కచ్చితంగా పగ తీర్చుకుంటా…

రాజాధిరాజ.. రాజ గంభీర.. రాజ మార్తాండ.. రాజ కుల తిలక అంటూ వేట్టయ రాజా వేంచేయనున్నారు. 17 సంవత్సరాల క్రితం ‘చంద్రముఖి’ తన బందీగా ఉంటున్న గది తలుపులు తెరుచుకుని వేట్టయ రాజాపై పగ తీర్చుకోవటానికి ప్రయత్నించి విఫలమైంది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు తన పగ తీర్చుకోవటానికి వచ్చేస్తోంది. అదెప్పుడు.. ఎక్కడ.. ఎలా అనేది తెలుసుకోవాలంటే ఈనెల 15 వరకు ఆగాల్సిందేనంటున్నారు మేకర్స్‌. రాఘవ లారెన్స్‌ హీరోగా బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రం ‘చంద్రముఖి 2’. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సుభాస్కరన్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్‌ పి.వాసు తెరకెక్కించారు. వినాయక చవితి సందర్భంగా తెలుగు, తమిళ భాషల్లో ఈనెల 15న ఈ సినిమా విడుదలవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని రాధాకష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై వెంకట్‌ ఉప్పుటూరి, వెంకట రత్నం శాఖమూరి రిలీజ్‌ చేస్తున్నారు. ఆదివారం చిత్ర యూనిట్‌ ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇందులో రాఘవ లారెన్స్‌ రెండు షేడ్స్‌లో, చంద్రముఖి పాత్రలో కంగనా రనౌత్‌, బసవయ్య పాత్రలో వడివేలు మెప్పించబోతున్నారని ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతోంది.