‘అందరికీ న్యాయం’ అందుతుందా?

భారతదేశ రాజ్యాంగంలో పొందుపరిచిన అధికరణం 14, 22ల ద్వారా చట్టం ముందు అందరూ సమానమని, అందరికీ న్యాయం పొందే ప్రాథమిక హక్కు ఉందని స్పష్టం చేసింది. ఆర్థిక అసమానతలు, కులవివక్ష, పేదరికం, నిరక్షరాస్యత, అధిక జనాభా, నిరుద్యోగ సమస్యల కారణంగా పేదలకు న్యాయం సత్వరమే అందడం లేదని చరిత్ర చెబు తున్నది. దీనిని దృష్టిలో ఉంచుకొని అందరికీ న్యాయ సేవలు, సత్వరమే ఉచిత న్యాయం అం దించే విధానపరమైన అంశాల్లో సామాన్య ప్రజానీకానికి అవగాహన కల్పించే సదుద్దేశంతో ప్రతియేటా 09 నవంబర్‌ రోజున ”జాతీయ న్యాయ సేవల దినం (నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ డే)”పాటిస్తోంది.
1995లో దేశ సుప్రీం కోర్టు ప్రారంభించిన జాతీయ న్యాయ సేవల దినం ద్వారా పేద, బడుగు, నిరక్షరాస్యులకు ఉచితంగా సివిల్‌, క్రిమినల్‌, రెవెన్యూ కోర్టులు, ట్రిబ్యునల్స్‌ ద్వారా న్యాయ సేవలు అందించే సదుపాయాలను ప్రచారం చేస్తోంది. నిరుపేదలకు ఉచిత న్యాయ సేవలు, న్యాయ సలహాలు, న్యాయ సేవల విస్తరణ, న్యాయసేవల అవగాహన, లోక్‌అదా లత్‌ల నిర్వహణ, దీర్ఘకాలిక సమస్యలకు సత్వర పరిష్కారం, హింసా బాధి తులకు పరిహారం అందించుట వంటి లక్ష్యాలతో న్యాయ సేవల విస్తరణ జరుగుతోంది. ఉచిత న్యాయ సేవలు పొందేందుకు అర్హత కలిగిన వారిలో పేద మహిళలు, పిల్లలు, అంగవైక ల్యంతో బాధ పడేవారు, దళితులు, గిరిజనులు, పారిశ్రా మిక కార్మికులు, కస్టడీలో ఉన్నవారు, ప్రకతి వైపరీత్యాల బాధితులు, కుల వివక్షకు గురైన వారు, భిక్షాటన చేసేవారు, మానవ అక్రమ రవాణా చేసే వారు, వార్షిక ఆదాయం రూ. లక్ష లోపు ఉన్నవారు వస్తారు.
అన్ని వర్గాల ప్రజలకు ఉచిత న్యాయ సేవలు అందించే ప్రత్యామ్నాయ వివాద పరి ష్కార సంస్థల్లో జాతీయ న్యాయ సేవా సంస్థ (నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ-నల్సా), రాష్ట్ర న్యాయ సేవా సంస్థ (స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ), జిల్లా న్యాయ సేవా సంస్థ (డిస్ట్రిక్ట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ), సబ్‌డివిజనల్‌ స్థాయి న్యాయ సేవా సంస్థ (సబ్‌డివిజనల్‌ లెవల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ)లు వివిధ స్థాయిల్లో అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటుగా సుప్రీమ్‌ కోర్టు, హైకోర్ట్‌ న్యాయ సేవా కమిటీలు తమ విధులను నిర్వహిస్తూ ఉన్నాయి. నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ చట్టం, 1987 ద్వారా చట్టం చేయబడిన తరువాత 1995 నుంచి అమలు అవుతున్నది.
నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ డే సందర్భంగా దేశవ్యాప్తంగా లోక్‌ అదాలత్‌ల నిర్వహణ, లీగల్‌ లిటరసీ క్యాంపులు, మద్యవర్తిత్వం, ఉచిత న్యాయ సలహాలు అందించే ఏర్పాటు చేయ డం జరుగుతుంది. ఆర్థిక, సామాజిక, లింగ వివక్షలు లేకుండా అందరికీ న్యాయం అందిం చడం రాజ్యాంగం విధించిన భాద్యతగా నల్సా ఏర్పాటు చేయబడింది. ఖరీదైన న్యాయ వ్యవస్థ దేశ నిరుపేదలకు, నిమ్నజాతులకు, బడుగు వర్గాలకు దూరంగా ఉండ టంతో అంద రికీ న్యాయం అందడం లేదని నిరాశ పడే అభాగ్యులకు అండగా ఉంటూ, లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ స్వతంత్ర విభాగంగా, పేద ప్రజల ముంగిట్లో విధిగా సత్వర ఉచిత న్యాయాన్ని అందిస్తోంది. అయితే దీనిపై అవగాహన కల్పించాల్సిన అవసర ముంది. సత్వరమే న్యాయం అందకపోతే న్యాయ సేవాసంస్థల్ని ఆశ్రయించాలి. అందరికీ సమానంగా న్యాయాన్ని అందించే మహత్తర యజ్ఞంలో ప్రజలు కూడా భాగస్వాములవ్వాలి.
(నేడు ‘జాతీయ న్యాయ సేవల దినం’)
– డా. బుర్ర మధుసూదన్‌ రెడ్డి, 9949700037