి నిలదీశారు. ఆమె తనకు తెలియదని చెప్పినా వినకుండా ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు. చిత్రహింసలు పెట్టారు. డబ్బులు ఇస్తామని హామీ పత్రం రాయాలని ఆమెపై ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకుని బాధితులకు సర్దిచెప్పినా కల్యాణిని విడిచి పెట్టలేదు. డబ్బులు ఇచ్చేవరకు ఆమెను విడిచి పెట్టబోమని చెప్పడంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లి పోయారు. కాగా రాత్రి వరకు కల్యాణిని గుడిలోనే ఉంచి.. తమ డబ్బులు సెటిల్మెంట్‌ చేయాలని వాదోపవాదాలకు దిగారు.