– సిరీస్ విజయంపై సూర్యసేన గురి
– భారత్, ఇంగ్లాండ్ మూడో టీ20 నేడు
– రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
భయమెరుగని క్రికెట్‌తో దడ పుట్టిస్తోన్న టీమ్ ఇండియా సిరీస్ విజయంపై కన్నేసింది. స్పిన్ ఫోబియాలో విలవిల్లాడుతున్న ఇంగ్లాండ్ రాజ్‌కోట్‌లోనైనా మాయకు చెక్ పెట్టాలని భావిస్తోంది. బ్యాట్‌తో, బంతితో టీమ్ ఇండియా సూపర్ ఫామ్‌లో ఉండటంతో నేడు విజయమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది. భారత్, ఇంగ్లాండ్ మూడో టీ20 నేడు.
నవతెలంగాణ-రాజ్‌కోట్
17 మ్యాచులు. 15 విజయాలు, రెండే పరాజయాలు. 2024 టీ20 ప్రపంచకప్ తర్వాత పొట్టి ఫార్మాట్‌లో టీమ్ ఇండియా జోరు ఇది. టీ20ల్లో అజేయ జట్టుగా ఎదుగుతున్న టీమ్ ఇండియా..వైవిధ్యభరిత మేళవింపుతో శత్రు దుర్బేద్యంగా మారుతోంది. జశ్‌ప్రీత్ బుమ్రా, కుల్‌దీప్ యాదవ్‌లు సైతం జట్టులోకి వస్తే… భారత టీ20 జట్టును ఎదుర్కొనే ఆలోచన సైతం ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టించటం ఖాయం. భయమెరుగని ధనాధన్ క్రికెట్ ఆడుతున్న టీమ్ ఇండియా నేడు రాజ్‌కోట్‌లోనూ అదే ఫార్ములాతో బరిలోకి దిగుతోంది. 0-2తో సిరీస్‌ను చేజార్చుకునే ప్రమాదంలో పడిన ఇంగ్లాండ్.. సిరీస్‌లో ఆశలు సజీవంగా నిలుపుకునేందుకు అన్ని అస్త్రాలు సంధించేందుకు సిద్ధమవుతోంది.
అదిరే బ్యాటింగ్ లైనప్
టీమ్ ఇండియా బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మ నిలకడగా భారీ స్కోర్లు సాధిస్తున్నారు. పవర్‌ప్లేలో అభిషేక్ శర్మ ఊచకోత నిలువరించటం ఇంగ్లాండ్‌కు తలనొప్పిగా మారింది. తొలి రెండు మ్యాచుల్లో కాస్త వెనకడుగు వేసిన సంజు శాంసన్.. రాజ్‌కోట్‌లో మెరుపు ఇన్నింగ్స్‌పై కన్నేశాడు. హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ చెపాక్‌లో అసమాన ఇన్నింగ్స్‌తో అందరిని ఆకట్టుకున్నాడు. సహచర బ్యాటర్లు అందరూ డగౌట్‌కు చేరుకున్నా.. టెయిలెండర్ల సాయంతో భారత్‌కు అలవోక విజయాన్ని అందించాడు. స్పిన్, పేస్‌ను తిలక్ వర్మ సునాయాసంగా ఎదుర్కొన్నాడు. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ప్రస్తుత జట్టులో సీనియర్లు. ఈ ఇద్దరు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. బంతితో హార్దిక్ మెరిసినా.. బ్యాట్‌తో తనదైన మెరుపులు బాకీ పడ్డాడు. ధ్రువ్ జురెల్ స్థానంలో నేడు రమణ్‌దీప్ సింగ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం లేకపోలేదు. తుది జట్టులో స్పిన్నర్లకు మరోసారి ప్రాధాన్యత దక్కనుంది. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ సహా రవి బిష్ణోరు, వరుణ్ చక్రవర్తిలు ఆడనున్నారు. దీంతో ఇంగ్లాండ్ ఏకంగా 14-16 ఓవర్ల మాయజాలాన్ని ఎదురొడ్డి నిలవాల్సి ఉంటుంది. అర్షదీప్ సింగ్‌తో కలిసి హార్దిక్ పాండ్య పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు.
తుది జట్లు (అంచనా) :
భారత్ : సంజు శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోరు, వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లాండ్ : ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లివింగ్‌స్టోన్, జేమీ స్మిత్, జెమీ ఓవర్టన్, బ్రైడన్ కార్సె, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్‌వుడ్.