తాము అందించిన ఆయుధాలతో రష్యా మీద పరిమిత దాడులు చేయవచ్చని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్‌కు అధికారమిచ్చాడు. దీని గురించి ఎలాంటి ఆర్భాటం లేకుండా అమెరికా చూసింది. ఎప్పటి నుంచో జెలెన్‌స్కీ ఈ మేరకు నాటో కూటమి దేశాలకు విన్నవించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఉక్రెయిన్ భూభాగం మీద మిలిటరీ చర్యకు దిగిన రష్యా మిలిటరీని ఎదుర్కొనేందుకు మాత్రమే నాటో ఆయుధాలను వినియోగిస్తు న్నారు. బైడెన్ నిర్ణయానికి ముందు ఫ్రెంచి నేత మక్రాన్, కెనడాతో సహా పన్నెండు దేశాలు కూడా అదే పద్ధతిలో అనుమతులు ఇచ్చినట్లు వార్తలు. దాని ప్రకారం రష్యా భూ భాగాలపై ఉక్రెయిన్ దాడులు చేయటానికి వీలుకలుగుతుంది. నిజంగా అదే జరిగితే ఏ పరిణామాలు, పర్యవసానాలకు దారితీస్తుందో చూడాల్సి ఉంది. నాటో ఆయుధాలతో దాడులు జరిపితే ఆ కూటమి దేశాలు ప్రత్యక్షంగా దాడులకు దిగినట్లుగానే పరిగణిస్తామని గతంలోనే రష్యా అధినేత పుతిన్ ప్రకటించాడు. కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను దెబ్బతీసే క్షిపణులను ఇప్పటికే అందచేయటమే గాక వాటి ప్రయోగానికి అవసరమైన శిక్షణ కూడా ఇస్తున్నారు. ఇప్పటికే క్రిమియా ప్రాంతంపై ప్రయోగించిన క్షిపణులను మధ్యలోనే అడ్డుకొని రష్యా కూల్చివేసింది. దీర్ఘ శ్రేణి క్షిపణులకు అనుమతి ఇవ్వలేదని అమెరికా చెబుతోంది.డ్రోన్లు, యుద్ద విమానాలను కూడా ఉక్రెయిన్‌కు సరఫరా చేశారు.ఎఫ్16 విమానాలను ప్రయోగించాలంటే అవసరమైన రన్‌వేలు ఉక్రెయిన్‌లో లేవు. వాటిని నిర్మిస్తే రష్యా చూస్తూ ఊరుకొనే అవకాశాలు లేవు.
పశ్చిమ దేశాల నిర్ణయాలు, కదలికల గురించి రష్యా అప్రమత్తమవుతోంది. ఒక వేళ నాటో కూటమి దేశాలు గనుక తమపై దాడులకు తెగిస్తే అది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని పుతిన్ హెచ్చరికలు జారీ చేశాడు. అలాంటి పరిస్థితే వస్తే ఒక్క రోజులోనే బ్రిటన్, ఫ్రాన్స్ వద్ద ఉన్న అణ్వాయుధాల సామర్ధ్యాన్ని దెబ్బతీయగలమని రష్యా మిలిటరీ నిపుణుడు యూరీ బరాన్‌చిక్ చెప్పినట్లు మిర్రర్ పత్రిక రాసింది. అణ్వాయుధాల సామర్ధ్యం ఉన్న దేశాల సంఖ్య తొమ్మిది నుంచి ఏడుకు తగ్గుతుంది అని కూడా చెప్పాడు. ముందు జాగ్రత్తగా పెద్ద పట్టణాలలో సంచార అణు రక్షణ ఏర్పాట్లు చేస్తున్నట్లు నాటో దేశాల పత్రికలు రాస్తున్నాయి.నిజంగా మూడవ ప్రపంచ యుద్ధం వస్తుందా? రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన కొద్ది కాలానికే అనేక మంది పండితులు మూడవ ప్రపంచ యుద్దం గురించి చెప్పటం మొదలు పెట్టారు.అనేక కుట్ర సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు వలసల ఆక్రమణలో మొదలైన పోటీ ఐరోపా యుద్ధాలకు దారితీసింది. ఫ్రెంచి సామ్రాజ్యవాది నెపోలియన్ బోనపార్టీ 1804 నుంచి ఓటమిపాలైన చివరి యుద్ధం 1815 వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు యుద్ధాలు చేశాడు. తరువాత వంద సంవత్సరాలకు మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది. పాత్రలోని నీరు మరిగి వంద డిగ్రీలకు చేరుకున్న తరువాత ఆవిరిగా రూపాంతరం చెందినట్లు ఏదైన ఒక ప్రధాన పరిణమానికి ముందు అంతర్గతంగా ఎన్నో జరుగుతాయి. అనూహ్య పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి.
1871లో పునరేకీకరణ తరువాత జర్మనీ చర్యల వలన అప్పటి వరకు ఉన్న బలాబలాల్లో నాటకీయ మార్పులు చోటు చేసుకున్నాయి. ఆస్ట్రియా-హంగరీ, ఇటలీతో జర్మనీ జట్టుకట్టింది. దాంతో జర్మనీని అడ్డుకొనేందుకు ఫ్రాన్స్- జారిస్టు రష్యా ఒక్కటయ్యాయి. అప్పటి వరకు ఈ రెండు దేశాల నుంచి తమకు ముప్పు ఉందని భావించిన బ్రిటన్ ఆకస్మికంగా జర్మనీ నుంచి వచ్చిన సవాలును ఊహించలేకపోయింది. ఉప్పు-నిప్పుగా ఉన్న బ్రిటన్- ఫాన్స్ 1904లో సయోధ్య కుదుర్చుకున్నాయి.దేశాల ఆక్రమణలపై సహకరించు కున్నాయి. ఆఫ్రికాలోని మొరాకోను ఫ్రాన్స్ ఆక్రమించగా జర్మనీ వ్యతిరేకించింది, బ్రిటన్ మద్దతు ఇచ్చింది.రష్యా,బ్రిటన్, ఫ్రాన్సు కూటమి గట్టటం తమకు ప్రమాదమని జర్మనీ భావించింది. ఐరోపా రెండు శిబిరాలుగా తయారైంది. జర్మనీ ప్రోద్బలంతో సెర్బియాపై ఆస్ట్రియా-హంగరీ 1914లో యుద్దం ప్రకటించగా రష్యా వ్యతిరేకించింది.ఫ్రాన్సు కూడా సెర్బియాకు మద్దతు ఇచ్చింది. తటస్థంగా ఉన్న బెల్జియం మీద జర్మనీ యుద్ధం ప్రకటించటంతో ఐరోపాలో దాని ఆధిపత్యం పెరిగిపోతుందనే భయంతో బ్రిటన్ కూడా యుద్ధంలోకి దిగింది. ఇదంతా మూడున్నర దశాబ్దాల మధనం తరువాత జరిగింది. వైరుధ్యాలు పెరగటంతో మొదటి యుద్ధం తరువాత రెండవ ప్రపంచ యుద్ధం రెండుదశాబ్దాల్లోనే వచ్చింది. అది ముగిసి ఎనిమిది దశాబ్దాలైంది. ప్రస్తుతం ప్రపంచం లో జరుగుతున్న పరిణామాలను చూసి కొందరు రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు 1930వ దశకంలో ఉన్న పరిస్థితి ఉందని అది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని చెబుతున్నారు.
అలాంటి వారి వాదనల ప్రకారం ఒక వైపు అమెరికా నాయకత్వంలోని నాటో కూటమి, ఇతర కొన్ని దేశాలు సమీకృతం అవుతున్నాయి. మరోవైపు చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా జట్టుకడుతున్నాయి. ఐరోపాలో అమెరికా, నాటో కూటమి కారణంగా ఉక్రెయిన్ రూపంలో వైరుధ్యం నడుస్తున్నది.రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు 1936-39 స్పెయిన్లో అంతర్యుద్ధం జరిగింది. మిలిటరీ తిరుగుబాటును ఫాసిస్టు జర్మనీ, ఇటలీ సమర్ధించగా మిలిటరీని వ్యతిరేకించిన శక్తులకు సోవియట్ యూనియన్ మద్దతు ఇచ్చింది. అమెరికా కూడా బాసటగా నిలిచింది. ఇప్పుడు ఉక్రెయిన్‌లో జరుగుతున్న సైనిక చర్యను పశ్చిమదేశాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. చైనా తటస్థంగా ఉన్నప్పటికీ రష్యాకు అవసరమైన ఆర్థిక మద్దతిస్తున్నది. ఇరాన్, ఉత్తర కొరియా ఆయుధాలు అందచేస్తున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌కు మద్దతుగా నాటో దేశాలు సైనికులను పంపితే పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ముందుకు వస్తున్నది. గాజాలో జరుగుతున్న మారణకాండపై పశ్చిమ దేశాలు ఇజ్రాయిల్‌కు మద్దతు ఇస్తుండగా, మిగిలిన దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్ చైనాలో అంతర్భాగమని అంగీకరిస్తూనే విలీనానికి తగిన తరుణం ఆసన్నం కాలేదని పశ్చిమ దేశాలు విలీనాన్ని వ్యతిరేకించే శక్తులకు ఆయుధాలు అందచేస్తున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో కొన్ని దేశాలను రెచ్చగొట్టి చైనాతో కవ్వింపునకు పూనుకున్నాయి. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఫిలిప్పైన్స్ సంయుక్తంగా మిలిటరీ విన్యాసాల పేరుతో బల ప్రదర్శన చేశాయి.
