– నిధులేవి? సిబ్బంది కొరత తీరుస్తారా?
– తగ్గిపోతున్న పిల్లల నమోదు
– సౌకర్యాల లేమితో ఇబ్బందులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
భావి భారత పౌరులైన పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీయాలి. పేద పిల్లల్లో నిబిడీకృతమై ఉన్న ప్రతిభను ప్రోత్సహించేందుకు పలు వేదికలు అవసరం. వారిలో దాగున్న ప్రతిభకు సాన బెట్టేందుకే జవహర్ బాల భవన్‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్‌లో జవహర్ బాలభవన్ డైరెక్టరేట్ నెలకొని ఉంది. అనేక సంవత్సరాలుగా కళకళలాడిన ఈ బాలభవన్ గత కొన్నేండ్లుగా క్రమ క్రమంగా తన విశిష్టతను కోల్పోతున్నది. గత, ప్రస్తుత పాలకుల ఉదాసీనత దీనికి శాపంగా మారింది. పేద పిల్లల మానసిక వికాసానికి ఇది ఎంతో ఉపయోగపడుతున్నా ఈ భవన్ నిర్వహణ కోసం నిధుల కేటాయించేం దుకు ఆసక్తి చూపించకపోవడం, పూర్తి స్థాయి డైరెక్టర్‌ను కూడా నియమించకపోవడం, క్రమేణా నమోదు చేసుకుంటున్న పిల్లల సంఖ్య తగ్గిపోతున్నా… ఇలాంటివేమి ప్రభుత్వానికి పట్టకపోవడంతో సౌకర్యాల లేమితో బాలభవన్ కొట్టుమిట్టాడుతున్నది.
1995 ప్రాంతంలో ఈ సెంటర్‌లో దాదాపు 3 వేల వరకు పిల్లల నమోదు ఉండేది. అది కాస్తా క్రమక్రమేణా తగ్గుతూ గత కొన్నేండ్లుగా వెయ్యి లోపునకు ఆ సంఖ్య పడిపోవడం పేద పిల్లలపై ప్రభుత్వాల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నది. గత పదేండ్లుగా జవహర్ బాలభవన్‌కు పూర్తి స్థాయి డైరెక్టర్‌ను కూడా నియమించకుండా ఇన్‌చార్జీలు, అదనపు బాధ్యతలతో సరిపెడుతూ వచ్చారు. దీంతో వారు కూడా పూర్తి స్థాయిలో బాలభవన్ కార్యక్రమాలపై దృష్టి సారించలేకపోతున్నారు. ఒక వైపు నిధులు ఇవ్వక, డైరెక్టర్‌నూ నియమించక, పదవీ విరమణ చేసిన వారి స్థానంలో కొత్త వారిని రిక్రూట్ చేయకుండా బాలభవన్‌కు ఆదరణ లేకుండా ప్రభుత్వాలే చేశాయనడంలో సందేహం లేదు. దీంతో కార్పొరేట్, ప్రయివేటు వికాస కేంద్రాల్లో తమ పిల్లలను చేర్పించే స్థోమత లేని తల్లిదండ్రులు….. ఇటు బాలభవన్‌లో చేర్పించలేక తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.
గతంలో బాలభవన్‌లో భరతనాట్యం, కూచిపూడి, సైన్స్ ల్యాబ్, క్యారమ్స్, స్విమ్మింగ్, కరాటే, వీణ, మ్యూజిక్ తదితర అంశాలను బోధించేవారు. అయితే ఉపాధ్యాయుల కొరత కారణంగా తబల, కూచిపూడి, స్విమ్మింగ్, కరాటే, ప్లానిటోరియం, వీణ, డ్రామా, పేరిణి వంటివి పక్కన పెట్టినట్టు తెలుస్తున్నది. దీంతో అరకొర అంశాల్లో బోధన మాత్రమే పేద పిల్లలకు మిగిలింది. దీనికి తోడు కనీస వసతుల కల్పన, మౌలిక సదుపాయాలు లేకపోవడం కూడా ఇబ్బంది కలిగిస్తున్నది. కొన్ని సార్లు కేంద్రంలో తాగునీటికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని సిబ్బంది వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే వేసవి శిబిరాన్ని నిర్వహించేందుకు వారు సిద్ధపడుతున్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఏదో అయిందనట్టుగానే శిబిరం నామమాత్రంగానే జరుగుతుందా? లేక ప్రభుత్వం పట్టించుకుని నిధులు కేటాయించి, బాలభవన్‌కు పూర్వపు ఉత్సాహాన్ని నింపుతుందో చూడాలి.
జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి
రాష్ట్రంలో ఆయా జిల్లాల్లో ఉన్న బాలభవన్, బాల కేంద్రాల్లోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నట్టు తెలుస్తున్నది. 10 బాలభవన్లు, 12 బాల కేంద్రాలున్నప్పటికీ గతంలో కన్నా వాటిలో అత్యధికమైన వాటిలో జవహర్ బాలభవన్ డైరెక్టరేట్‌లో ఉన్న పరిస్థితులే ఉన్నాయని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఏడాదంతా విద్యా అంశాలతో బిజీగా ఉండి వేసవిలో ఉల్లాసాన్నిచ్చే అంశాల్లో శిక్షణ పొందే అవకాశమున్నా.. బాలభవన్‌లు, కేంద్రాలు నిరాదరణకు గురవుతున్నాయి. సరైన భవనాలు, శిక్షణా సామాగ్రి, సిబ్బంది కొరత, సదుపాయాల లేమిని తీర్చాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
అవసరాలను గుర్తిస్తున్నాం
జవహర్ బాలభవన్ రెగ్యులర్ శిక్షణతో పాటు వేసవి శిబిరం కోసం పిల్లలను ప్రోత్సహిస్తున్నట్టు జవహర్ బాలభవన్ ఇన్‌చార్జి డైరెక్టర్ ఎస్.విజయలక్ష్మి తెలిపారు. పిల్లల నమోదు కార్యక్రమం పూర్తయిన తర్వాత అవసరాల మేరకు బయటి నుంచి సిబ్బందిని రప్పించి వినియోగించుకుంటామని చెప్పారు. అన్ని విషయాలను పరిశీలిస్తున్నామనీ, శిబిరాన్ని మరింత బాగా నడిపించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
– ఎస్.విజయలక్ష్మి, డైరెక్టర్