గతంలో దేశాలను ఆక్రమించుకొనేందుకు పోరు జరగ్గా ఇప్పుడు అలాంటి అవకాశం లేకపోవటంతో మార్కెట్లను ఆక్రమించుకొనేందుకు చూస్తున్నారు.దానికి అనుగుణంగానే పెట్టుబడిదారీ దేశాలు ముందుకు తెచ్చిన ప్రపంచీకరణ. అది కూడా వాటికి ఆశించిన మాదిరి లాభాలు తేలేదు.దాన్ని పక్కన పెట్టి రక్షణాత్మక చర్యలకు తెరలేపారు. వాటిలో ఒకటే దిగుమతి పన్నుల వడ్డింపు, దీన్నే వాణిజ్య యుద్దం అని కూడా అంటున్నారు. దీనికి అనుబంధంగానే సాంకేతిక పరిజ్ఞాన బదిలీని అడ్డుకొనేందుకు సాంకేతిక యుద్ధాన్ని కూడా ప్రారంభించారు. వాణిజ్య ఆంక్షల కారణంగా ఆర్థిక వ్యవస్థలు మరింత దగ్గర కావటానికి బదులు దూరం జరుగుతున్నాయి. కొత్త సమస్యలు, సవాళ్లను ముందుకు తెస్తున్నాయి. ఆంక్షల కారణంగా దీర్ఘకాలంలో ప్రపంచ ఆర్థిక ఉత్పత్తి ఏడు శాతం లేదా 7.4లక్షల కోట్ల డాలర్లమేరకు తగ్గుతుందని గతేడాది ఆగస్టులో ఒక అంచనా వెలువడింది.2019 తరువాత వాణిజ్య ఆంక్షలు మూడింతలు పెరిగి 2022 నాటికే మూడువేలకు పెరిగినట్లు ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జియేవా పేర్కొన్నారు.
డోనాల్డ్ ట్రంప్ చైనా మీద ప్రారంభించిన యుద్ధాన్ని జో బైడెన్ కూడా కొనసాగించాడు. ఉక్రెయిన్ వివాదంతో రష్యా మీద వాణిజ్య ఆంక్షలను అమలు జరుపుతున్న సంగతి తెలిసిందే. అణుకార్యక్రమాన్ని కొనసాగిస్తున్నదనే సాకుతో ఇరాన్‌పై అంతకు ముందు నుంచే ఆంక్షలు ఉన్నాయి. పశ్చిమ దేశాలు చైనా మీద ఒక వైపు ఆధారపడుతూనే మరోవైపు దాన్ని దెబ్బతీసేందుకు చూస్తున్నాయి. ఈ నేపధ్యంలో తన ఉత్పత్తులకు చైనా కొత్త మార్కెట్లను వెతుకుతోంది.వర్ధమాన, పేద దేశాల మీద ఎక్కువగా కేంద్రీకరిస్తోంది. డాలరుకు బదులు ప్రత్యామ్నాయ నగదు లావాదేవీలను ముందుకు తెచ్చేందుకు అనేక దేశాలు చూస్తున్నాయి. పరిస్థితులు ఆందోళనకర స్థాయికి చేరినట్లు చెప్పలేము గానీ ఆందోళన కలిగిస్తున్నాయని, ప్రపంచదేశాలు అమెరికా, చైనా, అలీనదేశాల కూటములుగా చీలిపోతున్నాయని ఐఎంఎఫ్ అధికారిణి గీతా గోపినాధ్ చెప్పారు. తగ్గుతున్న తన పట్టు నిలుపుకొనేందుకు అమెరికా చూస్తుండగా, చైనా, రష్యా దాన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా విజయం సాధిస్తే ఇతర దేశాల మీద కేంద్రీకరిస్తాడంటూ పుతిన్ గురించి పశ్చిమదేశాలు రెచ్చగొడుతున్నాయి.
ప్రపంచంలో కొన్ని పరిణామాలు ఆందోళన కలిగిస్తున్న ప్పటికీ అవి ప్రపంచ యుద్ధానికి దారితీసేవిగా లేవన్నది ఒక అభిప్రాయం. రెండు ప్రపంచ యుద్ధాలూ ప్రపంచ దేశాల ఆక్రమణల కోసం సామ్రాజ్యవాద దేశాల మధ్య వచ్చిన తగాదా కారణంగా జరిగాయి. గతంలో సోవియట్, తూర్పు ఐరోపా దేశాల మాదిరి ఒక సోషలిస్టు కూటమి వంటిది లేకపోయినప్పటికీ ప్రధాన వైరుధ్యం సోషలిజం-పెట్టుబడిదారీ విధానం మధ్యనే ఉంది. సామ్రాజ్యవాద దేశాలు జి7 కూటమి పేరుతో ఒక్కటిగా ఉంటూ ప్రపంచ మార్కెట్లను ఆక్రమించుకొనేందుకు చూస్తున్నాయి తప్ప దెబ్బలాడుకోవటం లేదు. చైనా,వియత్నాం, క్యూబాలను దెబ్బతీసేందుకు విడివిడిగా, ఉమ్మడిగా ప్రయత్నిస్తున్నాయి. జి7 దేశాలు రష్యాను కూడా తమతో కలుపుకొని జి8గా మారి జూనియర్ భాగస్వామిగా చేసుకొనేందుకు చూడటంతో రష్యా అంగీకరించలేదు. అందుకే దాన్ని పక్కన పెట్టి కత్తిగట్టాయి. తరువాత ఏం జరుగుతుందో తెలియదుగాని ప్రస్తుతానికి అనివార్య స్థితిలో చైనాకు రష్యా దగ్గరకావాల్సి వచ్చింది. అమెరికాను ఎదుర్కొనేందుకు చైనాకూ రష్యా, ఇరాన్ వంటి దేశాల అవసరం ఉంది. రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు నాజీ కూటమిని ఓడించేందుకు సోవియట్‌తో చేతులు కలపాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. పెట్టుబడిదారీ విధానం ముందుకు పోవటానికి, నూతన మార్కెట్ల వేటలో ప్రపంచీకరణను ముందుకు తెచ్చింది. అది కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. దాంతో పెట్టుబడిదారీ దేశాలు గతం మాదిరి రక్షణ చర్యలకు దిగాయి. గడచిన పదేండ్లలో అమెరికాలో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ఉత్పాదకరంగంలో పెరుగుదల దాదాపు లేదు.అమెరికా వాణిజ్య లోటును తగ్గించటంలో కూడా ట్రంప్, బైడెన్ విఫలమయ్యారు.రక్షణాత్మక చర్యలు కూడా విఫలమయ్యాయి. సోషలిస్టు దేశాలు యుద్ధాన్ని కోరుకోవటం లేదు.అదిరించి బెదిరించి తమ ఉత్పత్తులను అమ్ముకొనేందుకు చూస్తున్నాయి తప్ప సామ్రాజ్యవాదులు యుద్ధం చేసే స్థితిలో లేరు. ఈ పూర్వరంగంలో కుట్ర సిద్ధాంతాలు చెబుతున్నట్లు ఇప్పటికైతే మూడవ ప్రపంచ యుద్ధం వచ్చే స్థితి లేదు. అయితే పెట్టుబడిదారీ విధానం సంక్షోభం, వైఫల్యాన్ని అధిగమించేం దుకు ఎంతకైనా తెగిస్తుందనే అంశాన్ని సదా గమనంలో ఉంచుకోవాలి.
ఎం కోటేశ్వరరావు
8331013288